ఆ విష‌యంలో జ‌గ‌న్‌కు త‌ప్పిన‌ బాధ

రేపు బ‌ద్వేల్‌, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో పోల్చుకుంటే ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు ఓ బాధ త‌ప్పింది. ఓటుకు నోటు పంపిణీ విష‌యంలో జ‌గ‌న్ నిశ్చింతంగా ఉన్నారు. …

రేపు బ‌ద్వేల్‌, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో పోల్చుకుంటే ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు ఓ బాధ త‌ప్పింది. ఓటుకు నోటు పంపిణీ విష‌యంలో జ‌గ‌న్ నిశ్చింతంగా ఉన్నారు. 

ఇదే కేసీఆర్ విష‌యానికి వ‌స్తే… ఉప ఎన్నిక అంటే త‌ల ప్రాణం తోక‌కు వ‌స్తున్న చందమైంది. తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థిగా బీజేపీ నీడ‌లా వెంటాడుతుండ‌డంతో కేసీఆర్ వెన్నులో వ‌ణుకు పుడుతోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మ‌రీ ముఖ్యంగా దుబ్బాక‌లో  బీజేపీ చావు దెబ్బ తీయ‌డం టీఆర్ఎస్‌లో భ‌యాందోళ‌నను నింపింది. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌గ‌న్‌కు అలాంటి ప‌రిస్థితి లేదు. వైసీపీ అడ‌గ‌కుండానే ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి టీడీపీ ఉప ఎన్నిక బ‌రి నుంచి త‌ప్పుకుంది. ఓటుకు నోటు పంపిణీ విష‌యంలో జ‌గ‌న్ క‌ఠినంగా ఉంటున్నారు. తిరుప‌తి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నిక‌లో ఓటుకు నోటు పంపిణీ చేయ‌లేదు. అధికార పార్టీ డ‌బ్బు పంపిణీ చేయ‌క‌పోవ‌డంతో ప్ర‌తిప‌క్షాలు ఊపిరి పీల్చుకున్నాయి.

బ‌ద్వేల్ విష‌యానికి వ‌స్తే వైసీపీ ఓటుకు 500 రూపాయ‌లు పంపిణీ చేస్తున్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి. ఇది కూడా కూలి గిట్టుబాటు అయ్యేంత మొత్తమ‌ని వైసీపీ చెబుతోంది. ఇక కాంగ్రెస్‌, బీజేపీలు మాత్రం డ‌బ్బు పంపిణీ ఊసే ఎత్త‌డం లేదు. హుజూరాబాద్‌లో నువ్వానేనా అన్న‌ట్టు టీఆర్ఎస్‌, బీజేపీ మ‌ధ్య ర‌సవ‌త్త‌ర పోటీ సాగుతుండ‌డంతో ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ పెట్ట‌డంలో కూడా పోటీ ప‌డుతున్నాయ‌ని స‌మాచారం.

హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం వ్యాప్తంగా ఓటుకు డ‌బ్బు ఇవ్వాలంటూ ప్ర‌జ‌లు రోడ్డెక్క‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఓట్లు రావ‌ని భావించిన కొన్ని చోట్ల‌ టీఆర్ఎస్ , బీజేపీలు  డ‌బ్బు పంపిణీ చేయ‌లేదు. దీనిపై ఓట‌ర్ల నుంచి పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్త‌మ‌వు తోంది. హుజూరాబాద్‌ మండలంలోని పాపయ్యపల్లిలో ,వీణవంక మండలం గంగారంలో, ఇల్లందకుంట మండలం సీతంపేటలో ముఖ్యంగా మ‌హిళ‌లు ఆందోళ‌న‌కు దిగారు.

ఏపీలో ఓట్ల‌కు డ‌బ్బు ఇవ్వ‌ర‌నే విష‌యాన్ని ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం జ‌నాల్లోకి తీసుకెళ్ల‌డంతో వారు కూడా మాన‌సికంగా సిద్ధ‌మయ్యారు. కానీ తెలంగాణ‌లో పంతాలు, ప‌ట్టింపుల‌కు పోయి ఓట్ల‌కు డ‌బ్బు పంపిణీలో అదుపులేకుండా పోతోంది. అంతిమంగా ఇది నిర‌స‌న‌ల‌కు దిగే ప‌రిస్థితిని రాజ‌కీయ పార్టీలే క‌ల్పిస్తున్న‌ట్టైంది. ఓటర్ల ప్ర‌లోభాలపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం చెబుతున్న నీతిసూత్రాలు ఎవ‌రికీ ప‌ట్ట‌డం లేదు. అంతిమంగా డ‌బ్బే ఓట‌ర్ల‌ను పోలింగ్ కేంద్రాల వ‌ద్ద‌కు న‌డిపించేలా ఉంది. ఇదే నిష్టుర స‌త్యం.