ఊహించని నిశ్శబ్దం.. పవన్ కల్యాణ్ కు ఏమైంది?

ఏపీలో 12 మున్సిపాల్టీలు, ఒక కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. వైసీపీ విజయంతో నాయకుల్లో, కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపైంది. కుప్పంలో కూసాలు కదిలిపోయి చంద్రబాబు దిగాలు పడ్డారు, వాళ్లు సీట్లు గెలిచారు, మేం మనసులు…

ఏపీలో 12 మున్సిపాల్టీలు, ఒక కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. వైసీపీ విజయంతో నాయకుల్లో, కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపైంది. కుప్పంలో కూసాలు కదిలిపోయి చంద్రబాబు దిగాలు పడ్డారు, వాళ్లు సీట్లు గెలిచారు, మేం మనసులు గెలిచామంటూ ఆడలేక మద్దెల సామెతలు చెప్పుకుంటున్నారు. 

ఎల్లో మీడియా అయితే మరో అడుగు ముందుకేసి, ఓట్ల సంఖ్యను లెక్కగడుతూ.. చాలా స్వల్ప తేడా మాత్రమే అంటూ కవరింగ్ చేసుకోలేక అవస్తలు పడుతోంది. మరి పవన్ కల్యాణ్ సంగతేంటి..? ఫలితాల రోజున జనసేన మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చూపిస్తామంటూ జనసేన నాయకులు రంకెలేశారు. అంతకుముందే చాలా మున్సిపాల్టీల్లో జనసేన ధ్వంసమైన రోడ్ల మరమ్మతుల కోసం ఉద్యమం చేసింది, ఆ ఉత్సాహం వారిలో ఎలాగూ ఉంది. దీంతో ఒకింత ధీమాగా వారు బరిలో దిగారు. 

ఓ దశలో బీజేపీతో పొత్తు కూడా లేదని చెప్పినా చివరకు కమలదళంతో సీట్లు పంచుకుని నామినేషన్లు వేశారు. ఫలితాల విషయంలో జనసేన ఆశ నిరాశగా మారింది. ఆకివీడులో 3, దాచేపల్లిలో 1, గురజాలలో 1 వార్డులను జనసేన కైవసం చేసుకుంది. ఇక బీజేపీ స్కోరు జీరో. దీంతో ఫలితాలపై విశ్లేశించేందుకు రెండు పార్టీలు వెనకడుగేశాయి.

పొత్తు చిత్తయినందుకేనా..?

జనసేన సొంతంగా అన్ని స్థానాల్లో పోటీ చేసి ఉంటే మరింత మెరుగైన ఫలితాలు సాధించి ఉండేదనేది స్థానిక నేతల వాదన. అదే సమయంలో వైసీపీ ఘన విజయాన్ని ఎలా అభివర్ణించాలో జనసేనకు తెలియడం లేదు. వైసీపీ తొండి చేసింది అంటే.. కనీసం టీడీపీకైనా చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు వచ్చాయి, జనసేనకు ఆమాత్రం కూడా రాలేదు కదా.. ఇక్కడే జనసేనకు అసలు లాజిక్ దొరకడంలేదు. అందుకే వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించారు జనసేనాని.

ఫలితాలు వచ్చినరోజు జనసేన ట్విట్టర్ అకౌంట్ అధికారికంగా మూగబోయింది. కనీసం జిల్లాల్లో కూడా ఏ ఒక్క నాయకుడు నోరు మెదపలేదు. ఆ మేరకు జనసేన అధిష్టానం నుంచి ఆదేశాలు రావడంతో అన్ని చోట్లా జనసేన ఆఫీస్ లకు తాళం పడింది. 

అన్నిటిపై నింపాదిగా, నిదానంగా స్పందించే పవన్ కల్యాణ్.. రెండ్రోజుల తర్వాతైనా మున్సిపల్ ఫలితాలపై మాట్లాడాల్సిందే. మరి అప్పుడు ఏ లాజిక్ వెదుకుతారో, ఎవరి బలం పెరిగిందంటారో, పాతికేళ్ల పోరాటంలో ఇది ఎన్నో మెట్టు అని చెబుతారో వేచి చూడాలి.