కొడాలి నాని సైలెంట్ అయ్యారు. ఇదేదో ప్రతిపక్షాలు వేసిన సెటైర్ కాదు, అధికార పార్టీలోనే నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. ఆమధ్య దేవినేని ఉమా అరెస్ట్ అనంతరం ప్రెస్ మీట్ పెట్టి తన శైలికి భిన్నంగా 20 నిముషాల్లోనే ముగించారు నాని. అప్పుడే ఏదో తేడా కొట్టిందనే అనుమానాలు మొదలయ్యాయి.
తాజాగా ఏపీ అప్పులపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నా కొడాలి బయటకు రాకపోవడంతో ఆ అనుమానాలు బలపడుతున్నాయి.
విరుచుకుపడ్డంలో విభిన్న శైలి
ప్రతిపక్షాలపై విరుచుకుపడాలంటే కొడాలి నాని తర్వాతే ఎవరైనా. మరీ ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ ను కడిగి పారేయడంలో తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు నాని. కుక్కలు, నక్కలు, తోడేళ్లు, గడ్డి పోచ అంటూ.. మరీ చీప్ గా తీసిపారేస్తారు.
కనీసం వాటికి కౌంటర్లు కూడా ఇచ్చేందుకు ఎవరూ సాహసం చేయరంటే.. కొడాలి పంచ్ లు ఏ రేంజ్ లో ఉండేవో అర్థం చేసుకోవచ్చు. ప్రెస్ మీట్ పెడితే గంటకు తక్కువగా చాకిరేవు కార్యక్రమం ఎప్పుడూ ఆగిపోదు. మరి ఆ మాటల తూటాలు ఇప్పుడేమయ్యాయి? అసలు నాని ఎందుకు సైలెంట్ అయ్యారు.
బూతుల మంత్రి అంటూ కొడాలిపై ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తుంటే అంతకు మించి అన్నట్టుగా సాగేవి కొడాలి పంచ్ లు. అలాంటి నాని ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చెలరేగుతున్నా సైలెంట్ గా ఉండిపోవడం ఆశ్చర్యం. రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం సమయంలో కూడా కొడాలి తన స్థాయికి తగ్గట్టు విమర్శలు ఎక్కుపెట్టలేదు. ఆ మధ్య జాబ్ క్యాలెండర్ రాద్ధాంతాన్ని కూడా ఆయన లైట్ తీసుకున్నారు.
తాజాగా అప్పుల భారంపై టీడీపీ, బీజేపీ రాద్ధాంతం చేస్తున్నా నాని పట్టించుకోవడం లేదు. సజ్జల ఒక్కరే దీన్ని తిప్పికొడుతున్నారు. సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా తన వంతుగా విమర్శకుల నోళ్లు మూయించే ప్రయత్నాలు చేస్తున్నారు.
అన్నీ ఉన్నా అదొక్కటే తక్కువైంది..
సజ్జల, బొత్స.. ఇలా ఎవరు ఏం మాట్లాడినా అదంతా వెజిటేరియన్ మీల్స్ లాగానే ఉంటుంది. కొడాలి పంచ్ పడితేనా దానికి పరిపూర్ణత్వం వస్తుంది. కానీ ఎందుకో కొడాలి సైలెంట్ అయ్యారు. ప్రతిపక్షాల్లోనే కాదు, అధికార పక్షంలో కూడా ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది.