మరోసారి లాక్ డౌన్ దిశగా ఆంధ్రప్రదేశ్..?

కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న క్రమంలో ఏపీలో అన్ లాక్ నిబంధనలు పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చాయి. అయితే మరీ తెలంగాణలాగా గేట్లు ఎత్తేయకుండా నైట్ కర్ఫ్యూని అలానే కొనసాగిస్తూ ప్రభుత్వం కాస్త…

కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న క్రమంలో ఏపీలో అన్ లాక్ నిబంధనలు పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చాయి. అయితే మరీ తెలంగాణలాగా గేట్లు ఎత్తేయకుండా నైట్ కర్ఫ్యూని అలానే కొనసాగిస్తూ ప్రభుత్వం కాస్త ముందు చూపుతో వ్యవహరించింది. అయినా కూడా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. 

ముఖ్యంగా చిత్తూరు, గుంటూరు, పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాలు హాట్ స్పాట్ గా మారాయి. దీంతో స్థానిక అధికార యంత్రాంగం ఎక్కడికక్కడ లాక్ డౌన్ నిబంధనలు అమలులో పెట్టేసింది.

లాక్ డౌన్ లోకల్..

ఫస్ట్ వేవ్ లో కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకుని అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించింది. అన్ లాక్ సడలింపులు కూడా అన్ని చోట్లా ఒకేరకంగా ఉండేలా చూసింది. సెకండ్ వేవ్ లో రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకున్నాయి. ఎక్కడికక్కడ కట్టడి చర్యలు తీసుకున్నాయి. ఇప్పుడు మూడో వేవ్ ముంచుకొస్తుందన్న వార్తల నేపథ్యంలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో స్థానిక అధికారులే చొరవ తీసుకున్నారు.

గుంటూరు నగరంతో పాటు, జిల్లాలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో కర్ఫ్యూ అమలవుతోంది. నగరంలోని బ్రాడీపేటను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించడంతో పాటు మధ్యాహ్నం వరకే వ్యాపార కార్యకలాపాలకు అనుమతిస్తున్నారు. తిరిగి మరుసటి రోజు ఉదయం వరకు అక్కడ కఠినంగా లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో కావలి, పొదలకూరు, వింజమూరు, విడవలూరు ప్రాంతాల్లో నిబంధనలు కఠినతరం చేశారు. మధ్యాహ్నం వరకే షాపులకు పర్మిషన్ ఇస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వీకెండ్ లాక్ డౌన్ అమలులో ఉంది ఆదివారం ఉదయం 10 గంటల వరకే పర్మిషన్ ఉంటుంది. ఆ తర్వాత రోడ్లపైకి నో ఎంట్రీ.

లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారం

సెకండ్ వేవ్ సమయంలో కూడా దాదాపుగా ఇలానే జరిగింది. ముందుగా కేసులు పెరుగుతున్న జిల్లాల అధికారులు ఎక్కడికక్కడ లాక్ డౌన్ అనేశారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఏపీలో మరోసారి లాక్ డౌన్ తప్పదేమో అనేలా ఉన్నాయి పరిణామాలు.

ఇటీవల అన్ లాక్ సడలింపులు అమలులోకి వచ్చాయి, విందులు, వినోదాలు, విహార యాత్రలు ఎక్కువయ్యాయి. దీంతో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ దశలో కరోనాని కట్టడి చేయాలంటే మాస్క్ లు, శానిటైజర్లు, సామాజిక దూరం అనే మాటల్ని ఎవరూ పాటించడం లేదు. దీనికి లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారం అని గత అనుభవాలు చెబుతుండటంతో అధికారులు కూడా ఆంక్షలవైపే మొగ్గు చూపుతున్నారు.