“తోక జాడిస్తే కత్తిరిస్తా.. విమర్శలు చేసేవాళ్లు పార్టీ వదిలిపెట్టి వెళ్లండి..” ఇవీ ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్ రాజకీయ క్షేత్రంలో పేలుస్తున్న సినిమా పంచ్ డైలాగులు. కానీ పవన్ మాటల మనిషే.. చేతల మనిషి కాదు. ఆమాత్రం చేతల మనిషి అయి ఉంటే.. ఈ పాటికే రాపాక విషయంలో తాడో పేడో తేల్చుకునేవారు. ఆ పని మాత్రం పవన్ చేయడం లేదు.
రాజోలు నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలు మాత్రం ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై కారాలు మిరియాలు నూరుతున్నారు. గాజు గ్లాసు గుర్తుపై గెలిచిన రాపాక.. ఇప్పుడు చల్లగా 'ఫ్యాన్' కింద కూర్చోవడాన్ని వారు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.
దమ్ముంటే రాజీనామా చేసి ఫ్యాను గుర్తుపై గెలవాలని సవాల్ విసురుతున్నారు. రాజోలులో జనసైనికులకు ఉన్న ధైర్యం, నమ్మకం అది. పవన్ కు ఆ మాత్రం కూడా ధైర్యం లేనట్టుంది. రాపాక ఇప్పుడు పూర్తిగా వైసీపీ మనిషి. ఆయన తన నియోజకవర్గం రాజోలులో జనసేన కార్యకర్తల్ని దగ్గరకు కూడా రానివ్వడం లేదు.
వైసీపీ శ్రేణులతోనే ముచ్చట్లు పెడుతున్నారు. రీసెంట్ గా తన కొడుకును కూడా వైసీపీలో జాయిన్ చేశారు. అసెంబ్లీ లోపల, బయట జగన్ ను పొగడ్తలతో ముంచెత్తే కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపడుతున్నారు. జగన్ కి జై కొట్టడంలో వైసీపీ నేతలు సైతం రాపాక దరిదాపుల్లోకి రారంటే అతిశయోక్తి కాదు.
ఇంత జరుగుతుంటే, పవన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేదే అసలు సందేహం. పిలిపించి మాట్లాడే పరిస్థితి ఇప్పుడిక లేదు. ఇష్టం లేకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉన్నా కూడా ఆయన వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు.
కనీసం అనర్హత వేటు వేయమని స్పీకర్ ను కోరొచ్చు, దమ్ముంటే రాజీనామా చేసి గెలువు అంటూ రాపాకకే సవాల్ విసరొచ్చు. కానీ పవన్ అవేవీ చేయడం లేదు. ఎందుకంటే పవన్ కు ఆమాత్రం ధైర్యం లేదు. అయితే ధైర్యం లేదు అనడం కంటే.. పవన్ కి వచ్చే లాభం ఏమీ లేదనేది అసలు విషయం.
రాజోలు ఎస్సీ రిజర్వ్ డ్ నియోజకవర్గం. ఒకవేళ రాపాక రాజీనామా చేసినా, స్పీకర్ తో అనర్హత వేటు వేయించినా అక్కడ పవన్ కల్యాణ్ పోటీ చేసే అవకాశం లేదు. మరో గట్టి అభ్యర్థి కూడా లేడు. ఎలాగూ తనకి పనికొచ్చే పని కాదు కాబట్టి పవన్ ఈ విషయంలో పట్టుబట్టడం లేదనేది అర్థమవుతోంది.
రాపాక బదులు ఇంకెవర్ని నిలబెట్టినా విరామం లేకుండా ప్రచారం చేసిపెట్టాలి. జనసేన ఓడిపోతే అధికార పార్టీ అరాచకాలు అని నెపం నెట్టేయొచ్చు. పొరపాటున గెలిస్తే.. పవన్ ఇగో దెబ్బతింటుంది.
తనని రెండుచోట్లా ఓడించిన ప్రజలు.. తాను సస్పెండ్ చేసిన రాపాకను మరోసారి గెలిపిస్తే పవన్ దాన్ని జీర్ణించుకోలేరు. అందుకే రాజోలు జోలికి, రాపాక జోలికి వెళ్ల కూడదని అనుకుంటున్నారు.