రాష్ట్రంలోని పేదలందరికీ జులై 8న ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి దాదాపు రంగం సిద్ధమైంది. సుమారు 25లక్షల మందికి ఈ ఉగాది నాటికే ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాల్సి ఉన్నా.. కరోనా కారణంగా అది వాయిదా పడింది. ఇప్పుడు స్థలాల సేకరణ ఓ కొలిక్కి వచ్చింది, ఇక పట్టాలు పంచడమే తరువాయి. ఇలా అంతే ఓకే అనుకుంటున్న టైమ్ లో టీడీపీ నేతలంతా ఇళ్ల స్థలాలపై రచ్చ చేస్తున్నారు.
ఈ స్థలాల సేకరణలో ప్రతి నియోజకవర్గంలో వందల కోట్ల అవినీతి జరిగిందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల సీజేఎఫ్ఎస్ భూములు లాక్కున్నారని, ఎస్సీ-ఎస్టీల నుంచి భూములు స్వాధీనం చేసుకుంటున్నారని, రాజధాని భూములను పేదలకిస్తున్నారని గోల గోల చేస్తున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ టైమ్ దగ్గరపడుతుండే సరికి టీడీపీ నేతల్లో ఇలా అసహనం అమాంతం పెరిగిపోతోంది. చంద్రబాబు సైతం ఈ వ్యవహారంపై ఎప్పుడూ లేనంత గొడవ చేస్తున్నారు. అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు.
వాస్తవానికి పాతిక లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ అంటే.. అది రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టం. ఈ పాతిక లక్షల కుటుంబాలు వైఎస్ జగన్ పేరు చెప్పుకుని ఓ గూడు ఏర్పాటు చేసుకుంటాయి. తమకంటూ ఓ స్థిరాస్తి ఉందని గొప్పగా చెప్పుకుంటాయి. ఆడబిడ్డలున్న కుటుంబాలకు భరోసా ఉంటుంది, అద్దె ఇళ్లలో బతుకీడ్చే నిరుపేదలకు ఓ ఆసరా దొరుకుతుంది.
జగన్ అమలు చేస్తున్న నవరత్నాలలో ప్రతి కుటుంబానికీ అత్యంత ఎక్కువగా లబ్ధి చేకూర్చేది కూడా ఈ పథకమే. అంటే ప్రతి లబ్ధిదారుడు, వారి కుటుంబం.. జీవితాంతం జగన్ కు రుణపడి ఉంటుందన్నమాట. అందుకే దీనిపై పచ్చ బ్యాచ్ కి అంత అక్కసు. పథకం అమలు తేదీ దగ్గర పడుతుండేసరికి ఆ అక్కసునంతా కక్కేస్తున్నారు టీడీపీ నేతలు.
గతంలో ప్రజల వద్ద నుంచి డబ్బులు తీసుకుని హౌస్ ఫర్ ఆల్ పథకంలో ఇళ్లు ఇచ్చినట్టే ఇచ్చి, డమ్మీ గృహప్రవేశాలతో పరువు పోగొట్టుకుంది టీడీపీ. తమ వద్ద డబ్బులు డిపాజిట్ చేయించుకుని, ఇళ్లు స్వాధీనం చేయకుండా త్రిశంకు స్వర్గంలో పెట్టేసినందుకు పేదలందరికీ టీడీపీపై పీకలదాకా కోపం ఉంది. ఇప్పుడు వారిని కాదని కొత్తగా పాతిక లక్షలమందికి పట్టాల పంపిణీ జరిగితే.. టీడీపీకి అది రాజకీయ సమాధి లాంటిదే. టీడీపీ కంచుకోటల్లో కూడా వైసీపీకి బలమైన ఓటు బ్యాంకు తయారవుతుంది.
రాజధాని ప్రాంతంలో అలా పేదల ఓటు బ్యాంకు ఉండకూడదనే ఉద్దేశంతోటే.. సీఆర్డీఏ పరిధిలో ఇళ్ల పట్టాల పంపిణీ జరక్కుండా కోర్టుకెక్కారు టీడీపీ నేతలు. మిగిలిన చోట్ల కూడా వీలైనంత ఎక్కువగా గొడవలు చేయాలని, లబ్ధిదారులు కానివారిని రెచ్చగొట్టాలని చూస్తున్నారు.
అయితే జగన్ మాత్రం ఎన్ని విమర్శలు ఎదురైనా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. మహూర్తం ఫిక్స్ చేసి మరీ అధికారుల్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. చారిత్రక ఘట్టానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. చంద్రబాబు అండ్ కో ఆ చరిత్రను కళ్లారా వీక్షించడానికి సిద్ధంగా ఉండాలంతే.