భార్య భౌతికంగా దూరమైనా…ఆమెతో పంచుకున్న మధుర జ్ఞాపకాలు అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఎంతలా అంటే ఆమె నిలువెత్తు మైనపు విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించేంత. ఆమె మైనపు విగ్రహాన్ని చూస్తే…నిజంగా ఆమె బతికే ఉందనే ఫీలింగ్ తప్పక కలుగుతుంది.
కర్నాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ గుప్తా తన భార్య మైనపు విగ్రహాన్ని చేయించి, ఇంట్లో ప్రతిష్టించి వార్తల కెక్కారు. కొన్నాళ్ల క్రితం శ్రీనివాస్ గుప్తా ఇంట్లో ఓ విషాదం చోటు చేసుకొంది. రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్ గుప్తా భార్య దుర్మరణం పాల య్యారు. చావు మనిషికే కానీ, మనసుకు కాదని ఆ దంపతుల మధ్య ప్రేమానుబంధం నిరూపించింది.
ఇటీవల శ్రీనివాస్ గుప్తా గృహ ప్రవేశం చేశాడు. అయితే ఈ శుభ సమయాన తన భార్య బతికే ఉంటే ఎలా ఉండేదోననే ఆలోచన అతని మనసులో మెదిలింది. గృహ ప్రవేశం సందర్భంగా తన భార్య మొహంలో చిరునవ్వు, సంప్రదాయం ఉట్టిపడే చీరకట్టు, ఒంటినిండా తళతళమని మెరిసే బంగార ఆభరణాలు….ఇలా తన భార్య రూపాన్ని మనో నేత్రం ముందు శ్రీనివాస్ గుప్తా ఆవిష్కరించుకున్నాడు.
మనసుండాలే గానీ, మార్గం ఉండకపోదు. తన ఆలోచనలకు, ప్రేమకు ప్రతి రూపం ఇవ్వాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. దీంతో తన భార్య మైనపు విగ్రహాన్నితయారు చేయించాడు. ఇంట్లో ప్రతిష్టించాడు. ఆ విగ్రహం వద్ద ఆయన కుటుంబ సభ్యులు ఫొటోలకు దిగి మురిసిపోయారు. ఆ విగ్రహం ఎక్కడా మైనంతో తయారు చేసిందనే భావన కలగలేదు. నిజంగా శ్రీనివాస్ గుప్తా భార్య బతికే ఉందనేలా జీవకళ ఉట్టిపడుతోంది. ఈ విగ్రహం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది కదా భార్యపై ప్రేమంటే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.