చెన్నైలో జరిగిన ఓ షూటింగ్‌లో బ్రిటీష్ మోడల్, హీరోయిన్ అమీ జాక్సన్ వెక్కివెక్కి ఏడ్చింది. దీంతో దర్శకుడు ఏఎల్ విజయ్ భయపడ్డాడు. అయితే ఇదంతా ఇప్పుడు జరిగింది కాదు లేండి. పదేళ్ల క్రితం నాటి సంగతి. కొన్ని సంఘటనలు ఎన్నేళ్లైనా మరుపు రావు. అవి మనసులో జీవితాంతం నాటుకుపోతాయి.
అలాంటి ఘటన గురించి దర్శకుడు ఏఎల్ విజయ్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. మనసును వెంటాడుతున్న ఆ అనుభవం గురించి సోషల్ మీడియా వేదికగా ఆయన పంచుకున్నాడు.
పదేళ్ల క్రితం నాటి సంగతి. తమిళంలో “మదరాసు పట్టణం టైటిల్‌షతో దర్శకుడు ఏఎల్ విజయ్ నేతృత్వంలో సినిమా తెరకె క్కింది. ఇందులో బ్రిటీష్ మోడల్ అమీ జాక్సన్‌ను మొదటిసారిగా భారతీయ చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. చెన్నైలో ఆ సినిమా షూటింగ్ చేపట్టారు. ఇదే సమయంలో బ్రిటీష్ మోడల్, ప్రముఖ హీరోయిన్ అమీ ఒక్కసారిగా ఏడ్వడం మొదలు పెట్టారు.
దీంతో తాను భయాందోళనకు గురైనట్టు దర్శకుడు విజయ్ గుర్తు చేసుకున్నాడు. మౌంట్‌రోడ్డులో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎండ బాగా ఉందని, 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని ఆయన చెప్పుకొచ్చాడు. జట్కా బండి నుంచి ఒక్కసారిగా కిందికి దూకి పరుగెత్తుకెళ్లి ఏడుస్తున్న అమీని చూసి ఏమైందో తెలియక కాసేపు తనతో పాటు షూటింగ్‌లో ఉన్న వాళ్లంతా ఆందోళనకు గురయ్యామన్నారు.
ఆ తర్వాత ఆరా తీయగా…అంత ఎండలో గుర్రం కష్టపడడం తాను చూడలేనని, దాన్ని దత్తత తీసుకుంటానని అమీ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకుంటూ ఆనందం వ్యక్తం చేశాడు. ఆ రోజు జట్కా సన్నివేశాల కోసమే ఆ గుర్రాన్ని తెప్పించినట్టు తెలిపాడు. దానికి మరింత తిండి పెట్టే వరకూ ఆమె శాంతించలేదన్నాడు.
అమీన్ గురించి ఇలాంటిదే మరో సంఘటన కూడా కొన్నేళ్ల క్రితం బాగా ప్రచారం జరిగింది. రోబో-2 షూటింగ్‌లో పాల్గొని ఇంటికి వెళుతున్నప్పుడు అమీ రోడ్డు పక్కన కుక్క పిల్లలను చూసి ఆందోళన చెందిందట. వెంటనే కారు ఆపి తన దగ్గరున్న బిస్కెట్లు తెచ్చి పెట్టడంతో పాటు బిస్లరీ వాటర్ ఆ పప్పీలకు పట్టించిన విషయం అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ విషయం తెలిసి అమీ జాక్సన్‌పై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు కూడా. కాగా తమిళంలో తీసిన మదరాసు పట్టణం సినిమాను తెలుగులో 1947 ఎ లవ్ స్టోరీగా తెరకెక్కించారు.