బీజేపీ అడిగిందని గతంలో ఓ రాజ్యసభ సీటుని త్యాగం చేశారు జగన్. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు పార్లమెంట్ లో బేషరతుగా మద్దతిచ్చారు. ఇలా బీజేపీ, వైసీపీ వ్యవహారంపై చాలా కంప్లయింట్లు ఉన్నాయి. అయితే జగన్ ఎప్పుడూ బీజేపీని బహిరంగంగా సమర్థించలేదు, సమర్థించరు కూడా. కానీ ఇప్పుడు మరో అపవాదు జగన్ పై పడింది.
ఐఏఎస్ క్యాడర్ రూల్స్ ని మార్చేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రం దానికి జగన్ మద్దతు కోరుతోంది. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కేరళ.. మాకు సవరణలు నచ్చలేదంటూ కేంద్రానికి లేఖ రాశాయి. పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలు మేం ఒప్పుకోబోమని తీర్మానించాయి, వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
రాగా పోగా.. ఇప్పటివరకూ తమ అభిప్రాయాలు చెప్పిన 15 రాష్ట్రాల్లో కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రమే ఐఏఎస్ క్యాడర్ రూల్స్ లో మార్పులకి తమ సమ్మతి తెలిపాయి. మరి జగన్ ఆ గట్టున ఉంటారా..? ఈ గట్టుకి వస్తారా..?
దేశవ్యాప్తంగా మోదీ ప్రభ వెలిగిపోతోందని సర్వేలు చెబుతున్నా.. వాస్తవానికి బీజేపీకి ఐదు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు పెను సవాల్ గా మారాయి. దాదాపుగా బీజేపీకి వ్యతిరేక ఫలితాలు వస్తాయని అంచనాలున్నాయి. దీంతో సహజంగానే వచ్చే సార్వత్రిక ఎన్నికలపై బీజేపీ బెంగపెట్టుకుంది.
పొత్తులతో ఎత్తులు వేయకపోతే సొంతంగా ఇబ్బంది పడతామనే ఆలోచన వారిలో ఉంది. దీంతో వైసీపీలాంటి తటస్థ పార్టీలపై కర్చీఫ్ వేయాలని చూస్తోంది బీజేపీ. నయానో భయానో తన దారికి తెచ్చుకోవాలని చూస్తోంది. ఇప్పటివరకైతే బీజేపీతో జగన్ శతృత్వాన్ని కోరుకోలేదు, అలాగని ఏపీలో బీజేపీ ఎగిరెగిరి పడుతుంటే చూస్తూ ఊరుకోనూ లేదు.
ఇప్పుడు జగన్ కి మరోసారి సందిగ్ధత ఎదురైంది. ఐఏఎస్ క్యాడర్ రూల్స్ ని ప్రభుత్వం మార్చాలనుకుంటోంది. రాష్ట్రాల హక్కులు తగ్గిపోతాయి కాబట్టి, ముందుగా ముసాయిదా రెడీ చేసి అభిప్రాయాలు కోరింది. వాస్తవంగా చూసుకుంటే, సర్వీస్ రూల్స్ లో తాను అనుకున్న మార్పులు చేయకమానదు కేంద్రం. కానీ ముందు జాగ్రత్తగా రాష్ట్రాల అభిప్రాయాలు కోరింది. ఇక్కడే ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మరి జగన్ ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి.
నిన్నటితో గడువు పూర్తయింది. ఇంకా తమ స్పందన చెప్పని రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉంది. ఇప్పుడు జగన్ వ్యూహాత్మకంగా ఎలా స్పందిస్తారనేదే ప్రశ్నార్థకం. తమిళనాడు, కేరళ, తెలంగాణ వ్యతిరేకిస్తున్న దశలో జగన్ క్యాడర్ రూల్స్ లో మార్పుల్ని సమర్థిస్తే అది పెద్ద సంచలనమే అవుతుంది.