నేచురల్ కరప్షన్ పార్టీ.. ఎన్సీపీ కి గతంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన నిర్వచనం. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అయిన ఎన్సీపీని నేచురల్ కరప్షన్ పార్టీ అంటూ మోడీ నిర్వచించారు. ఎన్నికల ప్రచార సమయాల్లో ఎన్సీపీపై ఈ విధంగా విరుచుకుపడుతూ ఉంటారు మోడీజీ. అయితే.. తెలుసా? ఆ ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి, మహారాష్ట్ర మాజీ సీఎం అయిన శరద్ పవార్ కు మోడీ ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డును ఇచ్చి సత్కరించిందని!
కట్ చేస్తే.. ఇప్పుడు గులాం నబీ ఆజాద్ వంతు. సోనియాకు గతంలో అత్యంత ఆప్తుడు, ఇప్పుడు కాస్త అసంతృప్త వాది. కాంగ్రెస్ పార్టీ బతకాలి, కాంగ్రెస్ ను కాపాడుకోవాలి అనే నినాదాలతో సోనియాతో ఆజాద్ కు కాస్త దూరం పెరిగినట్టుగా పైకి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు గులాం నబీకి మోడీ సర్కారు అత్యున్నత స్థాయి పౌర పురస్కారాల్లో ఒకటైన పుద్మభూషణ్ అవార్డును ప్రకటించింది!
ఉదయం లేస్తే.. బీజేపీ వాళ్లు అరవై యేళ్ల దుష్ట కాంగీయుల పాలన అంటూ తిట్లదండకం అందుకుంటారు. దేశంలో సర్వసమస్యలకూ కారణం కాంగ్రెస్సే అంటూ ఏ ఎన్నికలు వచ్చినా మోడీ చెబుతూ ఉంటారు. ఐదేళ్లకు పైగా సాగిన వాజ్ పేయి పాలనను కానీ, ఇప్పటికే ఏడేళ్లను పూర్తి చేసుకున్న మోడీ పాలనను కానీ లెక్కలోకే వేయరు. దేశానికి స్వతంత్రం వచ్చి ఇంకా అరవై యేళ్లే, ఆ అరవై యేళ్లూ కాంగ్రెస్ పాలనే.. అన్నట్టుగా ఉంటుంది భక్తుల మైండ్ సెట్.
మరి ఈ మైండ్ సెట్ లో కూడా కామెడీగా మారుతోంది కాంగ్రెస్ నేతలకు దక్కుతున్న అత్యున్నత పౌర పురస్కారాలు! మరి ఇప్పటికీ కాంగ్రెస్ తోనే జత అంటున్న పవర్ కూ, కాంగ్రెస్ ను బతికించుకోవడానికి ఆరాటపడుతున్న ఆజాద్ కూ.. అత్యున్నత స్థాయి పౌర పురస్కారాలు అయిపోయాయి.
గులాంనబీ ఆజాద్.. పద్మభూషణ్, పవార్ పద్మవిభూషణ్.. అత్యున్నత స్థాయి పౌర పురస్కారాల్లో మూడు, రెండు వీరికి దక్కాయి. ఇదే లెక్కలో సోనియాకు మొదటిది..భక్త ప్రభుత్వం లెక్కలో కూడా అర్హురాలే కదా! మరి మోడీ ప్రభుత్వం రానున్న రెండేళ్లలోపు.. ఇదే చేత్తో సోనియాకు భారతరత్నను ప్రకటించేస్తే ఓ పనైపోయినట్టుగా ఉంటుంది.