చంద్రబాబుకి అండగా నిలబడి, అవసరం తీరాక ఆయన చేతిలో దారుణంగా మోసపోయిన కమ్మ నేతలు రాష్ట్రంలో చాలామందే ఉన్నారు. అయితే ఎవరూ ఎక్కడా బైటకి రారు, బాబు అన్యాయం గురించి నోరెత్తరు, ఎందుకంటే.. కమ్మ అంటే టీడీపీ, టీడీపీ అంటే చంద్రబాబు.. అలా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు బాబు. కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా, వెళ్లినా అక్కడ వారిని ఎదగనీయకుండా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అలాంటి వారందరికీ ఆశా కిరణంలో కనపడుతున్నారు కొడాలి నాని.
కొడాలి నానికి టీడీపీ నుంచి వచ్చిన వల్లభనేని వంశీ జతకలిశారు. వస్తూ వస్తూనే కమ్మ జాతికి ప్రథమ శత్రువు చంద్రబాబేనంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు వంశీ. హీరో రామ్ చంద్రబాబుని నమ్ముకుని అనవసర విషయాల్లో తలదూరుస్తున్నారని మండిపడ్డారు. ఇన్నాళ్లూ తన వర్గం పేరు చెప్పుకుని, విదేశాల నుంచి విరాళాలు తీసుకుంటూ, పాలనా వ్యవస్థల్లో ఉన్న తన వర్గం వారందరినీ ఓవైపుకి తీసుకొచ్చి చంద్రబాబు ఆడుతున్న నాటకాలన్నీ ఇప్పుడిప్పుడే బైటపడుతున్నాయి.
రాజధాని అమరావతి పేరు చెప్పి తన వర్గం వారితో భూములు కొనిపించి.. అక్కడ భూమాయ సృష్టించారు బాబు. అయితే జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతి ప్రాంతంలో భూములు కొన్న కమ్మ సామాజిక వర్గానికి చెందినవారంతా అడ్డంగా బుక్కయ్యారు. బాబుని నమ్మి తమ పెట్టుబడి అంతా అక్కడే పెట్టామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరూ బహిరంగంగా బాబుపై విమర్శలు చేయకపోవడం ఇక్కడ విచిత్రం. ఇలాంటి వారందరినీ రెచ్చగొట్టి జగన్ పైకి ఎగదోస్తూ పబ్బం గడుపుకుంటున్నారు బాబు.
ఇలాంటి వారి భ్రమలు తొలగించడానికి నాని, వంశీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం జగన్ కూడా కొడాలి నానికి మంత్రి పదవి ఇచ్చి ఆ వర్గాన్ని దగ్గర చేసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే కమ్మ సామాజిక వర్గంలో నందమూరి ఫ్యామిలీపై ఉన్నంత గురి నారావారి కుటుంబంపై లేదు. వియ్యంకుడు నందమూరి బాలకృష్ణను అడ్డం పెట్టుకుని ఇలాంటి వారందరినీ తనవైపు తిప్పుకున్నారు చంద్రబాబు. ఎక్కడా ఎవరూ తనకి ఎదురు తిరగకుండూ చూసుకుంటున్నారు. కానీ ఇప్పుడు నాని, వంశీ బాబుకి కొరకరాని కొయ్యల్లా తయారయ్యారు. వారి నోటికి ఎదురుపోలేక, ప్రతివిమర్శలు చేయలేక సతమతమవుతున్నారు బాబు.
అయితే బాబుకి వ్యతిరేకంగా కమ్మవారందరినీ ఏకం చేయడం అంత సులభమైన వ్యవహారం కాదు. బాబు విద్వేష రాజకీయాలు తెలిసి కూడా ఆ సామాజికవర్గం ఇంకా ఆయన్నే అంటిపెట్టుకుని ఉంది. ఈ లింకు తెగకొట్టడానికి నాని చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికి ఫలిస్తాయో చూడాలి.