లాక్ డౌన్ వల్ల షూటింగ్ ఆగిపోయింది కాబట్టి ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ చేయలేకపోయామని చెబితే ఓకే అన్నారు. ఆ తర్వాత కరోనా సోకడంతో ఇంకాస్త లేట్ అవుతోందని చెబితే బాధపడుతూనే సరే అన్నారు. కానీ ఈసారి మాత్రం రాజమౌళిని సహించలేకపోయారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. హీరోలంతా ఒక్కొక్కరుగా సెట్స్ పైకి వెళ్తున్న నేపథ్యంలో.. జక్కన్నపై ఈరోజు కాస్త గట్టిగానే ట్రోలింగ్ నడుస్తోంది.
'V' సినిమా ఓటీటీలో రిలీజైంది. ఇంటిల్లిపాదితో కలిసి సినిమా చూశాడు రాజమౌళి. అందరూ కలిసి సినిమా చూసిన ఫొటోను కార్తికేయ పోస్ట్ చేశాడు కూడా. సరిగ్గా ఇక్కడే వ్యవహారం అడ్డం తిరిగింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా రంగంలోకి దిగిపోయారు. V సినిమా గురించి మాకెందుకు.. ఆర్ఆర్ఆర్ నుంచి కొమరం భీమ్ టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పమంటూ తెగ కామెంట్స్ పడుతున్నాయి.
హీరోలంతా సెట్స్ పైకి వస్తున్నారు, మీరెప్పుడు సెట్స్ పైకి వస్తున్నారో చెప్పండంటూ రాజమౌళిని టాగ్ చేసి కామెంట్స్ పెడుతున్నారు తారక్ ఫ్యాన్స్. కనీసం ఎన్టీఆర్ టీజర్ షూట్ కోసమైనా తాత్కాలికంగా షూటింగ్ స్టార్ట్ చేయొచ్చు కదా అంటూ తారక్ అభిమానులు గుస్సా అవుతున్నారు. టీజర్ రిలీజ్ డేట్ చెప్పకపోయినా, కనీసం ఎప్పట్నుంచి సెట్స్ పైకి వస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
నిజానికి ఈ విషయంలో రాజమౌళి కూడా చేసేదేం లేదు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ లాంటి పెద్ద సినిమా సెట్స్ పైకి వెళ్లాలంటే కనీసం వంద మంది సిబ్బందితో పనిచేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇప్పట్లో అది సాధ్యం కాదు. కాబట్టి కరోనా తగ్గుముఖం పట్టి, నిబంధనలు సడలించిన తర్వాతే సెట్స్ పైకి వస్తామని ఇదివరకే ప్రకటించాడు.
అంతేకాదు.. ఎన్టీఆర్ టీజర్ పై కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు రాజమౌళి. ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లిన వెంటనే కొమరంభీమ్ టీజర్ కు సంబంధించి షూటింగ్ స్టార్ట్ చేస్తామని క్లారిటీ ఇచ్చాడు. కానీ తారక్ అభిమానులు మాత్రం ఆగలేకపోతున్నారు. ఇలా సందర్భం దొరికిన ప్రతిసారి రాజమౌళిని ట్రోల్ చేస్తూనే ఉన్నారు.