తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ విధిస్తారా?

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. తెలంగాణలో కూడా కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా మరోసారి లాక్ డౌన్ విధించబోతున్నారంటూ…

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. తెలంగాణలో కూడా కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా మరోసారి లాక్ డౌన్ విధించబోతున్నారంటూ సోషల్ మీడియాలో వదంతులు వ్యాపిస్తున్నాయి. తెరుచుకున్న సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ మరోసారి మూతపడతాయంటూ ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ హెల్త్ డైరక్టర్ శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు. లాక్ డౌన్ విధించాల్సిందిగా ప్రభుత్వానికి ఎలాంటి విజ్ఞప్తి చేయలేదని ఆయన స్పష్టంచేశారు. కనీసం రాత్రివేళ కర్ఫ్యూ ప్రపోజల్ కూడా ప్రభుత్వానికి పంపించలేదని ఆయన వివరణ ఇచ్చారు.

అయితే కరోనా భయాలపై సోషల్ మీడియా వాదనలు, వార్తలతో  మాత్రం పూర్తిగా ఏకీభవించారు శ్రీనివాసరావు. ప్రస్తుతం కనిపిస్తున్న పరిణామాల బట్టి చూస్తే కరోనా సెకెండ్ వేవ్ మొదలైనట్టుగానే భావించాలన్నారు. విద్యాసంస్థల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయనే విషయాన్ని అంగీకరించిన హెల్త్ డైరక్టర్.. విద్యార్థుల ద్వారా ఇంట్లో పెద్దవాళ్లకు కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తంచేశారు.

ప్రజలంతా భౌతికదూరం పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా వేసుకోవాలని శ్రీనివాసరావు సూచించారు. అర్హులైన వాళ్లంతా కరోనా టీకాలు వేయించుకోవాలని కోరిన తెలంగాణ హెల్త్ డైరక్టర్… గతేడాది చేపట్టిన ముందుజాగ్రత్త చర్యల్నే ఈసారి కూడా రిపీట్ చేస్తామని స్పష్టంచేశారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతున్నాయి. వీటితో మహారాష్ట్ర ముందుంది. తాజాగా ఢిల్లీలో కూడా లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ విధించే అంశాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తోంది.