వైసీపీ విజయసాయిరెడ్డికి ప్రత్యర్థులపై విమర్శస్త్రాలు సంధించాలంటే ఆయనలోని వ్యంగ్యం ఒక్కసారిగా చెలరేగిపోతుంటోంది. చంద్రబాబు, లోకేశ్‌లపై ఆయన ట్వీట్లు ఎంత వెటకారంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
తాజాగా ఆయన టీడీపీ నేత, విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌పై తనదైన శైలిలో వ్యంగ్య ‘గంట’ మోగించారు. సెటైరిక్‌గా సాగిన ఈ ట్వీట్ గంట భలేభలే అనే ప్రశంసలు అందుకుంటోంది.
విశాఖ ఉక్కు ఉద్యమానికి తానే కర్త, కర్మ, క్రియ అన్నట్టు వ్యవహరిస్తున్న గంటా శ్రీనివాస్‌పై విజయసాయిరెడ్డి చేసిన వ్యంగ్య ట్వీట్ ఏంటో తెలుసుకుందాం.
‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కొందరు “గంటలు” కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉత్తుత్తి రాజీనామాతో సొంత “గంట” మోగిస్తున్నారు. ఆ “గంట”లో రణగొణధ్వనులు తప్ప చిత్తశుద్ధిలేదు. ఆ “గంట” శబ్దాల వెనుకున్న ప్రయోజనాలు అసలు ఉద్యమకారులకు తెలియదా? ఈ గంటే గతంలో విశాఖలో “భూగంట” మోగించలేదా?’ అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశారు.
అయితే ఇందులో ఎక్కడా గంటా పేరెత్తకుండానే సుతిమెత్తగా వాతలు పెట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒక్కోసారి విజయసాయిరెడ్డి ట్వీట్స్‌లో విమర్శల వేడి శ్రుతిమించుతోందని ప్రత్యర్థులు విమర్శించినా, వైసీపీ శ్రేణులు మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నాయి.