రాజమౌళి తెలుగువాడి గర్వానికి ప్రతీక. తెలుగు సినిమా కి జాతీయ స్థాయిలో కిరీటం పెట్టించిన దర్శకబాహుబలి. అయితే ఇప్పుడు తీస్తున్న ఆర్.ఆర్.ఆర్ ఆ స్థాయిలో ఉంటుందా? ఉండాలని నియమం లేదు కానీ ఉండాలన్న అంచనా మాత్రం ప్రతి తెలుగువాడికి ఉంటుంది.
బాహుబలి కన్నా ఏ మాత్రం తక్కువగా అనిపించినా పెదవి విరిచేసి అనుకున్నంత లేదు అనేసి తీసిపారేసే పరిస్థితి రావచ్చు. తనని తానే అందుకోలేనంత ఎత్తుకెదిగాడు మరి రాజమౌళి.
కానీ ఇలా అనుకున్నప్పుడల్లా గతంలో ఏదో ఒక మాయ చేసి ఒకదానిని మించిన సినిమా ఒకటి తీసుకుంటూ వచ్చాడు. అంచనాల్ని ఒక కోణంలో కాకుండా మరొక కోణంలో ఏర్పరచుకునేలా ప్రేక్షకుల సైకాలజీతో ఆడుకున్న మాయలఫకీరు రాజమౌళి.
మగధీర తర్వాత ఇంకింతకన్నా పెద్దదేం చేయగలడులే అనుకుంటే కమెడియన్ సునీల్ తో మర్యాద రామన్న తీసి ఆ స్థాయిలోనే అంచనాలు ఏర్పడేలా చేసి ఎమోషనల్ నవ్వులు పుట్టించి సూపర్ హిట్ చేసాడు. తర్వాతేంటని చూస్తుండగా ఈగ తీసి, టెక్నికల్ అంచనాలు మాత్రమే పెట్టుకునేలా చేసి శభాష్ అనిపించుకుని మళ్లీ సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత బాహుబలి ప్రస్థానం తెలిసిందే. కానీ ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ ఎత్తుకున్నాడు. బాహుబలికున్నట్టుగా నేషనల్ అప్పీల్ ఈ సినిమాకి లేదు. కథలోని పాత్రలు తెలుగు నేలకి సంబంధించిన చారిత్రక పాత్రలు. పైగా కాల్పినిక కథ. టైటిల్ బలహీనంగా ఉంది.
ఎందుకో గానీ ఆర్.ఆర్.ఆర్ దోస్తీ పాటకి కూడా రావలసినంత అటెన్షన్ తెలుగులో రాలేదు. విడుదలైన పదహారు రోజులకి అఫీషియల్ యూట్యూబ్ చానల్ “టి సిరీస్ తెలుగు” లో 2 మిలియన్ల వ్యూస్ టచ్ అయ్యింది తెలుగులో. అదే లహరి లో 18 మిలియన్స్ దాటింది. హిందీలో మాత్రం టి-సిరీస్ చానల్లోనే 18 మిలియన్లు దాటింది. ఇది పాట విడుదలయ్యాక 17 రోజుల తర్వాత పరిస్థితి. ఇలాగే కొనసాగితే బాహుబలిలో సగం స్థాయికి కూడా ఎగరలేకపోవచ్చు. అప్పటికీ అది కమెర్షియల్ గా ఘన విజయమే అయినా నైతికంగా విజయమనిపించుకోదు. ఎందుకంటే ఇద్దరు పెద్ద హీరోలుండగా అది బాహుబలికన్నా పెద్దదవ్వాలన్న అంచనా ఉంటుంది.
ఇదిలా ఉంటే తాజాగా “పుష్ప”లో దాక్కో దాక్కో మేక పాట విడుదలయ్యింది. విడుదలవ్వడంతోనే యూట్యూబుని ఊపేస్తోంది. తెలుగులో మూడు రోజులోనే 15 మిలియన్ల వ్యూస్ దాటి పరుగెడుతోంది. హిందీలో కూడా ఏడు మిలియన్ వ్యూస్ దాటింది. కీరవాణి క్లాస్ టచ్ తో పోలిస్తే డీయస్పీ మాస్ టచ్ పుష్ప పాటని పూర్తిగా వికసింపజేసింది.
అయితే ఏ పాట ఎప్పుడు విడుదలయ్యింది, ఏ పాటకి ఎక్కడ ఎక్కువ వ్యూస్ ఉన్నాయి అనేది లెక్కేసుకుని బేరీజు వేస్తే త్రాసు “ట్రిపులార్” వైపు కాకుండా “పుష్ప” వైపే వంగుతోంది.
పై రెండు సినిమాలు వేటికవే డిఫరెంట్ టేస్ట్ లో ఉన్నవి. కానీ పోల్చి చూసుకునే ప్రయత్నం చేయడం సగటు సినీ ప్రేక్షకుడి నిత్య కృత్యం. ఒకవేళ రెండు సినిమాలూ ఒకే రోజు విడుదలైతే ఏది ముందు చూస్తావని అడిగితే ప్రస్తుతానికి అధిక శాతం మంది “పుష్ప” అని చెప్తున్నారు.
దానికి కారణం లేకపోలేదు.
“పుష్ప” అడివి బ్యాక్డ్రాప్ గాని, అల్లు అర్జున్ లుక్ గానీ, రెండు భాగాల్లో తీస్తున్నారన్న హైప్ గానీ, రంగస్థలం తర్వాత సుకుమార్ తీస్తున్న సినిమా కావడం వల్ల గానీ దీనిపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్నంటున్నాయి. దానికి తోడు ఈ మేక-పులి పాట ఒకటి ప్రేక్షకులకి కైపెక్కించింది. సినిమాని మరింత పైకెక్కించింది. రంగస్థలం అప్పుడు కూడా ఇంతే. ముందంతా ఒక హైప్. “ఎంత సక్కగున్నావే” పాట విడుదలయ్యాక మరింత హైప్ వచ్చింది.
ఇక “ఆర్.ఆర్.ఆర్” మీద ప్రస్తుతం ఉన్న అంచనాలు రెండు మూడు రొమాంచితమైన యాక్షన్ ఎపిసోడ్స్ తప్ప ఊహించలేని కథా వస్తువు పెద్దగ ఉండదది. అది నిజం కాకూడదని కోరుకోవాలి. ఎప్పటిలాగానే రాజమౌళి ఊహాతీతంగా కథని నడిపి మంత్ర ముగ్ధుల్ని చెయ్యాలి. అప్పుడే ఈ సినిమా కూడా అంచనాల్ని దాటి పైకెగెరుతుంది.
ఏది ఏమైనా ఈ లెక్కలన్నీ ఆర్.ఆర్.ఆర్, పుష్ప ల నుంచి చెరొక పాట విడుదలయ్యిన వెంటనే వేసుకుంటున్నవి. రాబోయే రోజుల్లో మరికొన్ని పాటలు, మరిన్ని టీజర్లు వచ్చే కొద్దీ త్రాసు అటు ఇటు కావచ్చు.
ప్రస్తుతానికి మాత్రం సుకుమార్ పుష్పతో రాజమౌళి ఇమేజ్ ని మింగేసేలాగే ఉన్నాడని కొందరంటున్నారు.
ఈ రెండు సినిమాల మీదే ప్రస్తుతానికి దృష్టంతా ఉంది. “సర్కారు వారి పాట” విషయంలో మహేష్ లుక్ గానీ టైటిల్ గానీ, బ్యాక్ డ్రాప్ గానీ ఔట్ ఆఫ్ ద బాక్స్ అన్నట్టుగా ఏమీ లేదు. కనుక ఈ సినిమా ప్రమోషన్ ప్రత్యేకత చాటుకుంటూ చాలా వినూత్నంగా జరగాలి. లేకపోతే పై రెండు పెద్ద సినిమాల స్థాయిలో నిలబడలేదు.
ఈ పెద్ద సినిమాలు రాను రాను ఏమేం రుచి చూపించనున్నాయో వేచి చూద్దాం. అన్ని సినిమాలు అద్భుతాలు సృష్టించి నిలబడాలని ఆశిద్దాం.
గ్రేట్ ఆంధ్రా బ్యూరో