టాలీవుడ్ గొంతెమ్మ కోర్కెలు

సామాన్యుడి సినిమా క్రేజ్ చూసి ఇన్నాళ్లూ వందలకు వందలు టికెట్ రేట్లు, నిబంధనలు చాటు చేసుకుని, కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకుని జనాల నుంచి వసూలు చేసుకుంటూ కోట్లకు కోట్లు హీరోలకు కప్పాలు కట్టుకుంటూ…

సామాన్యుడి సినిమా క్రేజ్ చూసి ఇన్నాళ్లూ వందలకు వందలు టికెట్ రేట్లు, నిబంధనలు చాటు చేసుకుని, కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకుని జనాల నుంచి వసూలు చేసుకుంటూ కోట్లకు కోట్లు హీరోలకు కప్పాలు కట్టుకుంటూ వచ్చారు. ఇది చూసి ఆంధ్ర సిఎమ్ జగన్ ఒక్కసారిగా టికెట్ రేట్లను ఆకాశం నుంచి నేలకు దింపేసారు. దాంతో టాలీవుడ్ కుదేలయింది.

ఇదంతా తమ సమస్య కాదు, ఎగ్జిబిటర్ల సమస్య అన్నట్లు ఇన్నాళ్లు వెనక నుంచి వారిని ఎగసం దోస్తూ వచ్చింది. కానీ పని జరగలేదు. పైగా ఎగ్జిబిటర్లు ఈ రేట్లకు కాస్త అదనంగా ఇస్తే చాలు మరీ భయంకరమైన రేట్లు వద్దు అనేసారు. 

దాంతో టాలీవుడ్ పెద్దలు మళ్లీ రంగంలోకి ఎంటర్ అయిపోయారు. మంత్రి పేర్ని నానిని, జగన్ బంధువులను ఇలా ఎవరికి తెలిసింది వారు చేసి, సిఎమ్ అపాయింట్ మెంట్ సంపాదించారు. ఇప్పుడు సిఎమ్ దగ్గర ఏం అడగాలి అనే దానిపై మెగాస్టార్ ఇంట్లో ఈ రోజు సమావేశం నిర్వహించారు.

మెగాస్టార్ కు కావాల్సిన నాగార్జున, కొరటాల శివ, వివి వినాయక్, మెహర్ రమేష్ లను పిలుచుకున్నారు. మరే ఇతర దర్శకులను పిలిచినట్లు లేదు. అలాగే మరే హీరోను కూడా  పిలిచారో లేదో తెలియదు. మరో హీరో ఎవ్వరూ అక్కడ లేరు. పిలవలేదనే విశ్వసనీయ వర్గాల బోగట్టా. గిల్డ్ నుంచి కమిటీని, డిస్ట్రిబ్యూటర్లు దిల్ రాజు, ఆసియన్ సునీల్, అరవింద్, సురేష్ బాబు వున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే, రెండు వారాల పాటు స్పెషల్ రేట్లు వుండేలా వెసులుబాటు వుండాలని, ఆ తరువాత కోద్దిగా పెంచే నార్మల్ రేట్లు వుండాలని మెగాస్టార్, ఆయన మనుషులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఇలా అయితే మొదటికే మోసం వస్తుందని, ఇంత వెసులు బాటు ఇవ్వరని, కామన్ మాన్ కు అందుబాటులో వుండేలాగే తమ డిమాండ్ లు వుండాలని కొందరు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఓ వారం స్పెషల్ రేట్లు అంటే జగన్ ఓకె అనే అవకాశం వుందని వీరు తెగేసి చెప్పారు.

అలా కాదు, తొలివారం అయిదు వందలకు వరకు పెంచేలా వుండాలని సమావేశంలో పాల్గొన్ని ఓ డైరక్టర్ అనగా, అలా అంటే జగన్ మొత్తానికే ఇవ్వకుండా చేస్తాడని ఓ ఎగ్జిబిటర్ తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. కామన్ మాన్ కోసం జగన్ ఆలోచిస్తున్నది గమనించి డిమాండ్ లు వుండాలి తప్ప, గొంతెమ్మ కోర్కెలు సరికాదని పలువురు అభిప్రాయపడ్డారు.  దాంతో కీలక సభ్యులు అంతా మరోసారి రేపు సమావేశమై, జగన్ ను ఏం అడగాలి అన్నిది డిసైడ్ చేయాలని నిర్ణయించి, సమావేశం వాయిదా వేసారు. 

బాలయ్య..త్రివిక్రమ్..మోహన్ బాబు..ఎక్కడ

గతంలో ఇలా సమావేశాలు నిర్వహించినపుడు, తనకు తెలియకుండా చేసారనే ఆగ్రహం హీరో బాలయ్య వ్యక్తం చేసారు. ఆయన అప్పట్లో గట్టి విమర్శలు చేసారు. మరి ఈసారి ఆయనను పిలిచారో లేదో తెలియదు. కానీ ఆయన సమావేశంలో లేరు.

గతంలో రాజమౌళి, త్రివిక్రమ్ లను కూడా పిలిచారు. రాజమౌళి ప్రస్తుతం దేశంలో లేరు. త్రివిక్రమ్ ను పిలిచినట్లు లేదు. మరి ఎందుకు ఆయనను పిలవలేదో? మెగాస్టార్ కే తెలియాలి. మెహర్ రమేష్, వినాయక్ ల కన్నా త్రివిక్రమ్ తక్కువని భావించారో ఏమిటో?