లార్డ్స్ టెస్టులో టీమిండియా సంచ‌ల‌న విజ‌యం!

చూడ‌చ‌క్క‌ని టెస్ట్ మ్యాచ్.. వ‌న్డే, టీ20ల‌ను త‌ల‌ద‌న్నే ఎంట‌ర్ టైన్ మెంట్.. అస‌లు సిస‌లు టెస్ట్ క్రికెట్ మ‌జాను అందిస్తూ.. అంతిమంగా టీమిండియా సంచ‌ల‌న విజ‌యంతో ముగిసింది లార్డ్స్ వేదిక‌గా జ‌రిగిన ఇండియా-ఇంగ్లండ్ టెస్ట్…

చూడ‌చ‌క్క‌ని టెస్ట్ మ్యాచ్.. వ‌న్డే, టీ20ల‌ను త‌ల‌ద‌న్నే ఎంట‌ర్ టైన్ మెంట్.. అస‌లు సిస‌లు టెస్ట్ క్రికెట్ మ‌జాను అందిస్తూ.. అంతిమంగా టీమిండియా సంచ‌ల‌న విజ‌యంతో ముగిసింది లార్డ్స్ వేదిక‌గా జ‌రిగిన ఇండియా-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్. 151 ప‌రుగుల తేడాతో ఈ మ్యాచ్ లో టీమిండియా సంచ‌ల‌న‌, ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. భార‌త ఫాస్ట్ బౌల‌ర్ల అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో సొంత‌గ‌డ్డ‌పై, తాము ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ అనూహ్య ఓట‌మిని మూట‌గ‌ట్టుకుంది. నాలుగో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి మ్యాచ్ దాదాపు త‌మ గ్రిప్ లో ఉంచుకున్న‌ట్టుగా భావించింది ఇంగ్లండ్ జ‌ట్టు కూడా. అయితే ఐదో రోజే క‌థ ప‌లు మ‌లుపులు తిరిగింది. ఓవ‌ర్ నైట్ క్రీజ్ లో ఉండిన రిష‌బ్ పంత్ మ్యాచ్ ను మ‌లుపుతిప్పుతాడ‌నుకుంటే.. అత‌డు కేవ‌లం ఎనిమిది ప‌రుగులు జోడించి వెనుతిరిగాడు. పంత్ ఔట్ కావ‌డంతోనే.. మ్యాచ్ పై త‌మ ప‌ట్టు పెరిగింద‌నుకున్న ఇంగ్లండ్ కు షాకిచ్చే భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు టీమిండియా సీమ్ బౌల‌ర్లు జ‌స్ ప్రీత్ బుమ్రా, మ‌హ్మ‌ద్ షమీ.

వీరి భాగ‌స్వామ్యంతో టీమిండియా అత్యంత ప‌టిష్ట ప‌రిస్థితుల్లో నిలిచింది. ఎనిమిది వికెట్ల‌కు 298 ప‌రుగుల‌కు ఇన్నింగ్స్ ను డిక్లేర్డ్ చేసింది టీమిండియా. పంత్, ఇషాంత్ లు ఔట‌య్యాకా క్రీజ్ లోకి వ‌చ్చిన ష‌మీ, బుమ్రాలు..  అద్భుత‌మైన పోరాటాన్ని చూపారు. ష‌మీ 56 ప‌రుగులు చేయ‌గా, బుమ్రా 34 ప‌రుగుల‌తో త‌న కెరీర్ బెస్ట్ ను న‌మోదు చేశాడు. లంచ్ విరామం వ‌ర‌కూ వీరి బ్యాటింగ్ విన్యాసం సాగింది. దీంతో టీమిండియాకు ఓట‌మి ముప్పు అయితే త‌ప్పింది. లంచ్ త‌ర్వాత కూడా వీరు క్రీజ్ కు వెళ్లినా.. ఆ వెంట‌నే కెప్టెన్ కొహ్లీ ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేశాడు. ఇంగ్లండ్ ముందు 271 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచాడు. 60 ఓవ‌ర్లు 271 ప‌రుగులు అనే టార్గెట్ తో ఇంగ్లండ్ త‌న రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆ పిచ్ పై ఆ ర‌న్ రేటుతో విజ‌యానికి ట్రై చేయ‌డం దుస్సాహ‌సం అని ముందే క్లారిటీ ఉన్నా.. అస‌లేం జ‌రుగుతోందో తెలుసుకునే లోపే ఇంగ్లండ్ ఓపెనర్ల వికెట్ల‌ను కోల్పోయింది.

ఓపెన‌ర్లు ఇద్ద‌రూ డ‌క్ లుగా వెనుదిరగ‌డంతో పూర్తి డిఫెన్స్ లో ప‌డిపోయింది ఆ జ‌ట్టు. కెప్టెన్ రూట్, హ‌సీద్ హ‌మీద్ లు ఒక‌వైపు డిఫెన్స్ లో ఆడుతూనే, అవ‌కాశం ఉన్న‌ప్పుడు బ్యాట్ ను ఝ‌లిపించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే హ‌మీద్ వెనుదిర‌గ‌డంతో ఈ భాగ‌స్వామ్యానికి తెర‌పడింది.  ఆ పై క్రీజ్ లోకి వ‌చ్చిన బెయిర్ స్టో, రూట్ తో క‌లిసి పూర్తి డిఫెన్సివ్ మోడ్ లో ఆడాడు.  కుదురుగానే క‌నిపించిన బెయిర్ స్టో.. కూడా పెవిలియ‌న్ చేర‌డంతో ఇంగ్లండ్ కు ఓట‌మి భ‌యం మొద‌లైంది. టీ విరామానికి ముందు ఆఖ‌రి బంతికి అత‌డు ఔట్ అయ్యాడు. టీ గ్యాప్ త‌ర్వాత‌.. ఇంగ్లండ్ కు మ‌రో ఝ‌ల‌క్ త‌గిలింది. ఐదో వికెట్ గా కెప్టెన్ రూట్ వెనుదిర‌గ‌డంతో.. టీమిండియాకు విజ‌యంపై పూర్తి విశ్వాసం క‌లిగింది. రూట్ ఔట్ కావ‌డంతో స‌గం వికెట్లు ప‌డిపోయినా.. ఇంగ్లండ్ కు సంబంధించి 90 శాతం ప‌త‌నం పూర్త‌యిన‌ట్టే అని గావ‌స్క‌ర్ వ్యాఖ్యానించారు. 

ఆ త‌ర్వాత జోస్ బ‌ట్ల‌ర్- మొయిన్ అలీ కాసేపు పోరాడారు. అయితే సిరాజ్ వేసిన సూప‌ర్ బాల్ అలీని పెవిలియ‌న్ కు చేర్చింది.  అలీ చాలా జాగ్ర‌త్త‌గానే ఆడినా.. సిరాజ్ వేసిన బంతితో అత‌డు పెవిలియ‌న్ కు చేర‌క త‌ప్ప‌లేదు. ఆ త‌ర్వాతి, అచ్చం అలాంటి బంతితోనే సామ్ క‌ర‌న్ ను పెవిలియ‌న్ కు చేసి.. ఇంగ్లండ్ కు మ‌రో షాకిచ్చాడు సిరాజ్. వ‌రస బంతుల‌కు ప‌డిన ఈ వికెట్ల‌తో టీమిండియా విజ‌యానికి మ‌రింత చేరువ‌య్యింది. కానీ.. బ‌ట్ల‌ర్, కొత్త కుర్రాడు రాబిన్స‌న్ లు ఆ త‌ర్వాత అంత తేలిక‌గా వికెట్ల‌ను ఇవ్వ‌లేదు. దాదాపు ప‌ది ఓవ‌ర్ల పాటు వీరి పోరాటం సాగింది. 20 ఓవ‌ర్లు .. మూడు వికెట్లు అనే స‌మీక‌ర‌ణం మ‌ధ్య‌న మొద‌లైన వీరి భాగ‌స్వామ్యం ప‌రుగుల క‌న్నా..  క్రీజ్ లో ఉంటే చాల‌న్న‌ట్టుగా సాగింది, వీరి పోరాటాన్ని చూస్తే.. ఇక డ్రా త‌ప్ప‌దేమో అనే భావ‌న కూడా ప్రేక్ష‌కుల్లో క‌లిగింది. అయితే.. బుమ్రా వేసిన మ‌రో సూప‌ర్ లైన్ అండ్ లెంగ్త్ బాల్ తో రాబిన్స‌న్ ఇన్నింగ్స్ కు తెర‌ప‌డింది. ఎల్బీడ‌బ్ల్యూ కు అప్పీల్ చేసినా.. అంపైర్ ఇవ్వ‌లేదు,  ఇక ఏ మాత్రం ఆలోచించేది లేద‌న్న‌ట్టుగా టీమిండియా రివ్యూ తీసుకుంది. రివ్యూలో ఎల్బీడ‌బ్ల్యూ అని క్లియ‌ర్ గా అర్థం కావ‌డంతో.. బ‌ట్ల‌ర్ – రాబిన్స‌న్ భాగస్వామ్యానికి తెర‌ప‌డింది.

మార్క్ వుడ్ తొమ్మిదో వికెట్ కు బ‌ట్ల‌ర్ తో జ‌త క‌లిశాడు. వుడ్ బ్యాటింగ్ చేయ‌గ‌ల‌డంటూ వ్యాఖ్యాత‌లు చెబుతుండ‌గానే.. అంత వ‌ర‌కూ ఎంతో నిదానంగా ఆడిన బ‌ట్ల‌ర్ సిరాజ్ కు దొరికిపోయాడు. ఆదిలోనే కొహ్లీ క్యాచ్ మిస్ చేయ‌డంతో బ‌ట్ల‌ర్ ఇన్నింగ్స్ అంత‌సేపు సాగింది. అయితే చివ‌ర‌కు కీప‌ర్ కు క్యాచ్ ఇచ్చి బ‌ట్ల‌ర్ పెవిలియ‌న్ కు చేర‌డంతో భార‌త జ‌ట్టు విజ‌యం లాంఛ‌నంగా మిగిలింది. ఇంకో ఎనిమిది ఓవ‌ర్ల పాటు డిఫెండ్ చేసుకోగ‌లిగితే.. ఇంగ్లండ్ మ్యాచ్ ను డ్రా చేసుకోగ‌ల‌దు. అయితే.. అంత అవ‌కాశం ఇవ్వ‌కుండా.. అదే ఓవ‌ర్లో అండ‌ర్స‌న్ ను క్లీన్ బౌల్డ్ చేసి సంచ‌ల‌న విజ‌యాన్ని భార‌త ఖాతాలోకి వేశాడు మ‌హ్మ‌ద్ సిరాజ్.

భార‌త ఫాస్ట్ బౌల‌ర్లు రెండో ఇన్నింగ్స్ లో వికెట్ల‌ను పంచుకున్నారు. ప్ర‌త్యేకించి సిరాజ్ కీల‌క స‌మ‌యంలో రెండు సార్లు జంట వికెట్ల‌ను తీసి.. ఈ సంచ‌ల‌న విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. అలీ-క‌ర‌న్ ల‌ను వ‌ర‌స బంతుల్లో ఔట్ చేసిన సిరాజ్, బ‌ట్ల‌ర్- అండ‌ర్స‌న్ ల‌ను ఒకే ఓవ‌ర్లో ఔట్ చేసి మ్యాచ్ ను ముగించాడు. ఇక బుమ్రా మూడు వికెట్లు, ఇషాంత్ శ‌ర్మ రెండు, మ‌హ్మ‌ద్ ష‌మీ ఒక వికెట్ ను సాధించి.. ఈ విజ‌యంలో త‌మ వంతు పాత్ర‌లు పోషించారు.  అటు బ్యాటింగ్ లో, ఇటు బౌలింగ్ లో మెరిసి.. ష‌మీ, బుమ్రాలు.. హీరోలుగా నిలిచారు. 

ఐదు టెస్టుల సీరిస్ లో ఈ మ్యాచ్ లో విజ‌యంతో ఇండియా 1-0 లీడ్ ను సాధించింది. తొలి టెస్టులో కూడా టీమిండియా విజ‌యం ముగింటే ఉన్నా.. ఆఖ‌రి రోజు పూర్తిగా వ‌ర్షం కుర‌వ‌డంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. టాస్ గెలిచి ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ తీసుకున్న‌ రూట్ సేన‌, ఓట‌మితో..దిగాలుగా మారింది.