లాక్ డౌన్ తో మూతపడిన థియేటర్లన్నీ పాగల్ సినిమాతో తెరుచుకుంటాయని, అలా జరక్కపోతే పేరు మార్చుకుంటానని స్టేట్ మెంట్ ఇచ్చాడు విశ్వక్ సేన్. పరోక్షంగా తన సినిమా సూపర్ హిట్టవుతుందని చెప్పుకొచ్చాడు. కానీ అలా జరగలేదు. సినిమా రిలీజైన తర్వాత మూవీకి నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే విశ్వక్ మాత్రం తన స్టేట్ మెంట్ ను కవర్ చేసుకున్నాడు. పాగల్ సినిమా పెద్ద హిట్ అంటున్నాడు.
“ప్రీ రిలీజ్ వేడుకలో సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది లేకుంటే నేను పేరు మార్చుకుంటా అని చెప్పాను. ఈ సినిమా విడుదల తరువాత చాలా మంది నేను పేరు ఎప్పుడు మార్చుకుంటానా అని చూస్తున్నారు. కానీ ఈ సినిమా హిట్ తో నా నమ్మకం నిజమైంది, నా నమ్మకం వమ్ము కాదని మరోసారి ప్రూవ్ చేసారు ప్రేక్షకులు. ఇప్పుడు నేను పేరు మార్చుకోవలసిన అవసరం లేదు. నేను హీరోగా చేసిన హిట్ సినిమా 'హిట్' కలెక్షన్స్ కంటే పాగల్ కలక్షన్స్ 40% ఎక్కువ వచ్చాయి”
ఇలా పాగల్ సినిమాను తన కెరీర్ లో సక్సెస్ మూవీగా చెప్పుకొచ్చాడు విశ్వక్. ఈ సినిమాతో తనకు, ఆడియన్స్ మధ్య ఎవ్వరూ లేరని, ఎవ్వరూ ఏమీ చేయలేరనే విషయం తెలిసిందన్నాడు. తన సినిమాకు శని, ఆదివారాల్లో 6.5 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చిందని, సింగిల్ స్క్రీన్స్ ఊగిపోతున్నాయని చెప్పుకొచ్చాడు.
“ఆంధ్ర ప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్స్ తక్కువగా ఉన్నా, కరోనా సమయంలో ఆక్యుపెన్సీ సగం ఉన్నా, ఆలాగే సెకండ్ షో లేకపోయినా కూడా ప్రేక్షకులు నా సినిమాకు వచ్చారు. నేను నమ్మింది ప్రేక్షకులను.. వారు నా నమ్మకాన్ని నిజం చేసారు. సినిమా కోసం చాలా మంది నెగిటివ్ గా ప్రమోట్ చేసారు. అయినా సరే నాకు మంచి విజయాన్ని అందించారు ప్రేక్షుకులు”
ఇండస్ట్రీలో తనకు గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేరని ఈమధ్య కాలంలో పదే పదే చెప్పుకుంటున్న విశ్వక్, మరోసారి అదే స్టేట్ మెంట్ రిపీట్ చేశాడు. తనను కాపాడుతున్నది ప్రేక్షకులు మాత్రమే అన్నాడు.