రమ్య హత్య.. లోకేష్ అరెస్ట్

చేసిందే చెత్త పని. మళ్లీ దానికి పబ్లిసిటీ హంగు. ఎప్పట్లానే ఈరోజు కూడా తన శవ రాజకీయం షురూ చేశారు లోకేష్. రమ్య హత్య కేసులో మృతురాలి బంధువుల్ని పరామర్శించాల్సింది పోయి, రాజకీయం చేయడానికి…

చేసిందే చెత్త పని. మళ్లీ దానికి పబ్లిసిటీ హంగు. ఎప్పట్లానే ఈరోజు కూడా తన శవ రాజకీయం షురూ చేశారు లోకేష్. రమ్య హత్య కేసులో మృతురాలి బంధువుల్ని పరామర్శించాల్సింది పోయి, రాజకీయం చేయడానికి ప్రయత్నించారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాజకీయ హత్య అంటూ ఆరోపణలు చేశారు.

అసలు లోకేష్ చేసిన ఆరోపణలకు, తాజా దుర్ఘటనకు ఏమైనా సంబంధం ఉందా? జరిగిన ఘటన బాధాకరమైనదే. కానీ దానికి రాజకీయాలకు సంబంధం ఏంటి? హుందాగా వచ్చి మృతురాలి తల్లిదండ్రుల్ని పరామర్శించి వెళ్తే ఎంతో బాగుండేది. కానీ చంద్రబాబుకు గానీ, లోకేష్ కు గానీ ఆ అలవాటు బొత్తిగా లేదు.

శవరాజకీయంలో ఆరితేరిపోయిన తండ్రికొడుకులు, ప్రతి అంశాన్నీ ప్రభుత్వానికి ముడిపెట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తుంటారు. ఈరోజు లోకేష్ కూడా అదే చేశారు. రమ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన నెపంతో రోడ్ షో నిర్వహించారు. కారు నుంచి దిగుతూనే చేతులు ఊపారు. తన మద్దతుదారులతో జై లోకేష్ అనిపించుకున్నారు.

గుంటూరులోని పరమయ్య గుంట వద్ద కావాలనే సీన్ క్రియేట్ చేశారు లోకేష్. ఎలాగైనా అరెస్ట్ అవ్వాలనే ఉద్దేశంతోనే కాలు బయటపెట్టిన చినబాబు.. అనుకున్నది సాదించారు. అరెస్ట్ తర్వాత ఆయన ఫొటోలకు పోజులిచ్చిన వైనం 'నభూతో' అనే చెప్పుకోవాలి. అరెస్ట్ అయిన గర్వం ఆయన కళ్లల్లో కనిపించింది. అదేదో పెద్ద ఎచీవ్ మెంట్ లా ఫీలయ్యారు లోకేష్.

లోకేష్ చేసిందే చెత్త పని అనుకుంటే, దానికి అను'కుల' మీడియా చేసిన హంగామా మరింత కంపు కొట్టింది. లోకేష్ అరెస్ట్ అయితే, ఆయనేదో ఆస్కార్ కొట్టాడు అనే రీతితో పొద్దున్నుంచి ఈ క్షణం వరకు ఒకటే డప్పు. అసలు అక్కడ సందర్భం ఏంటి? ఎల్లో మీడియా చేస్తున్నందేంటి? రమ్య హత్య ఘటనను పూర్తిగా లోకేష్ అరెస్ట్ వ్యవహారంగా మార్చేసింది.

టీవీలు చూస్తున్న జనం రమ్య హత్య ఘటన కంటే, లోకేష్ అరెస్ట్ విజువల్స్ నే ఎక్కువగా చూసి అయోమయంలో పడ్డారు. ఒక దశలో సోషల్ మీడియాలో “రమ్య హత్య.. లోకేష్ అరెస్ట్” అనే హెడ్డింగ్ తో కామెడీ సెటైర్లు ఓ రేంజ్ లో పేలాయంటే.. ఓ సెక్షన్ మీడియా చేసిన అతిని అర్థం చేసుకోవచ్చు.