మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు అనేది పాత సామెత. ఇప్పుడు ఏపీ రాజకీయంలో మూలుగుతున్న టీడీపీపై ఎన్నికలు, ఉప ఎన్నికలు పడుతున్నాయి. ఒక్కోసారి ఒక్కోలా కవర్ చేసుకోలేక కొత్త ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టుగా ఉంది ఆ పార్టీ.
పంచాయతీ ఎన్నికల్లో పచ్చ పార్టీ చిత్తయ్యిందంటే.. ఆ ఎన్నికల్లో తమకు 40 శాతం ఓట్లు పడ్డాయంటూ చంద్రబాబు నాయుడు ఒక రిపోర్టు పట్టుకొచ్చి చదివారు! అసలు పంచాయతీ ఎన్నికలే పార్టీల గుర్తు మీద జరగవు, గెలిచిన ప్రెసిడెంట్లనూ, ఓడిన వారిని కూడా ప్రజలు పార్టీల వారీగా పెద్దగా పట్టించుకోరు. ఊర్లో తమకు ఉన్న సంబంధాలను బట్టే ప్రెసిడెంట్ అభ్యర్థులకు ఓటేస్తారు. ఈ క్రమంలో వైసీపీ ఓట్లు టీడీపీ కి పడొచ్చు, తీవ్రమైన పచ్చ పార్టీ భక్తులు కూడా వైఎస్ఆర్సీపీ మద్దతుదారుడు అనే వ్యక్తికి ఓటేయవచ్చు. అలాంటి పంచాయతీ పోల్స్ లో తమకు 40 శాతం ఓట్లు పడ్డాయంటూ చంద్రబాబు లెక్క చదివారు! గెలిచిన అభ్యర్థే ఏ పార్టీ వాడో అనుకుంటే.. పడ్డ ఓట్లలో కూడా లెక్కలు చెప్పడం చంద్రబాబుకే సాధ్యం అయ్యింది.
పంచాయతీ ఎన్నికలకు అలా కవర్ చేసుకున్నారు. అయితే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల విషయంలో చంద్రబాబు చూపిన అత్యుత్సాహం మొదటికే మోసం తెచ్చింది. అమరావతి నినాదాన్ని ప్రతిధ్వనించాలని చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నం చిత్తయ్యింది. గుంటూరోళ్లకు సిగ్గుందా? అంటూ చంద్రబాబు నాయుడు వేసిన ప్రశ్నకు ఘాటైన సమాధానం వచ్చింది. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో కూడా టీడీపీ అడ్రస్ గల్లంతయ్యింది. దీంతో అమరావతి ఉద్యమానికి ఆ ఎన్నికలతో చంద్రబాబు నాయుడే చితి పెట్టినట్టుగా అయ్యింది.
మున్సిపల్ కార్పొరేషన్లలో వచ్చిన షాకింగ్ రిజల్ట్స్ తో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల బహిష్కరణ అన్నారు. అయితే అప్పటికే దాఖలైన నామినేషన్లతో మరో నాటకం నడిచింది. ఎన్నికల్లో టీడీపీ చిత్తయ్యింది. రాష్ట్రం మొత్తం కలిపి ఐదు ఎంపీపీ స్థానాలను, అందులో రెండు సీట్లలో జనసేన మద్దతుతో.. గెలిచింది టీడీపీ. అదేమంటే బహిష్కరణ. అంటూ తనను తాను మోసం చేసుకునే పరిస్థితిలో పడింది పచ్చపార్టీ.
ఈ అనుభవాలు ఇంకా పచ్చిగా ఉండగానే.. బద్వేల్ బై పోల్ కు షెడ్యూల్ వచ్చింది. ఈ నియోజకవర్గంలో టీడీపీ డిపాజిట్ రాబట్టుకుంటే అదే పదివేలు అనే పరిస్థితి కనిపిస్తోందిప్పుడు. ఇప్పటికే అభ్యర్థిని అయితే ప్రకటించారు, అయితే.. బహిష్కరణకు ఇంకా ఛాన్సు ఉన్నట్టే! నామినేషన్ వేశాకా కూడా బహిష్కరించవచ్చు, పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా బహిష్కరించవచ్చు, ఫలితాల వెల్లడి రోజు ఉదయం కూడా బహిష్కరించగల సత్తా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీకి ఉండనే ఉంది. ఈ సారి ఆ విద్యను ఎలా ప్రదర్శిస్తారో!