తెలంగాణ సీఎం, భారత ప్రధాని కాగలరా..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి నాలుగో ముఖ్యమంత్రి, ఆ తర్వాత భారత దేశానికి 9వ ప్రధాన మంత్రి. ఆయనే పీవీ నరసింహారావు. రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసి, ఆ తర్వాత దేశానికి అధినేతలుగా మారిన అతికొద్దిమందిలో పీవీ…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి నాలుగో ముఖ్యమంత్రి, ఆ తర్వాత భారత దేశానికి 9వ ప్రధాన మంత్రి. ఆయనే పీవీ నరసింహారావు. రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసి, ఆ తర్వాత దేశానికి అధినేతలుగా మారిన అతికొద్దిమందిలో పీవీ ఒకరు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి ఆ ఫీట్ సాధించాలనుకుంటున్నారు కేసీఆర్.

తెలంగాణ ముఖ్యమంత్రి నేరుగా ఢిల్లీ పీఠాన్ని టార్గెట్ చేశారు, మోదీని గద్దె దించుతానంటున్నారు, అక్కడితో ఆగలేదు, ఆయన్ను జైలుపాలు చేస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. జాతీయ పార్టీ పెడతానంటున్నారు.

పరిస్థితులు ఎలా ఉన్నాయి..?

గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఎకాఎకిన దేశానికి ప్రధాని అయ్యారు నరేంద్రమోదీ. సీనియర్లందర్నీ కాదని, ఆయనకే బీజేపీ పట్టం కట్టింది. సీనియర్లను మోదీ చాకచక్యంగా పక్కకు తప్పించారని గిట్టనివారు అనుకున్నా.. అది ఆర్ట్.. ఆయన ఆర్టిస్ట్.. అని ఆయన అనుయాయులు మెచ్చుకున్నారు. ఇక మోదీ తర్వాత ప్రధాని ఎవరు? బీజేపీలో అయితే యూపీ సీఎం యోగీ పేరు కొంతకాలంగా ప్రచారంలో ఉంది. అయితే యోగీని కూడా మోదీ-షా ద్వయం ఓ దశలో సైడ్ చేసింది.

ప్రస్తుతానికి బీజేపీలో మోదీకి తిరుగులేదు, అమిత్ షా కి ప్రధాని పదవిపై ఆశ ఉన్నట్టు కనిపించడం లేదు. మరి కేంద్రంలో బీజేపీ కాకుండా వేరే ఇతర పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు ప్రధాని ఎవరు.. ? కచ్చితంగా కాంగ్రెస్ కి కానీ, కాంగ్రెస్ కూటమికి కానీ అంత సీన్ లేదు అనే విషయం ఇప్పటికే స్పష్టమైంది. సో.. రాహుల్ గాంధీ రేసులో లేరు. మరి థర్డ్ ఫ్రంట్ వస్తే ఎవరు పీఎం..?

సీఎం టు పీఎం..?

సరిగ్గా ఇదే విశ్లేషణలో ఉన్నట్టున్నారు కేసీఆర్. కాలం కలిసొచ్చి థర్డ్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే కచ్చితంగా ఏదో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సీఎం కుర్చీలో కూర్చుంటారు. మమతా బెనర్జీ, కేజ్రీవాల్.. ప్రస్తుతానికి ఆ సీటు కోసం పోటీ పడుతున్నారు. ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చారు కేసీఆర్. 

తెలంగాణలో కేసీఆర్ బలవంతుడే, కాదనలేం. మరి దేశ రాజకీయాల్లో ఆయన చక్రం తిప్పగలరా? మమత, కేజ్రీ.. దీనికి ఒప్పుకుంటారా..? కేసీఆర్ ఈ మేరకు అందర్నీ నొప్పించకుండా ఒప్పించగలరా..? ప్రస్తుతానికి ఇది అసాధ్యంగానే కనిపిస్తున్నా.. తెలంగాణ విషయంలో కేసీఆర్ ఇలాంటి అసాధ్యాలెన్నిటినో సుసాధ్యం చేశారు. మరి ఈసారి కూడా అలాంటి మిరాకిల్ జరుగుతుందని అంటున్నారు కేసీఆర్.

తెలంగాణ సీఎం, దేశానికి ప్రధాని కాగలరా? అనేదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడానికి కేటీఆర్ రెడీగా ఉన్నారు. సో.. పార్టీలో ఎలాంటి ఇబ్బందులు లేవు, అయితే కూటమి కుమ్ములాటల్లోనే అసలైన మజా ఉంటుంది. కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా నిలబడటం, కూటముల్ని విచ్ఛిన్న చేయడం వల్లనే బీజేపీ బలమైన శక్తిగా ఏర్పడింది. 

ఇప్పుడు బీజేపీని దించాలంటే మళ్లీ కూటములు బలపడాలి, ఆయా పార్టీల మధ్య సయోధ్య కుదరాలి, ఇగోలు పక్కనపెట్టాలి, అందరూ కలసికట్టుగా మోదీపై యుద్ధం ప్రకటించాలి. అదే జరిగితే ఆ యుద్ధంలో కేసీఆర్ బలంగా నిలబడగలిగితే.. తెలంగాణ సీఎం, దేశానికి పీఎం అవుతాడనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.

ఈ దిశగా కేసీఆర్ ఇప్పటికే ఎన్నికల యుద్ధం మొదలుపెట్టారు. ఆయన తన యాక్షన్ ప్లాన్ ను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. కేంద్రం మాత్రం ప్రస్తుతానికి చూసీచూడనట్టు వ్యవహరిస్తోంది. మోదీ సర్కారు ఎదురుదాడికి దిగితే పరిణామాలు ఎలా ఉంటాయనేది త్వరలోనే తెలుస్తుంది.