రెండు రోజులు ఆగితే కొంప‌లు మునుగుతాయా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌గ‌న్ స‌ర్కార్‌, రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం (ఎస్ఈసీ) మ‌ధ్య వ్య‌వ‌హారం రోజురోజుకూ ముదురుతోంది. ఇరువైపులా పంతాలు, పట్టింపుల‌కు పోతుండ‌డంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి.  Advertisement ముల్లుపోయి ఆకు మీద ప‌డ్డా…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌గ‌న్ స‌ర్కార్‌, రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం (ఎస్ఈసీ) మ‌ధ్య వ్య‌వ‌హారం రోజురోజుకూ ముదురుతోంది. ఇరువైపులా పంతాలు, పట్టింపుల‌కు పోతుండ‌డంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. 

ముల్లుపోయి ఆకు మీద ప‌డ్డా లేక ఆకుపోయి ముల్లు మీద ప‌డినా … చివ‌రికి సున్నిత‌మైన ఆకు న‌ష్ట‌పోతుందంటారు. ఈ సూక్ష్మ విష‌యాన్ని జగ‌న్ స‌ర్కార్ మ‌రిచిపోయింది. ఇలాంటి సున్నిత‌మైన విష‌యాలను జాగ్ర‌త్త‌గా డీల్ చేయాల్సిన జ‌గ‌న్ స‌ర్కార్ … మొర‌ట‌గా వ్య‌వ‌హ‌రించి చివ‌రికి అభాసుపాల‌వుతోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ మ‌రో రెండు నెల‌ల్లో త‌న ప‌ద‌వీ కాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. ఆ త‌ర్వాత ఆయ‌న ఎక్క‌డ ఉంటారో కూడా ఎవ‌రికీ తెలియ‌ని ప‌రిస్థితి.

కానీ ఈ రెండు నెల‌లు ఆయ‌న‌కు రాజ్యాంగం ద్వారా సంక్ర‌మించిన ప‌ద‌వి వెయ్యి ఏనుగుల బ‌లాన్ని ఇస్తుంద‌నే కామ‌న్‌సెన్స్ ఎవ‌రూ మ‌రిచిపోకూడ‌దు. ఒక‌వేళ మ‌రిస్తే ఏమ‌వుతుందో …తాజాగా ఏపీలో చోటు చేసుకుంటున్న సంక్షోభ ప‌రిస్థితుల‌ను నిద‌ర్శ‌నంగా చెప్పుకోవాల్సి ఉంటుంది.

అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేయ‌డానికి ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందు కెళుతున్నార‌నేందుకు అనేక ఉదంతాల‌ను చెప్పుకోవ‌చ్చు. 

ఏపీ స‌ర్కార్‌, రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆడుతున్న మైండ్‌గేమ్‌లో ప్ర‌స్తుతానికి నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ పైచేయి సాధించార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎస్ఈసీతో జ‌గ‌న్ స‌ర్కార్ వ్య‌వ‌హ‌రించిన తీరు చూస్తే ….ఆవేశం, ఆగ్ర‌హం డామినేట్ చేయ‌డంతో ఆలోచ‌న మ‌రుగున ప‌డింది. 

విచ‌క్ష‌ణ‌తో స‌మ‌స్య‌కు ప‌రిష్కారం క‌నుగొనాల్సిన ప్ర‌భుత్వం, అందుకు విరుద్ధంగా అవివేకంతో వ్య‌వ‌హ‌రించి అన‌వ‌స‌ర వివాదాల‌ను కోరి మ‌రీ మీద‌కు తెచ్చుకుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ప్ర‌స్తుతానికి వ‌స్తే నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ ఇంతకంటే ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రించాల‌ని  ఎవ‌రైనా ఆశిస్తే, అంత‌కంటే అజ్ఞానం, మూర్ఖ‌త్వం మ‌రొక‌టి లేదు. నిజానికి నిమ్మ‌గ‌డ్డ అనుకుంటే, ఇంత తీవ్ర‌మైన ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం త‌లెత్తేది కాదు. 

రెండురోజులు ఆగితే కొంప‌లేవో మునిగిపోతాయ‌న్న‌ట్టు నిమ్మ‌గ‌డ్డ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు లేక‌పోలేదు. హైకోర్టు డివిజ‌న్ బెంచ్ తీర్పుపై ఏపీ స‌ర్కార్ సుప్రీంకోర్టులో స్పెష‌ల్ లీవ్ పిటిష‌న్ దాఖ‌లు చేసింది.

దీనిపై ఈ నెల 25న అంటే రెండు రోజుల్లో విచార‌ణ జ‌ర‌గ‌నుంది. ఈ విష‌యాన్నే ఎస్ఈసీకి ప్ర‌భుత్వ చీఫ్ సెక్ర‌ట‌రీ రాసిన లేఖ‌లో గుర్తు చేస్తూ, అంత వ‌ర‌కూ వేచి చూడాల‌ని అభ్య‌ర్థించారు. 

ఇవేవీ ప‌ట్టించుకోకుండా నేటి ఉద‌యం 10 గంట‌ల‌కు ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించ‌డానికి ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ స‌మాయ‌త్త‌మ‌య్యారు. రాష్ట్ర ప్ర‌భుత్వ హ‌క్కును కూడా వినియోగించ‌డానికి త‌గిన స‌మ‌యం ఇవ్వ‌నంత అక్క‌సుతో నిమ్మ‌గ‌డ్డ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నేందుకు ఇదో నిద‌ర్శ‌నం.

ఫిబ్రవరిలో నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈ నెల 8న ఎస్‌ఈసీ షెడ్యూలు జారీ చేసిన సంగతి తెలి సిందే. దీనిపై రాష్ట్ర ప్ర‌భుత్వం హైకోర్టును ఆశ్ర‌యించింది.  

ఈ ఎన్నికల షెడ్యూల్‌ రాజ్యాంగంలోని అధికరణలు 14, 21లకు విరుద్ధమని హైకోర్టు సింగిల్ బెంచ్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌ను ఈ నెల 11న ర‌ద్దు చేసింది. ఈ సంద‌ర్భంగా న్యాయ‌మూర్తి జస్టిస్‌ మంతోజు గంగారావు ఎస్ఈసీపై తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని గుర్తించుకోవాలి.

రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్నికల కమిషన్‌ జరిపిన సంప్రదింపుల్లో నిష్పాక్షికత లేదని న్యాయ‌మూర్తి  తేల్చి చెప్పిన విష‌యం తెలిసిందే. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ద్విస‌భ్య బెంచ్‌కు వెళ్లే హ‌క్కును ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ఉప‌యోగించుకున్నారు. అక్క‌డ త‌న‌కు అనుకూలంగా ఆయ‌న ఆదేశాలు పొందారు. 

హైకోర్టు ఆదేశాల‌పై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించే చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన హ‌క్కును ఏపీ స‌ర్కార్ వినియోగించుకోకూడ‌దంటే ఎలా?  సుప్రీంకోర్టులో ఏపీ స‌ర్కార్ స్పెష‌ల్ లీవ్ పిటిష‌న్‌ను  జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్, జస్టిస్‌ ఇందు మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం  విచారించనుంది.

హైకోర్టులో సింగిల్ జ‌డ్జి ఒక ర‌కంగా, ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం మ‌రో ర‌కంగా తీర్పులు చెప్ప‌డాన్ని చూశాం. ఇప్పుడు సుప్రీంకోర్టులో త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం అభిప్రాయం ఏంటో తెలుసుకునే ఓపిక నిమ్మ‌గ‌డ్డ‌కు లేక‌పోతే ఎలా? గ‌త రెండేళ్లుగా ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం మ‌రిచిన పెద్ద మ‌నిషికి రెండు రోజులు ఎదురు చూసే స‌హ‌నం లేదంటే ఎలా అర్థం చేసుకోవాలి? 

ఈ లోపే కొంప‌లు మునిగిపోతాయ‌న్న‌ట్టు ఎన్నిక‌ల షెడ్యూల్‌ను ప్ర‌క‌టించ‌డానికి నిమ్మ‌గ‌డ్డ త‌హ‌త‌హ‌లాడ‌డం వెనుక‌, ఏపీలో అస్థిరత నెల‌కొల్పాల‌నే కుట్రపూరిత ఆలోచ‌న‌లే అనే విమ‌ర్శ‌ల‌కు బ‌లం చేకూర్చ‌డ‌మే అంటే ఆయ‌న కాదన‌గ‌లరా?

ఏపీలో ఈడబ్ల్యూఎస్ కోటా అమలయ్యేనా?

క‌థ మొత్తం బంగారం చూట్టే