కరోనా భయం తగ్గింది.. ఆత్వవిశ్వాసం పెరిగింది

ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా గురించి చర్చే. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా దీని గురించే. వార్తలు పెడితే ఇవే. అయితే మొన్నటివరకు కరోనా అంటే భయపడిన జనం, ఇప్పుడు మెల్లమెల్లగా ఆ భయం నుంచి…

ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా గురించి చర్చే. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా దీని గురించే. వార్తలు పెడితే ఇవే. అయితే మొన్నటివరకు కరోనా అంటే భయపడిన జనం, ఇప్పుడు మెల్లమెల్లగా ఆ భయం నుంచి బయటకొస్తున్నట్టు కనిపిస్తోంది. ఏపీలో కేసుల సంఖ్య 100కి చేరువవుతుంటే.. అయ్యో వంద కేసులా అని ఆందోళన పడ్డారు. ఇప్పుడు కొన్ని జిల్లాల్లో ఏకంగా వందల్లోనే కేసులున్నాయి. రాష్ట్రంలో 100 కేసులు ఉన్నప్పుడు కనిపించిన ఆందోళన వెయ్యి వచ్చాక లేదు. ఇప్పుడు 1500 మార్కుకి చేరుకుంటున్నా కూడా ఆందోళన స్థాయి పెరగలేదు సరికదా తగ్గుతోంది.

ఏపీలో రెడ్ జోన్లలో అధికారులు నిత్యావసరాల్ని హోమ్ డెలివరీ చేస్తున్నారు కాబట్టి వారికొచ్చిన ఇబ్బందేమీ లేదు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కరోనా ఆందోళన బాగా తగ్గింది. నెలకు మూడుసార్లు రేషన్ సరకులు అందాయి. కుటుంబానికి వెయ్యి రూపాయల ఆర్థిక సాయంతో పాటు.. అన్ని పథకాల నిధులూ సకాలంలో జమ అయ్యాయి. రాష్ట్రంలో ఎక్కడున్నా పింఛన్ సొమ్ము మొదటి తేదీనే చేతిలో పడింది. దీంతో ఏపీలో ప్రజల సామాజిక జీవనంపై లాక్ డౌన్ ప్రభావం పెద్దగా లేవనే చెప్పాలి.

మరణాల సంఖ్య కంటే, డిశ్చార్జి అయ్యే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో.. అందరూ కరోనాతో సహజీవనానికి మానసికంగా సిద్ధమయ్యారు. మరణాల్లో కూడా కరోనాతో పాటు.. ఇతర జబ్బులూ కారణం కావడం ఈ ఆందోళనను ఇంకాస్త తగ్గిస్తోంది. ఒక రకంగా.. ఏపీ సహా మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రజలకు కరోనా భయాలు తగ్గుతున్నాయి. నిజంగా ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే.

జాగ్రత్తలు తీసుకోకపోతే కరోనా అంటుకుంటుంది కానీ ప్రాణాలు తీయదు, సరైన టైమ్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటే కరోనా ప్రాణాంతకమేమీ కాదు. ఈ విషయాలన్నీ జనాల్లోకి వెళ్లాయి కాబట్టే కరోనాపై వారిలో క్రమంగా భయం తగ్గుతోంది. ఒకరు చెప్పారని కాకుండా.. ఎవరికి వారే వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తున్నారు. బయటకెళ్లి వస్తే ఆటోమేటిగ్గా కాళ్లు నీళ్ల కుళాయి వైపు వెళ్తున్నాయి. చేతులు, కాళ్లు శుభ్రం చేసుకున్నాకే ఎవరైనా ఇంట్లో అడుగుపెడుతున్నారు. ఫేస్ మాస్క్ కూడా ప్రజల జీవన విధానంలో భాగమైపోయింది ఇప్పుడు.

ఇవన్నీ చూస్తుంటే.. కరోనాకు ఇతర దేశాలు వణికిపోయినట్టుగా.. భారతీయులు బెదిరిపోలేదని అర్థమవుతోంది. కేసుల సంఖ్య పెరుగుతున్నా.. కరోనాని ఎదుర్కోగలమనే ఆత్మవిశ్వాసం ప్రజల్లో పెరిగింది. 

జగన్ కి స్పెషల్ థాంక్స్ చెప్పిన నవీన్ పట్నాయక్