ప్రేమ పేరుతో నమ్మించి మోసం

ఈ హెడ్డింగ్ చదివిన వెంటనే ఆలోచనలన్నీ అబ్బాయి వైపు వెళ్లిపోతాయి. నిత్యపెళ్లికొడుకు, మాయదారి మోసగాడు, నయవంచకుడు లాంటి టైటిల్స్ గుర్తొస్తాయి. అతడ్ని కఠినంగా శిక్షించాలంటూ మహిళా సంఘాలు చేసే నినాదాలు చెవుల్లో మార్మోగుతాయి. కానీ…

ఈ హెడ్డింగ్ చదివిన వెంటనే ఆలోచనలన్నీ అబ్బాయి వైపు వెళ్లిపోతాయి. నిత్యపెళ్లికొడుకు, మాయదారి మోసగాడు, నయవంచకుడు లాంటి టైటిల్స్ గుర్తొస్తాయి. అతడ్ని కఠినంగా శిక్షించాలంటూ మహిళా సంఘాలు చేసే నినాదాలు చెవుల్లో మార్మోగుతాయి. కానీ అదే స్థానంలో ఓ అమ్మాయి ఉంటే?

ఊహించుకోవడం కాస్త కష్టమే కానీ, నిజంగా జరిగింది ఈ ఘటన. ప్రేమ పేరుతో దగ్గరై, పెళ్లి కూడా చేసుకొని, ఆ తర్వాత యువకుడ్ని నిలువునా ముంచేసింది ఓ అమ్మాయి. తిరుపతిలో జరిగింది ఈ ఘటన. ప్రస్తుతం ఆ కి''లేడీ'' కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఏం జరిగింది.. ఎలా జరిగింది? చిత్తూరు జిల్లా విజయపురం ప్రాంతానికి చెందిన యువకుడు తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే కంపెనీలో పనిచేస్తోంది సుహాసిని. అమ్మానాన్న లేని అనాథగా తననుతాను పరిచయం చేసుకుంది. రోజూ పలకరించడం, ఫోన్లలో మాట్లాడుకోవడం కామన్ గా జరిగిపోయాయి. వెంటనేన ప్రేమలో కూడా పడ్డారు.

కొన్ని రోజులకు సుహాసినే పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. పెళ్లి చేసుకొని తనకు కొత్త జీవితం ఇవ్వాలంటూ ప్రాధేయపడింది. యువకుడు కూడా ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో పెళ్లి ఖర్చులు, ఇతర అప్పులు అంటూ యువకుడి నుంచి 6 లక్షల రూపాయల వరకు తీసుకుంది సుహాసిని. పెళ్లి కూడా అయిపోయింది. ఆ వెంటనే సుహాసిని పరారైంది.

తను మోసపోయినట్టు గ్రహించిన యువకుడు అలిపిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కంప్లయింట్ ఇచ్చిన తర్వాత అసలు విషయం తెలిసి అవాక్కయ్యాడు. సుహాసినికి ఇదివరకే పెళ్లయింది. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి అయింది. తాజాగా జరిగింది మూడో పెళ్లి. ఇలా పెళ్లి పేరిట యువకుల్ని మోసం చేసి డబ్బుతో పరారవ్వడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య అంటున్నారు పోలీసులు.