కరోనా థర్డ్ వేవ్ కూడా రాబోతోందనే ఆందోళనలు మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సన్నద్ధమౌతోంది. మరీ ముఖ్యంగా థర్డ్ వేవ్ చిన్నారులపై దుష్ప్రభావం చూపిస్తుందనే అంచనాల మధ్య రాష్ట్రంలో తగినన్ని ఏర్పాట్లు ఉన్నాయా లేదా, సదుపాయాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఏం చేయాలనే అంశంపై ప్రభుత్వం ఇప్పట్నుంచే కసరత్తు మొదలుపెట్టింది.
పక్కా ప్రణాళిక సిద్ధం
థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు ఏపీ సర్కారు పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. సెప్టెంబర్ నుంచి ఈ ముప్పు పొంచి ఉందనే అంచనాలకు అనుగుణంగా.. రాబోయే 2-3 నెలల్లో చేయాల్సిన సన్నద్ధతపై పూర్తిస్థాయిలో దృష్టిలో పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 19 ఆర్టీపీసీఆర్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. చిన్న పిల్లలకు సంబంధించిన ఐసీయూలు, ఆక్సిజన్ బెడ్స్ సిద్ధం చేసే పని ప్రారంభించింది.
రాష్ట్రంలో 16 ఏళ్ల లోపు పిల్లలు ఎంతమంది ఉన్నారు.. వాళ్లలో గరిష్టంగా కరోనా సోకితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ప్రభుత్వం ఇప్పటికే సమగ్ర నివేదిక తయారుచేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్న పిల్లల వైద్యులందర్నీ ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు రూపకల్పన చేస్తోంది. ప్రైవేట్ హాస్పిటల్స్ లో పనిచేస్తున్న పీడియాట్రిక్ వైద్యులతో పాటు.. ప్రస్తుతం వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు, మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న పీడియాట్రిక్ స్టాఫ్ సేవల్ని కూడా వినియోగించుకోవాలని నిర్ణయించింది.
డాక్టర్లు లేరు.. ఏం చేయాలిప్పుడు
వైద్య కళాశాలలు, ఇతర సంస్థల్లో కలుపుకొని ప్రభుత్వ పరిథిలో ప్రస్తుతం 598 మంది చిన్నపిల్లల వైద్యులున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో పనిచేస్తున్న స్టాఫ్ ను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య 15 వందలు దాటదు. ఇంత తక్కువమంది వైద్యులతో థర్డ్ వేవ్ ను ఎదుర్కోవడం కష్టమనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. మౌలిక సదుపాయాలు పెంచినా వైద్యులు లేనప్పుడు ఎవ్వరూ ఏం చేయలేరు. అందుకే ప్రభుత్వం క్షేత్రస్థాయి నుంచి నష్ట నివారణ చర్యలకు కార్యాచరణ సిద్ధం చేసింది.
గ్రామస్థాయి నుంచి చిన్నారుల డేటాను, వాళ్ల ఆరోగ్య పరిస్థితిని మానిటర్ చేయబోతున్నారు. ఎవరైనా పిల్లలు అనారోగ్యంతో బాధపడుతుంటే వెంటనే వాళ్ల వివరాల్ని, లక్షణాల్ని సమీప ఆరోగ్య కేంద్రానికి చేరవేయాలని నిర్ణయించారు. ఇలా క్షేత్రస్థాయి నుంచే కరోనా లక్షణాల్ని గుర్తించి, థర్డ్ వేవ్ ను అదుపులోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
పిల్లలపై థర్డ్ వేవ్.. భయాలొద్దు
మరోవైపు థర్డ్ వేవ్ లో పిల్లలకు ముప్పు ఎక్కువగా ఉంటుందనే భయాలు పెట్టుకోవద్దని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. థర్డ్ వేవ్ లో పిల్లలే ఎక్కువగా బాధితులుగా మారుతారనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని తాజాగా కేంద్రం ప్రకటించగా.. ఇప్పుడు అలాంటిదే మరో నివేదిక వచ్చింది.
పిల్లల్లో థర్డ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందనడానికి ఆధారాల్లేవని.. లాన్సెట్ ఇండియాకు చెందిన టాస్క్ ఫోర్స్ ఓ నివేదిక విడుదలచేసింది. థర్డ్ వేవ్ లో ఎక్కువమంది పిల్లల్లో లక్షణాలు కనిపించవని, మరికొందరిలో స్వల్ప స్థాయిలో లక్షణాలు కనిపిస్తాయని.. మరణాలు తక్కువగా ఉంటాయని ఈ నివేదిక తెలిపింది.