కరోనా భారతం: పేద-ధనిక మధ్య స్పష్టమైన అంతరం

కరోనాతో ఇండియా సతమతమౌతోంది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. కోట్లాది మంది వ్యక్తుల ఆదాయం పడిపోయింది. ఆర్థిక రంగం కుదేలైంది. ఇదే భారతావనిలో అత్యాధునికమైన, అత్యంత ఖరీదైన…

కరోనాతో ఇండియా సతమతమౌతోంది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. కోట్లాది మంది వ్యక్తుల ఆదాయం పడిపోయింది. ఆర్థిక రంగం కుదేలైంది. ఇదే భారతావనిలో అత్యాధునికమైన, అత్యంత ఖరీదైన 50 మెర్సిడెజ్ బెంజ్ కార్లు నెల రోజుల్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. 

ఓవైపు తినడానికి తిండిలేక ఇబ్బంది పడుతున్న వాళ్లు కోట్లలో ఉంటే, మరోవైపు కోట్ల రూపాయల ఖరీదు చేసే కార్లు చిటికెలో అమ్ముడుపోతున్నాయి. పేద-ధనిక మధ్య అంతరానికి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ ఇంకోటి ఉండదేమో.

ఓవైపు సంపన్నుల ఆస్తి పెరుగుతుంటే, మరోవైపు పేదల ఆస్తులు కరిగిపోతున్నాయి. తలసరి ఆదాయం ఏడాది సగటులో బంగ్లాదేశ్ తో పోటీపడుతున్నాం. ఆర్థిక అసమానతల్ని తట్టుకొని అభివృద్ధి చెందిన దేశాలు చాలానే ఉన్నాయి. కానీ కరోనా వల్ల ఇండియాలో మాత్రం ఈ అసమానతలు అనూహ్యంగా పెరిగిపోయాయి. 

ఓవైపు ధనవంతుల ఆదాయం లెక్కలేనంత పెరిగిపోతుంటే.. మరోవైపు నిరుద్యోగం అదే స్థాయిలో పెరిగిపోతోంది. పొదుపు తగ్గిపోతోంది. లగ్జరీ కార్లు కొనేందుకు ధనవంతులు పోటీ పడుతుంటే, పిడికెడు అన్నం కోసం, పొట్ట కూటి కోసం పేదలు పరుగులు పెడుతున్నారు.

ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం గతేడాది పేదలకు ఆహార ధాన్యాల లభ్యత సగానికి పైగా పడిపోయింది. వాళ్ల కడుపులు సగమే నిండాయి. ప్రభుత్వం 80 కోట్ల మందికి సరిపడ ఆహార ధాన్యాలు అందుబాటులోకి వచ్చాయని, ధాన్యం-గోధుమల్ని అదనంగా అందించే పథకాన్ని గతేడాది మే నెల నుంచే అమల్లోకి తెచ్చినప్పటికీ.. పేదలకు అది అందలేదనేది కఠోర సత్యం. 

సరిగ్గా అదే టైమ్ లో గౌతమ్ అదానీ ఆస్తుల విలువ 43 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. ముఖేష్ అంబానీ, ఆసియాలోనే రెండో అత్యంత ధనవంతుడిగా గుర్తింపు పొందారు. దాదాపు అదే టైమ్ లో, అంటే ఏప్రిల్ లో బిలియనీర్ దమానీ ముంబయిలో137 మిలియన్ డాలర్లు పెట్టి అత్యంత ఖరీదైన భవంతిని కొనుగోలు చేశారు. ఇండియాలోనే అత్యంత ఖరీదైన డీల్ ఇది. పేదలు, మధ్యతరగతి వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, బిలియనీర్ల ఆదాయం మాత్రం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది.

ఆర్థికవేత్తల అంకెలపరంగా ఈ విషయాన్ని చూద్దాం. సూక్ష్మస్థాయి, మధ్యశ్రేణి వ్యాపారులు కేవలం 62 శాతం మాత్రమే పనితీరు కనబరిస్తే.. దేశంలోని 5 పెద్ద కంపెనీలు ఈ ఏడాదిలో 58 శాతం వృద్ధిని నమోదుచేశాయి. మరోవైపు కేంద్రం పన్నులు పెంచుకుంటూ పోతోంది. చివరికి కరోనా చికిత్సలో ఉపయోగించే వస్తువులు, మందులపై కూడా జీఎస్టీ బాదుతోంది. కానీ రాబోయే రోజుల్లో పన్నుల ఆదాయం తక్కువగానే ఉండబోతోంది. దీని అర్థం ప్రైవేట్ వ్యక్తులు, బడా బాబుల చేతుల్లో ఎక్కువ మొత్తం ఉండిపోతోందని.

ఈ కరోనాతో మధ్యతరగతిలో ఉన్న ప్రజలు చాలామంది పేదరికంలోకి వెళ్లిపోతున్నారు. కరోనా నుంచి తమవాళ్లను కాపాడుకునేందుకు ఆస్తులు అమ్ముకుంటున్న వాళ్లు, సేవింగ్స్ ను కోల్పోయిన వాళ్లు లక్షల్లో ఉన్నారు. సొంత ఇల్లులు కోల్పోయి అద్దె కొంపల్లోకి మారినవాళ్లు లక్షల్లో ఉన్నారు.

మధ్యతరగతి భారతదేశం మరోసారి మనుగడ కోసం పోరాటం సాగిస్తోంది. ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ నుంచి బయటపడుతున్న దేశంలో.. 23 మిలియన్ల రోజుకూలీలు పొట్ట కూటి కోసం రోడ్డెక్కుతున్నారు. తక్కువ జీతాలకైనా పనిచేసేందుకు మధ్యతరగతి ఉద్యోగులు సిద్ధపడుతున్నారు. 

ఇప్పటివరకు ఉద్యోగం కోల్పోయిన 8.5 మిలియన్ నిరుద్యోగులు కొత్త జీవనోపాధి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్నో స్టార్టప్స్ మళ్లీ మొదట్నుంచి పని ప్రారంభించబోతున్నాయి. లెక్కలేనన్ని సంప్రదాయ కుటీర పరిశ్రమలు చితికిపోయాయి. వాళ్లంతా ఇప్పుడు కొత్త జీవనోపాధి కోసం ఎదురుచూస్తున్నారు. 

ధనిక వర్గం మాత్రం లగ్జరీ కార్లు కొంటోంది, ఖరీదైన బంగ్లాలు కొనుగోలు చేస్తోంది. అంతేకాదు, త్వరలోనే విదేశాలకు విహార యాత్రలకు ప్రణాళికలు రచిస్తోంది. ఇదే మన భారతం.