ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా, ఆర్థికశాఖ మంత్రిగా సుదీర్ఘ కాలం పనిచేసిన యనమల రామకృష్ణుడి పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. మండలి రద్దు అమల్లోకి వస్తే…ఇక ఆయనకు ఆ ఒక్క పదవి ఊడిపోతుంది. ఇక ఆయనకు పదవి ఇచ్చే అవకాశాల్లేవు. భవిష్యత్ గురించి ఆలోచిస్తే యనమలకు బెంగ పట్టుకున్నట్టుంది. చంద్రబాబును సగం తప్పుదోవ పట్టించడంలో యనమలది అగ్రస్థానం అని చెప్పక తప్పదు.
అయిందానికి, కాని దానికి విలేకరుల ముందుకు వస్తూ….నిత్యం ప్రచారంలో ఉండాలనే యావ యనమల తర్వాతే ఎవరైనా. టీడీపీలో ప్రచార పిచ్చిలో మొట్ట మొదట చంద్రబాబు గురించి చెప్పుకోవాలి. ఆ తర్వాత స్థానం యనమల రామకృష్ణుడిదే. అయితే ఇటీవల ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, టీడీపీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య కాస్తా పుంజుకున్నారు. యనమలను దాటి ముందుకెళ్లారు. దీంతో యనమల అప్రత్తమయ్యారు. ఎటూ పదవి పోతే , ఇంకేం పని ఉండు. అప్పుడు పట్టించుకునే దిక్కు కూడా ఉండదు.
దీంతో ఆయన ప్రెస్ ముందుకు రావడంలో యాక్టివ్ అయ్యాడు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాడు. 11 ఛార్జిషీట్లలో జగన్‌మోహన్‌రెడ్డి అవినీతిపై విచారణ న్యాయస్థానాల్లో ముగింపు దశకు చేరిన నేపథ్యంలో …దాన్ని కప్పి పుచ్చుకోవడానికి వైసీపీ నేతలు నానా పాట్లు పడుతున్నారని యనమల విమర్శించాడు. ఈ 9 నెలల వైసీపీ ప్రభుత్వ అవినీతి పాలనపై హైకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ చేపట్టాలని తాము కోరామని, ఇప్పటికీ అదే డిమాండ్ చేస్తున్నామన్నారు.
రెండుమూడు రోజుల క్రితం బాబు అవినీతి భాగోతంపై సాక్షిలో కథనం రాస్తే…ఇదే యనమల రామకృష్ణుడు పత్రికా విలువలు పడిపోతున్నాయంటూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు వల్ల ఒరిగేదేమీ ఉండదు. కానీ యనమల తనకు కావాల్సిన ప్రచారం మాత్రం పొందాడు. ఇప్పుడు ఆయనకు కావాల్సింది ఇదే.