వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దమ్ముంటే స్థానిక ఎన్నికలు నిర్వహించాలంటూ ఒక ఛాలెంజ్ విసిరారు తెలుగుదేశం నేత యనమల రామకృష్ణుడు! ఆ పార్టీకి మైనారిటీల్లో, బీసీల్లో, ఎస్సీల్లో వ్యతిరేకత పెరుగుతోందని అందుకే స్థానిక ఎన్నికలను నిర్వహించడం లేదు.. అని యనమల సూత్రీకరించేశారు కూడా! అయినా.. యనమల వంటి నేత దమ్ము గురించి మాట్లాడటం భలే సరదాగా ఉంటుంది!
ఇంతకీ ఈయన ఎన్నికల్లో పోటీ చేసింది ఎప్పుడు? చివరిసారి గెలిచిందెప్పుడు? తునిలో వీరి తమ్ముళ్లంగారు వరసగా సాధిస్తున్న పరాజయాల పరంపర ఎలాంటిది.. అనే విషయాలు ఎరిగిన వారికి యనమల చేసే ఛాలెంజుల్లోని పస ఏ పాటిదో స్పష్టం అవుతుంది.
ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేక, ప్రజలు ఇక ఎన్నుకోరని స్పష్టం అయిపోయి.. చంద్రబాబు ఇచ్చిన నామినేటెడ్ పదవితో తను కూడా రాజకీయాల్లో ఉన్నట్టుగా అనిపించుకుంటున్న యనమల దమ్ము గురించి మాట్లాడటానికి మించిన ప్రహసనం మరోటి ఉండదు.
ఇక రెండో విషయం.. స్థానిక ఎన్నికలను నిర్వహించడం దమ్ముగా యనమల చెప్పడం. మరి చంద్రబాబుకు ఆ దమ్ము ఎందుకు లేకపోయిందో యనమల చెప్పాలి! షెడ్యూల్ ప్రకారం స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరగాల్సింది? 2018కే మొత్తం స్థానిక ఎన్నికల ప్రక్రియ అంతా ముగియాల్సింది.
అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో వెలగబెట్టింది కదా, సకాలంలో ఎందుకు చంద్రబాబు నాయుడు ఎన్నికలను నిర్వహించలేదు? అప్పుడు సాకులు చెప్పి ఎందుకు ఎన్నికలను నిర్వహించలేదు? .
కరోనా కారణంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్న విషయాన్ని నిమ్మగడ్డ ప్రకటించినప్పుడు తెలుగుదేశం గంతులు వేసింది కదా, మరి ఇప్పుడు కరోనా లేదా? కరోనా భయం లేకపోతే చంద్రబాబు ఎందుకు ఇళ్లు దాటడం లేదు? దమ్ము, ధైర్యం అంటూ మాట్లాడిన యనమల ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే బాగుంటుందేమో!