యార్లగడ్డ తెలుగును వెలిగిస్తారా?

ఏపీలో తెలుగు భాషా సంఘం ఏర్పడబోతోంది. అంటే అధికార భాషా సంఘమన్నమాట. దీనికి ప్రముఖ హిందీ పండితుడు, రచయిత డాక్టర్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను ఛైర్మన్‌గా నియమిస్తున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఈమధ్యనే ప్రకటించారు. జగన్‌…

ఏపీలో తెలుగు భాషా సంఘం ఏర్పడబోతోంది. అంటే అధికార భాషా సంఘమన్నమాట. దీనికి ప్రముఖ హిందీ పండితుడు, రచయిత డాక్టర్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను ఛైర్మన్‌గా నియమిస్తున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఈమధ్యనే ప్రకటించారు. జగన్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మంచిదే. అందులోనూ యార్లగడ్డను అధికార భాషాసంఘం ఛైర్మన్‌గా నియమించడం సముచితమే. ఆయన జాతీయస్థాయిలో పేరుమోసిన హిందీ పండితుడైనప్పటికీ తెలుగు సాహిత్యంలోనూ ఆయన కృషి తక్కువది కాదు. చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రంలో తెలుగు అమలు కోసం పోరాటం చేశారు. కేంద్రం ఆయన్ని పద్మభూషణ్‌ పురస్కారంతో గౌరవించింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రాసిన ద్రౌపది నవల తెలుగు సాహిత్యంలో సంచలనమైంది. తెలుగు భాషా సంఘానికి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ సరైన వ్యక్తేగాని ఆయన ఆధ్వర్యంలో తెలుగు వెలుగు ఎంతమేరకు విస్తరిస్తుంది? అనేది ప్రశ్న.

తెలుగు అమలుకు ప్రత్యేక మంత్రిత్వశాఖ సాధ్యంకాదని చెప్పిన ప్రభుత్వం భాషా సంఘం ఏర్పాటుతో సరిపెట్టింది. యూపీలో పశువుల సంరక్షణ కోసం మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసినప్పుడు భాష కోసం మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం కష్టం కాదు కదా. కనీసం భాషా సంఘం ఏర్పాటు చేసినందుకైనా సంతోషించాలి. ఉమ్మడి రాష్ట్రంలో అధికార భాషా సంఘం ఉండేది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు కాగానే భాషా సంఘం ఏర్పాటు చేశారు. కాని ఈ భాషా సంఘానికి ఎలాంటి అధికారాలూ ఉండవు. అసలు ఇది ఒకటుందని చాలామందికి తెలియదు. ఈ సంఘం తెలుగు అమలు కోసం ప్రభుత్వ శాఖలకో, సంస్థలకో సలహాలు, సూచనలు ఇవ్వగలదేగాని అధికారికంగా విధాన నిర్ణయాలు తీసుకొని తెలుగును అమలు చేయించలేదు.

ఉమ్మడి రాష్ట్రంలో అధికార భాషా సంఘం కార్యకలాపాలు అప్పుడప్పుడైనా ప్రజలకు తెలిసేవి. తెలంగాణలో అధికార భాషా సంఘం గురించి అనుకునేవారే లేరు. బహుశా ఏపీలోనూ ఇలాగే ఉంటుందో, క్రియాశీలకంగా ఉంటుందో చెప్పలేం. చంద్రబాబు నాయుడు హయాంలో తెలుగును అసలు పట్టించుకోలేదు. విద్యా వ్యాపారి, అప్పట్లో మున్సిపల్‌ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ తెలుగు నేర్చుకోవడం వృథా అన్నట్లుగా మాట్లాడిన సందర్భాలున్నాయి. చంద్రబాబు పాలనలో తెలుగు భాషాభిమానులు తెలుగు అమలు కోసం మొర పెట్టుకున్నా పట్టించుకోవడంలేదు. చివరకు సొంత రాష్ట్రంలో తెలుగు భాష అమలు కోసం నిరాహార దీక్ష చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఈ దీక్ష చేసింది యార్లగడ్డ లక్ష్మీప్రసాదే.

రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రాలో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యార్లగడ్డ తెలుగు అమలు కోసం వేడుకుంటూనే ఉన్నారు. అద్భుతమైన రాజధాని నిర్మిస్తానని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు అమ్మ భాషను అమ్మ భాషను అటకెక్కించి యువతీ యువకులంతా జపాన్‌ భాష నేర్చుకోవాలని కోరారు. ఎందుకు? జపాన్‌ వాళ్లు ఆంధ్రలో పరిశ్రమలు, పెద్ద సంస్థలు ఏర్పాటు చేస్తామన్నారు. వాళ్లు ఇంగ్లీషును ఒప్పుకోరు. వాళ్ల పరిశ్రమల్లో  స్థానికులకు అవకాశాలు ఇవ్వాలంటే జపనీస్‌ వచ్చివుండాలి. దీంతో జపనీస్‌ నేర్చుకోమని బాబు చెప్పారు. చంద్రబాబు మర్చిపోయిన అనేక హామీల్లో తెలుగు అమలు ఒకటి. ఇది కూడు పెట్టే భాష కాదు కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసినప్పుడు ఆహ్వాన పత్రికలు ఇంగ్లీషులోనే ముద్రించారు. ఆ  పత్రికలు చూస్తే అమరావతి బాబు సొంత రాజధాని అనిపిస్తుంది.

ఇక శంకుస్థాపన శిలాఫలకం పూర్తిగా ఇంగ్లీషులోనే ఉంది. తాత్కాలిక సచివాలయం కమ్‌ అసెంబ్లీ భవనాలకు శంకుస్థాపన చేసినప్పుడు శిలాఫలకం ఇంగ్లీషులోనే ఉంది. అప్పట్లో ఈ చర్యలను యార్లగడ్డ ప్రశ్నించారు. అమరావతి శంకుస్థాపన శిలాఫలకాలను తెలుగులో రాయించి సీఆర్‌డీఏ అధికారులకు ఇచ్చామని కాని వాటిని ఏర్పాటు చేయలేదని యార్లగడ్డ చెప్పారు. తాను ఎన్టీఆర్‌ వారసుడినని, ఆయన ఆశయాలు కొనసాగిస్తామని జయంతి, వర్ధంతి రోజుల్లో ప్రతిజ్ఞ చేస్తుంటారు. కాని తెలుగు భాషపై ఆయనకున్న ప్రేమలో ఈయనకు అణువంత కూడా చూపించలేదు.

అమరావతిలో అన్ని వ్యవహారాలు ఆంగ్లంలోనే జరుగుతునాన్నాయని, తెలుగు కనబడటంలేదని అప్పట్లో యార్లగడ్డ ఆవేదన చెందారు. ఆంధ్రా అసెంబ్లీలో ఆంగ్లంలో బడ్జెటు ప్రతిని చదవిన ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడిని విమర్శించిన యార్లగడ్డ తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ను అభినందించారు. ఎందుకంటే ఆయన బడ్జెటు ప్రతిని తెలుగులో చదివారు కాబట్టి. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయనుకోండి. జగన్‌ పాలనలో తెలుగుకు వైభవం వస్తుందని ఓసారి యార్లగడ్డ అన్నారు. అది నిజమవడానికి ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుందో చూడాలి. 

డియర్ కామ్రేడ్ పై దర్శకుడి కష్టాలు

ఈవారం గ్రేట్ ఆంధ్ర స్పెషల్ వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి