పెద్దవారు తింటే ఫలహారాలు, చిన్నవారు తింటే చిరుతిళ్లు అన్న సామెత ఊరికినే పుట్టలేదు. తెలుగుదేశం మద్దతు దారులను చూసి, దాని అనుకూల మీడియాను చూసే పుట్టి వుంటుంది. నవరత్నాలు అనే హామీ ఇచ్చి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఏదో విధంగా ఆ హామీలు నిలబెట్టుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పుడు అదే పని మీద వున్నారు. ఒకవేళ ఈ హామీలు నిలబెట్టుకోకపోతే, ఇదే బాబుగారి అనుకూల మీడియా ఏమని రాస్తుంది? రాలిపోయిన రత్నాలు. నవరత్నాలు గాలికి, ఇలా రకరకలాలుగా రాయదా?
కానీ ఇప్పుడు జగన్ ఎలాగైనా ఆ హామీలు నిలబెట్టుకోవాలని చూస్తుంటే, కూడా ఆ మీడియా ఏదో ఒకటి రాయకుండా వుండలేకపోతోంది. నవరత్నాల హామీలు నిలబెట్టుకోవడం కోసం జగన్ ఎన్ని వేల, లక్షల కోట్లు అప్పులు చేస్తాడో అని ఆందోళన పడిపోతోంది. రాష్ట్రం మరో వెనిజులా అయిపోతుందని ఆవేదన చెందుతోంది. పనిలో పనిగా అంతగా బాగుండదని, చంద్రబాబు కూడా పసుపు కుంకుమల కోసం పదివేల కోట్లు అప్పు చేసాడని ఓ మాట చేర్చింది.
కానీ చంద్రబాబు అయిదేళ్ల పాటు పప్పు బెల్లాల్లా పంచిన తాయిలాల సంగతి ఈ మీడియా మరిచిపోయింది. చంద్రన్న కానుకలు అంటూ పండగులకు పంచిన సరుకుల దగ్గర నుంచి రకరకాల స్కీములు పెట్టి ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ అంటూ పంచేయలేదా? ఎన్నికల ముందు రైతులకు, ఆడపడుచులకు సరిగ్గా, ప్రచారం డేట్లు, పోలింగ్ డేట్లు లెక్కవేసి మరీ ఓట్ల కోసం ప్రభుత్వం డబ్బు పంచేయలేదా?
అప్పుడు లేని తప్పు, ఇప్పుడు కనిపిస్తోందా? అప్పుడు చంద్రబాబుకు కూడా ఈ సుద్దులు చెప్పాల్సింది కదా? వెనిజులా అయిపోతుందని హెచ్చరించాల్సింది కదా? అప్పుడు అంతా అధికారం కోసం బాబు వేసిన ఎత్తులు అద్భుతంగా కనిపించాయి. ఇప్పుడు జగన్ మాట నిలెబెట్టుకోవడం కోసం చేస్తుంటే, బాధగా, కష్టంగా, ఆందోళనగా వుంది.