వైసీపీ మాటలతో బిజెపికి బుద్ధొస్తుందా?

బిజెపి ఇప్పుడు మత కలహాల మీద కూడా కన్నేసింది. యాభై రూపాయలకే రాష్ట్రానికంతా సారా తాగిస్తామని, సారాతాగేవాళ్లంతా రాష్ట్రంలో కోటి ఓట్లు తమ పువ్వు గుర్తుకు వేయాలని ఒక విషయం చెప్పి.. సెల్ఫ్ గోల్…

బిజెపి ఇప్పుడు మత కలహాల మీద కూడా కన్నేసింది. యాభై రూపాయలకే రాష్ట్రానికంతా సారా తాగిస్తామని, సారాతాగేవాళ్లంతా రాష్ట్రంలో కోటి ఓట్లు తమ పువ్వు గుర్తుకు వేయాలని ఒక విషయం చెప్పి.. సెల్ఫ్ గోల్ వేసుకున్న భారతీయ జనతా పార్టీ.. అంతకంటె నీచానికి దిగజారుతోంది. అంతకంటె నీచంగా.. ఓటు బ్యాంకు రాజకీయాలకోసం మతాన్ని హేయమైన రీతిలో వాడుకుంటోంది. రాష్ట్రంలో హిందూ ముస్లిం అనే తేడాలు.. పెచ్చరిల్లేలా వివాదాలు సృష్టించి.. అగ్గి రాజేయాలని కుట్ర పన్నుతోంది.

గుంటూరులో జిన్నా టవర్ పేరు మంచి చేయాలని జిన్నా టవర్ ను కూల్చివేయాలని భారతీయ జనతా పార్టీ నాయకులు రకరకాలుగా ప్రకటనలు చేస్తున్నారు. ఇదంతా కేవలం సామరస్యంగా ఉన్న ప్రజల మధ్య మతవిద్వేషాలు రెచ్చగొట్టడానికి జరుగుతున్న ప్రయత్నం మాత్రమే అనే అభిప్రాయం ఎవరికాన కలుగుతుంది. అయితే ఇవాళ జిన్నా సెంటర్ గురించి ఓవరాక్షన్ చేస్తున్న బీజేపీకి బుద్ధి వచ్చే లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి పరిశోధనతో కొన్ని వివరాలను బయట పెట్టింది. అది చూసిన తర్వాత అయినా బీజేపీకి బుద్ధి వస్తుందో లేదో చూడాలి.

1945 లో గుంటూరు లోని ఈ జిన్నా టవర్ ను మతసామరస్యానికి ప్రతీకగా నిర్మించారు. తర్వాతి కాలంలో అది నగరంలో ప్రముఖ సెంటరుగా పేరు పొందింది. అయితే గతంలో భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ జిన్నా గురించి చేసిన సానుకూల ప్రకటనలను ఇప్పుడు లేళ్ల అప్పిరెడ్డి బయట పెడుతున్నారు.

2005లో అద్వానీ పాకిస్తాన్ సందర్శించారు. పాకిస్తాన్ ఆయన జన్మస్థలం. అక్కడే పుట్టి.. భారత్ లో స్థిరపడ్డారు. పాక్ పర్యటనలో భాగంగా.. జిన్నా సమాధిని సందర్శించి.. స్వాతంత్ర్యపోరాటంలో జిన్నా సేవలను కూడా అద్వానీ స్వయంగా కొనియాడారు. “భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన లౌకికవాది జిన్నా. ఆయన హిందూ–ముస్లింలకు అంబాసిడర్‌ వంటి వారు.” అని అద్వానీ అన్న మాటల కటింగ్ లను వైసీపీ బయటపెట్టింది. 

2008లో ఇంకో తమాషా జరిగింది. 2005లో పాకిస్తాన్ పర్యటనలో జిన్నా గురించి చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటారా? అని ఓ సందర్భంలో విలేకరులు అడిగితే.. అద్వానీ తిరస్కరించారు. జిన్నా గురించి చెప్పిన ఆ మాటలకు కట్టుబడే ఉన్నానని అన్నారు. 

ఈ క్లిప్పింగులన్నీ వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి బయటపెట్టి.. బీజేపీ వారిని ఎండగడుతున్నారు. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎంత వైభవ స్థితిలో అయినా ఉండవచ్చు గాక.. అసలు ఆ పార్టీ బతికి ఉన్నదంటే అది కేవలం అద్వానీ పుణ్యమే. అలాంటి అద్వానీ చెప్పిన మాటల పట్ల బీజేపీ నాయకులు ఏమంటారు? బీజేపీ పేపర్ కటింగ్ సాక్ష్యాల సహా.. జిన్నా కూడా ఈ దేశం స్వాతంత్ర్యం కోసం పోరాడిన అనేక మంది యోధుల్లో ఒకడని బీజేపీ అగ్రనాయకుడి గుర్తించిన వైనం బయటపెట్టిన తర్వాత..వారు నోరు మూసుకుంటారా? లేదా? వేచిచూడాలి.