చంద్రబాబుకు ఏడుపునామ సంవత్సరం

రాజకీయ నాయకుల్లో ఎవరు ఏం సాధించారు, ఏం కోల్పోయారు అనే విషయాన్ని పక్కనపెడితే, చంద్రబాబుకు మాత్రం 2021 సంవత్సరం జీవితాంతం గుర్తుండిపోతుంది. ఎందుకంటే, తొలిసారి ఆయన ఏడ్చిన సంవత్సరం ఇది. ఏడుపు డ్రామాకు ఆద్యం…

రాజకీయ నాయకుల్లో ఎవరు ఏం సాధించారు, ఏం కోల్పోయారు అనే విషయాన్ని పక్కనపెడితే, చంద్రబాబుకు మాత్రం 2021 సంవత్సరం జీవితాంతం గుర్తుండిపోతుంది. ఎందుకంటే, తొలిసారి ఆయన ఏడ్చిన సంవత్సరం ఇది. ఏడుపు డ్రామాకు ఆద్యం పోసిన ఏడాది ఇది. అందుకే చంద్రబాబుకు ఇది ఏడుపునామ సంవత్సరంగా మిగిలిపోతుందంటూ సెటైర్ వేశారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.

“వైసీపీకి ఇది సంక్షేమ నామ సంవత్సరం. ఇక తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు ఇది ఏడుపు నామ సంవత్సరం. మరరీ ముఖ్యంగా బాబుకు ఇది డ్రామా ఏడుపునామ సంవత్సరం. బీజేపీకి ఇది చీప్ లిక్కర్ నామ సంవత్సరం. పవన్ కల్యాణ్ కు కొత్త ప్యాకేజీ కోసం వెదుక్కునే సంవత్సరం ఇది.”

ఇలా చంద్రబాబుతో పాటు ఒకేసారి బీజేపీ, జనసేన పార్టీలపై సెటైర్ వేశారు అంబటి. రాష్ట్రం ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి మొక్కవోని దీక్షతో సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నారని కొనియాడారు. సంక్షేమం విషయంలో తగ్గేదేలే అంటున్నారు.

“విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బందుల్లో పడింది. ఆర్థికంగా ఇక్కట్లు చూస్తున్నాం. అయినా ఎక్కడా బెదరకుండా, సీఎం పర్యవేక్షణలో, వాలంటీర్లను కదిలించి కొవిడ్ ను అత్యంత సమర్థంగా ఎదుర్కొన్న సంవత్సరం ఇది. ఈ సంవత్సరంలో మేనిఫెస్టోలోని 95 శాతం హామీల్ని అమలుచేశాం. ఆదాయం తగ్గినా సంక్షేమం విషయంలో ఎక్కడా తగ్గలేదు.”

బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు.. తమ పార్టీల సిద్ధాంతాలు మరిచిపోయి, అందరూ పెనవేసుకొని వైసీపీ మీదకు దండెత్తే ప్రయత్నం చేస్తున్నారని.. అయినప్పటికీ రాబోయే కాలంలో ప్రతిపక్షాల కుట్రలన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటామని అన్నారు అంబటి. 3 రాజధానుల అంశం మళ్లీ తెరపైకొస్తుందని, కచ్చితంగా 3 రాజధానులు ఏర్పాటవుతాయని అన్నారు అంబటి. అమరావతి కూడా రాజధానిగా కొనసాగుతుందన్నారు.