జిల్లాల పునర్విభజనలో భాగంగా మరో 13 జిల్లాలు ఏపీలో తెరపైకి వచ్చాయి. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కొత్త జిల్లాల్లో ఆ రోజు నుంచి పరిపాలన మొదలు పెట్టాలని ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులు తలమునలయ్యారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రజాప్రతినిధులు దూరదృష్టితో ఆలోచిస్తున్నారు. మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనుండడాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆ రోజు ఇబ్బంది లేకుండా అధికార యంత్రాంగాన్ని నియమించుకోవాలని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు కసరత్తు చేస్తున్నారు.
ముఖ్యంగా ఎస్పీలు, కలెక్టర్లను నియమించుకోవడంలో అధికార పార్టీ నేతలు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. కొత్త జిల్లాల పరిధి లోని ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసికట్టుగా ఒక అవగాహనతో జిల్లా అధికారులను నియమించుకునే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, వైసీపీ ఇన్‌చార్జ్‌లు సమావేశమవుతున్నారు.
కొత్త జిల్లాలకు కొత్త వారిని నియమించాలని ప్రభుత్వం ఇప్పటికే సూత్రపాయంగా ఓ నిర్ణయానికి వచ్చింది. దీంతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో మన అనుకునే వాళ్లెవరు? ధైర్యంగా కార్యాన్ని సాధించగల నేర్పరితనం ఎవరికి ఉందనే విషయమై అధికార పార్టీ నేతలు ఆరా తీస్తున్నారు.
కొందరు అధికారులు మాత్రం అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు నేరుగా కలుస్తున్నారని సమాచారం. 2024 ఎన్నికలు అన్ని రాజకీయ పక్షాలకు ప్రతిష్టాత్మకం. దీంతో నమ్మకస్తులైన అధికారులను నియమించుకునేందుకు అధికార పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. అలాగే తమకు ఇబ్బంది కలిగిస్తారనే అనుమానం ఉన్న వాళ్లను ప్రాధాన్యం లేని పోస్టుల్లోకి పంపుతున్నట్టు సమాచారం.