కొందరికి వివాదాలు అంటే ఎంతో ఇష్టం. అలాంటి వారిలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఒకరు. కొంత కాలంగా నటన కంటే వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఆమె తరచూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. సులభంగా పబ్లిసిటీ పొందడం ఎలా అనే పుస్తకం రాయాల్సి వస్తే… ఈమెతో ఆ పని చేయిస్తే సరిపోతుంది.
తాజాగా ఈ బాలీవుడ్ బ్యూటీ ట్రోలింగ్బారిన పడ్డారు. బీజేపీ గూటిలో చిలుకగా పేరున్న కంగనా అంటే తీవ్రంగా వ్యతిరేకించే ఒక వర్గం ఉంది. తాజాగా ఆమె ట్రోలింగ్ కావడానికి కారణం లేకపోలేదు.
ఇవాళ ఉదయం కంగనా రనౌత్ విమానాశ్రయంలో ప్రత్యక్షమయ్యారు. కారు దిగిన మొదలుకుని, వయ్యారంగా నడుస్తూ, చుట్టూ వై ప్లస్ సెక్యూరిటీతో ముందుకెళ్లిన వీడియోను ప్రముఖ ఫొటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేశాడు.
సైనికుల రక్షణ మధ్య కంగనా రనౌత్ కనిపించడం కొందరు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. దీంతో తమ సృజనాత్మక విమర్శలకు పదును పెట్టారు. 'కంగనాకు వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటా? ఈమెకు ఆ భద్రత ఎందుకు, ఎవరు ఇచ్చారు', 'నేను కట్టే టాక్స్ తన సెక్యూరిటీ కోసమా?' అంటూ నెటిజన్స్ ట్రోలింగ్‌కు దిగారు.
బీజేపీకి మద్దతు ఇస్తే చాలు వై ప్లస్ కేటగిరి ఏం ఖర్మ, జడ్ ప్లస్ కేటగిరి భద్రత కూడా మోదీ సర్కార్ ఇస్తుందనే సెటైర్స్ విసరడం గమనార్హం. మొత్తానికి కంగనాకు ట్రోలింగ్ తప్పలేదు.