ఉక్రెయిన్‌లో రష్యా దాడుల నేపథ్యంలో భారతీయులు భయపడ్డట్టే ఘోరం జరిగిపోయింది. రష్యా యుద్ధకాంక్షకు కర్నాటక వైద్య విద్యార్థి బలి అయ్యాడు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులే కాకుండా దేశమంతా తల్లడిల్లుతోంది. ఉక్రెయిన్ నుంచి ఒక వైపు మన దేశానికి విద్యార్థుల తరలింపు జరుగుతుండగా, మరోవైపు ఒక విద్యార్థి బాంబు దాడిలో మృతి చెందడం గమనార్హం.
ఇవాళ ఉక్రెయిన్‌లోని ఖార్కీవ్‌లో రష్యా సైన్యం జరిపిన బాంబు దాడుల్లో భారత విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని కేంద్ర విదేశాంగ ప్రతినిధి అరీందమ్ బాగ్చీ ట్విటర్ వేదికగా వెల్లడించారు. భారతీయ వైద్య విద్యార్థి కర్నాటకలోని హవేరి జిల్లా నివాసి నవీన్‌గా గుర్తించారు. ఈ మేరకు విద్యార్థి కుటుంబానికి సమాచారం ఇచ్చినట్టు విదేశాంగ తెలిపింది.
ఉక్రెయిన్‌లో మెడిసిన్ నాలుగో ఏడాది చదువుతున్నట్టు సమాచారం. ఖార్కీవ్‌లోని ప్రభుత్వ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని రష్యా బాంబు దాడులకు తెగబడింది. అయితే రష్యా సైన్యం గురి తప్పి ఆ బాంబులు నవీన్ ఉంటున్న భవనంపై పడినట్టు విదేశాంగ వెల్లడించింది. ఇదిలా వుండగా నవీన్ మృతి సమాచారాన్ని అందుకున్న కర్నాటకలోని స్థానికులు పెద్ద సంఖ్యలో అతని ఇంటికి చేరుకుంటున్నారని సమాచారం.
నవీన్ కుటుంబానికి కర్నాటక సీఎం బొమ్మై ఫోన్ చేసి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని ఆయన కోరారు. విద్యార్థి మృతదేహాన్ని త్వరగా తెప్పించేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడ్తానని ఆయన హామీ ఇచ్చారని సమాచారం.