తెలంగాణ వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న చలాన్లను క్లియర్ చేసేందుకు తెలంగాణ పోలీసు శాఖ భారీ డిస్కౌంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ డిస్కౌంట్ ఆఫర్లు ఇవాళ్టి నుంచే మొదలైంది. పోలీసులు ప్రకటించిన ఈ డిస్కౌంట్లకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పెండింగ్ చలాన్లు ఎంతలా వసూలు అవుతున్నాయంటే.. నిమిషానికి 700 చలాన్లు క్లియర్ అవుతున్నాయి.
ఒక దశలో తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ శాఖ వెబ్ సైట్ కూడా మొరాయించిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవడానికి ఈ నెలంతా టైమ్ ఉందంటూ ప్రత్యేకంగా ప్రకటించుకోవాల్సి వచ్చింది.
తెలంగాణ అంతటా వందల కోట్ల రూపాయల చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. కేవలం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ స్టేషన్ల పరిథిలోనే ఏకంగా 600 కోట్ల రూపాయల మేర చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ బకాయిల్ని వసూలు చేసేందుకు భారీ డిస్కౌంట్లు ప్రకటించింది ట్రాఫిక్ పోలీస్ విభాగం.
ద్విచక్ర వాహనాలు, ఆటోలు నడిపేవాళ్లు తమ చలాన్ల మొత్తంలో 25శాతం చెల్లిస్తే సరిపోతుందని.. ఆర్టీసీ వాహనాలు 30శాతం, నాలుగు చక్రాల వాహనదారులు 50శాతం చెల్లిస్తే సరిపోతుందని ప్రకటించింది. ఈ ఆఫర్ కు వాహనదారుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది.
ఈ-చలాన్ వెబ్ సైట్ కు వెళ్లి బండి నంబర్ నమోదు చేస్తే పెండింగ్ లో ఉన్న చలాన్ల మొత్తం చూపిస్తుంది. డిస్కౌంట్ తర్వాత చెల్లించాల్సిన మొత్తంతో పాటు సర్వీస్ ఛార్జీని కలిపి చూపిస్తుంది. ఆ మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది. ఆన్ లైన్ తో పాటు ఈ-సేవ, మీ-సేవ కౌంటర్ల వద్ద కూడా చలాన్లను క్లియర్ చేసుకోవచ్చు.