ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి చిన్న సమస్య దొరికినా చాలు అన్నట్టుంది నారా లోకేశ్ తీరు. రాష్ట్రంలో ప్రతి సంఘటనకు వైసీపీతో ముడిపెట్టి విమర్శించడం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌కు అలవాటుగా మారింది. ఏపీలో లా అండ్ ఆర్డర్ వైసీపీ చేతిలో ఉందంటున్న లోకేశ్ ఆరోపణలు హాస్యాస్పదమని ఆ పార్టీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. అధికార పార్టీ చేతిలో కాకుండా ప్రతిపక్షం టీడీపీ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తుందా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఏపీలో శాంతిభద్రతలు పక్కదారి పడితే నారా లోకేశ్ విమర్శించినా అర్థం ఉందంటున్నారు. అలా కాకుండా కేవలం విమర్శల కోసమే అన్నట్టు, ఏది పడితే అది మాట్లాడితే లోకేశ్ చులకన అవుతారని వైసీపీ నేతలు హితవు చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో దళితులకు రక్షణ కరువైందని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు.
ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లా పెద్దకంటిపల్లిలో అప్పు చెల్లించలేదని దళితుడైన చంద్రన్‌పై వైసీపీ నాయకుడు ఈశ్వరరెడ్డి విచక్షణా రహితంగా దాడి చేశాడని ఆరోపించారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి అనుచరుడే ఈశ్వర్‌రెడ్డి అని లోకేశ్ చెప్పుకొచ్చారు. బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని లోకేశ్ తప్పు పట్టారు.
ఆంధ్రప్రదేశ్‌లో లా అండ్ ఆర్డర్ వైసీపీ చేతిలో ఉందన్నారు. పోలీసులు వైసీపీకి వత్తాసు పలకడం ఇకనైనా మానుకోవాలని ఆయన హితవు పలికారు. దళితుడిపై దాడి చేసిన ఈశ్వర్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దళితులపై, మహిళలపై టీడీపీ హయాంలో దాడులు జరిగితే చంద్రబాబు పంచాయతీలు చేసి, కేసులు నమోదు చేయలేదని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
తమ ప్రభుత్వం ఆ విధంగా చేయడం లేదన్నారు. ఒకవేళ లోకేశ్ ఆరోపణల్లో నిజం వుంటే పోలీసులు తప్పకుండా చర్యలు తీసుకుంటారని వైసీపీ నేతలు చెబుతున్నారు.