ఆలూ లేదు …చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం

ఆలూ లేదు …చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అనే సామెత/జాతీయం చాలా పాపులర్. కొందరైనా దీన్ని ఎప్పుడో ఒకప్పుడు విని ఉంటారు. పని పూర్తి కాకుండానే అయినట్లుగా చెప్పుకోవడమన్నమాట. ఇప్పుడు తెలంగాణా సీఎం…

ఆలూ లేదు …చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అనే సామెత/జాతీయం చాలా పాపులర్. కొందరైనా దీన్ని ఎప్పుడో ఒకప్పుడు విని ఉంటారు. పని పూర్తి కాకుండానే అయినట్లుగా చెప్పుకోవడమన్నమాట. ఇప్పుడు తెలంగాణా సీఎం కేసీఆర్ విషయం అలాగే ఉంది. ఈ సామెత మాదిరిగానే టీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నారు. మరి వారు అలా సొంతంగా వ్యవహరిస్తున్నారో, అధినాయకత్వం అలా ఆదేశాలు ఇచ్చిందో తెలియదు.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే …కాబోయే ప్రధానమంత్రి కేసీఆర్ అంటూ టీఆర్ఎస్ నాయకులు ఓ ప్రచార కార్యక్రమం మొదలు పెట్టారు. కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. అదే టైపులో కాబోయే ప్రధాని కేసీఆర్ అంటూ టీఆర్ఎస్ శ్రేణులు (నాయకులు, కార్యకర్తలు) జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం ఎక్కడ సాగుతున్నదయ్యా అంటే తెలంగాణా సరిహద్దు రాష్ట్రాల్లో సాగుతోంది. 

మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్ ఘడ్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణాకు సరిహద్దు రాష్ట్రాలు. తెలంగాణాకు దగ్గరగా ఉన్న ఆయా రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కేసీఆర్ కాబోయే ప్రధాని అంటూ ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రచారం సాగుతోంది. తెలంగాణలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు అంటే రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, వ్యవసాయానికి ఇరవైనాలుగు గంటల కరెంటు సరఫరా, కేసీఆర్ కిట్స్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ …ఇలాంటి పథకాల గురించి సరిహద్దుల్లోని గ్రామాల ప్రజలకు వివరిస్తున్నారు.

ఈ పథకాల వల్ల తెలంగాణా ప్రజలు ఎంతో ప్రయోజనం పొందుతున్నారని, లాభపడుతున్నారని, ఆయన ప్రధాని అయితే ఈ పథకాలు దేశమంతా అమలు చేస్తారని చెబుతున్నారు. పల్లెప్రగతి కార్యక్రమం గురించి గొప్పగా చెబుతున్నారు. ఇలా ప్రచారం చేయడానికి టీఆర్ఎస్ సరిహద్దు గ్రామాలకు ప్రత్యేక బృందాలను పంపినట్లు సమాచారం. ఇలా పథకాల గురించి ప్రచారం చేసినందువల్ల ఆయా రాష్ట్రాల్లో ప్రజలు వీటి గురించి చర్చించుకునే అవకాశం ఉందంటున్నారు. 

కేసీఆర్ ప్రధాని కావడానికి ఈ పథకాలపై ప్రచారం ఎలా ఉపయోగపడుతుందో అర్ధం కావడంలేదు. తెలంగాణా మంత్రులు దాదాపు ప్రతిరోజూ సంక్షేమ పథకాల గురించి చెబుతూనే ఉంటారు. వారి శాఖలకు సంబంధించిన పనులు ఎలా చేస్తున్నారో తెలియదుగానీ పథకాల గురించి గొప్పగా చెప్పడం, కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తడం మంత్రుల విధుల్లో ఒక భాగం. ఈ పరిస్థితి ప్రతి రాష్ట్రంలో ఉంది. కేంద్ర ప్రభుత్వంలోనూ ఉంది.

తెలంగాణా సరిహద్దుల్లో ఉన్న ఇతర రాష్ట్రాల గ్రామాల వారు తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేసినట్లు ఇదివరకు వార్తలు వచ్చాయి. ఈ విషయం కూడా మంత్రులు చాలాసార్లు చెప్పారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయడం లేదని చెబుతూవుంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు.

అలా అనుకుంటే తెలంగాణను మించిన సంక్షేమ పథకాలు ఏపీలో జగన్ అమలు చేస్తున్నాడు. అయినప్పటికీ ఆంధ్రాలోని కొన్ని ప్రాంతాల్లో కేసీఆర్ మీద ప్రశంసలు కురుస్తుంటాయి. జగన్ పేరు తెలంగాణలో ఎవరూ చెప్పుకోరు. బీజేపీకి వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయాలని కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారుగానీ ఆయన ప్రధాని కావడం అంత సులభం కాదు. ఆ పదవి కోసం ఎదురుచూస్తున్న మోడీ వ్యతిరేకులు చాలామంది ఉన్నారు.