ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చుట్టూ ముళ్ల కంచెలా ఓ కోటరీ ఉందని సొంత పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణం రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇసుక సమస్యపై ఓ చానల్‌లో జరిగిన చర్చలో భాగంగా రఘురామకృష్ణంరాజు ఫోన్‌లో మాట్లాడుతూ జగన్ సర్కార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా ఏపీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలపై తనదైన శైలిలో ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు.
ఆ పరంపరలో భాగంగా రఘురామకృష్ణంరాజు సొంత ప్రభుత్వంపై విమర్శల డోస్ పెంచారు. ఇటీవల తనకు ఓ ప్రముఖ డాక్టర్ ఫోన్ చేసి సాయం అడిగారన్నారు. తనను నువ్వు అని పిలిచేంత చనువున్న ప్రముఖ డాక్టర్ అని చెప్పుకొచ్చారు. పనేంటో చెబితే చేసి పెడతానని ఆయనకు చెప్పానన్నారు. ఆ డాక్టర్ తనను ఓ లారీ ఇసుక పంపాలని అడిగారని ఎంపీ చెప్పుకొచ్చారు. అప్పుడు తాను ఆశ్చర్యానికి లోనయ్యానన్నారు.
అంత పెద్దాయన తనను ఇసుక అడిగారని, తలచుకుంటే ఆత్మన్యూనత భావన వచ్చిందని, చివరికి లారీ ఇసుక కూడా ఇవ్వలేకపోయినట్టు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు చెబుతూ పరోక్షంగా జగన్ పాలనలోని ఇసుక పాలసీ డొల్లతనాన్ని ఎత్తి చూపారు. లారీ ఇసుక ఇవ్వలేకపోయారా అని యాంకర్ రెట్టిస్తూ ప్రశ్నించగా… ఇవ్వలేక పోయానని తెగేసి చెప్పారు. వైఎస్సార్ హయాంలో యూనిట్ ఇసుక రూ.500 ఉందని, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో కొంచెం పెరిగిందని, చంద్రబాబు పాలనలో ఆ ధర కాస్తా రూ.2 వేలకు చేరుకుందన్నారు. దీంతో బాబు పాలనలో అందరూ గగ్గోలు పెట్టారన్నారు.
తర్వాత అధికారంలోకి వచ్చిన తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇసుక పాలసీలో సంస్కరణలు తీసుకురావాలని అనుకున్నారన్నారు. వరదలు రావడంతో మొదట్లో ఇసుక ఇవ్వడంలో కొంచెం ఇబ్బంది తలెత్తిన మాట నిజమేనన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి సమస్యను తీసుకెళ్లాలని అనుకున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా లేఖ రాద్ధామను కుంటున్నట్టు రఘురామకృష్ణంరాజు తెలిపారు.
ఏది ఏమైనప్పటికీ తమ ప్రభుత్వానికి వచ్చే వెయ్యి కోట్ల ఆదాయం కోసం ఇంత చెడ్డపేరు రావడం బాగా లేదన్నారు. ఇన్ని అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ తాము ఇసుక విషయంలో చెడ్డపేరు తెచ్చుకుంటున్నామన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే…
“మా ముఖ్యమంత్రి గారికి నేను మనస్సాక్షిగా చెబుతున్నా. ఇసుక విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. ఇసుక కోసం ప్రజలు ఇంత కష్టపడుతున్నారని ముఖ్యమంత్రికి తెలియదనే భావిస్తున్నాను. తెలిస్తే ఆయన తక్షణం చర్యలు తీసుకుంటారు. మీడియా ముఖంగా మా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకునేది ఏంటంటే అయ్యా మనకు తెలిసి ఎంత మంచి పనులు చేసినా, మనకు తెలియక చేసే ఇలాంటి తప్పుల వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందని బాధ్యత గల వైసీపీ ఎంపీగా , బాధ్యత గల ప్రజా ప్రతినిధిగా మీ దృష్టికి తీసుకొస్తున్నా. ప్రజా సంక్షేమం కోసం శ్రమిస్తూ ఎన్నో వేల కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు పెడుతూ ఇలాంటి సింపుల్ విషయంలో మనం వెంటనే చర్యలు తీసుకోకపోతే ఇబ్బందే. ఆర్థిక సమస్యలతో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయక పోయినా ఫర్వాలేదు. కానీ ఇది మటుకు మనం చేసి తీరాలని చెప్పి మీడియా ద్వారా ముఖ్యమంత్రికి విన్నవించుకుంటున్నా” అని తనదైన శైలిలో ఎంపీ చెప్పుకెళ్లారు.
ఇదే సమయంలో యాంకర్ జోక్యం చేసుకుంటూ, అయితే ముఖ్యమంత్రి గారికి తెలియదంటారా అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నపై రఘురామకృష్ణంరాజు స్పందిస్తూ….
“నూటికి నూరుపాళ్లు ఈ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్లదు. ఎందుకంటే ముఖ్యమంత్రి చుట్టూ ఓ కోటరీ ఉంటుంది. ఆయన దృష్టికి తీసుకురారు. ముఖ్యమంత్రి మల్లెపువ్వు లాంటివారు. ఆయన చుట్టూ ఉండే ముళ్ల కంచెను దాటుకుని మల్లె పువ్వు లాంటి సీఎం గారి దగ్గరికి చాలా మంది వెళ్లలేకున్నారు. అందుకే నేను డైరెక్ట్‌గా సీఎంకు ఉత్తరం రాధ్దామనుకున్నాను. ప్రజాగ్రహానికి గురికావద్దు. ఇసుక విషయంలో మనం చిన్న సరద్దుబాటు చేసుకుంటే సరిపోతుంది. వైఎస్ హయాంలో ఏ పాలసీ ఉందో అదే తీసుకొస్తే సరిపోతుంది” అని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు రఘురామకృష్ణంరాజు చెప్పారు. మరి సొంత పార్టీ విమర్శలపై వైసీపీ సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.