తిరుపతి బైపోల్: వైసీపీ ప్రచారం మొదలైంది

తిరుపతి ఉప ఎన్నికల అభ్యర్థిని ప్రకటించి టీడీపీ అందరి కంటే ముందుగా హడావిడి చేసింది. జనసేనాని రైతుల పేరుతో యాత్ర చేపట్టి తిరుపతిలో పరిస్థితి అంచనా వేసి వెళ్లారు. ఇక బీజేపీ వరుస మీటింగ్…

తిరుపతి ఉప ఎన్నికల అభ్యర్థిని ప్రకటించి టీడీపీ అందరి కంటే ముందుగా హడావిడి చేసింది. జనసేనాని రైతుల పేరుతో యాత్ర చేపట్టి తిరుపతిలో పరిస్థితి అంచనా వేసి వెళ్లారు. ఇక బీజేపీ వరుస మీటింగ్ లతో చేసిన అతి అంతా ఇంతా కాదు.

రాగా పోగా… తిరుపతి ఉప ఎన్నికల అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకుండా వైసీపీనే కాస్త వెనకపడిందని అనుకున్నారంతా. కానీ ప్రచార పర్వంలో మాత్రం వైసీపీ ఓ అడుగు ముందుకేసింది.

తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోకి వచ్చే సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభను ఇందుకు వేదికగా చేసుకుంది. మొత్తం ఐదురుగు మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరై.. తిరుపతి ఉప ఎన్నికల ప్రచార నగారా మోగించారు.

ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసులరెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ సహా, స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సచివాలయాల ప్రారంభోత్సవం అన్నది పేరుకు మాత్రమే, తిరుపతి ఉప ఎన్నికల ప్రచార నగారా అనేది అసలు విషయంగా మారింది. దివంగత నేత, బల్లి దుర్గా ప్రసాద్ తనయుడితోటే ఈ ప్రచార ఉపన్యాసం చేయించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

తమ కుటుంబానికి సీఎం జగన్ టికెట్ ఇవ్వలేదని జరుగుతున్న దుష్ప్రచారాన్ని దుర్గా ప్రసాద్ తనయుడు కల్యాణ్ చక్రవర్తి ఖండించారు. జగన్ తమకు ఏం చేశారనేది తమ కుటుంబానికి మాత్రమే తెలుసని అన్నారాయన.

తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి ఈసారి మరింత భారీ మెజార్టీ ఇప్పించాలని కోరారు. జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే తిరుపతిలో వైసీపి అభ్యర్ధిని గెలిపిస్తాయని చెప్పారు.

ఇక అభ్యర్థి పేరెత్తకుండానే మంత్రులందరూ తిరుపతి ఉప ఎన్నికల గురించి మాట్లాడటం కొసమెరుపు. గతంలో కంటే మంచి మెజార్టీ వచ్చేట్టు చూడాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

తిరుపతి సెగ్మెంట్ లోకి వచ్చే అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. దుర్గా ప్రసాదరావు కొడుక్కి టికెట్ ఇస్తే సెంటిమెంట్ బలంగా పండే అవకాశం ఉన్నా కూడా జగన్ బయట వ్యక్తికి టికెట్ ఇచ్చేందుకు సాహసించారు.

ఈ నేపథ్యంలో ప్రచార పర్వాన్ని ప్రారంభించేందుకు ఏకంగా ఐదుగురు మంత్రులు తరలి రావడాన్ని చూస్తే.. వైసీపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మతంగా తీసుకుందనే విషయం అర్థమవుతుంది.

ఎన్నికల షెడ్యూల్ వచ్చాక వైసీపీ ప్రచార పర్వం మరింత జోరందుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తిరుపతి ఎంపీ అభ్యర్థిని వైసీపీ అధికారికంగా ప్రకటించడమే మిగిలుంది.

అభిజిత్ చాలా కేరింగ్ పర్సన్