వైసీపీ, టీడీపీ మౌనం …బీజేపీలో అస‌హ‌నం

తెలంగాణ‌లో దుబ్బాక ఉప ఎన్నిక‌, గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో బీజేపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి తాను అనుకున్న ఫ‌లితాల‌ను ద‌క్కించుకొంది. అదే స్ట్రాట‌జీని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అమ‌లు చేయాల‌ని వ్యూహ ర‌చ‌న చేసినా …అక్క‌డి ప్ర‌త్య‌ర్థి పార్టీలు ,…

తెలంగాణ‌లో దుబ్బాక ఉప ఎన్నిక‌, గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో బీజేపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి తాను అనుకున్న ఫ‌లితాల‌ను ద‌క్కించుకొంది. అదే స్ట్రాట‌జీని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అమ‌లు చేయాల‌ని వ్యూహ ర‌చ‌న చేసినా …అక్క‌డి ప్ర‌త్య‌ర్థి పార్టీలు , ఎత్తుకు పైఎత్తులు వేయడంతో బీజేపీ ఆట‌లు సాగ‌డం లేదు. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను రెచ్చ‌గొడుతూ మాట్లాడ్డం, అటు వైపు నుంచి అదే స్థాయిలో రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు రావ‌డం ద్వారా ప్ర‌జ‌ల అటెన్ష‌న్‌ను త‌మ వైపు తిప్పుకోవ‌డం బీజేపీ ప్ర‌ధాన వ్యూహం.

ఇటీవ‌ల తెలంగాణ‌లో జ‌రిగిన ఉప ఎన్నిక‌తో పాటు గ్రేట‌ర్ హైద‌రాబాద్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఆ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ నేతృత్వంలో రెచ్చ‌గొట్టే వ్యూహాన్ని ప‌క‌డ్బందీగా అమ‌లు చేశారు. బీజేపీ ట్రాప్‌లో అధికార పార్టీ టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌తో పాటు మీడియా కూడా ప‌డింది. దీంతో బీజేపీ ప‌ని సులువైంది.

కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీ ఎంత‌గా రెచ్చ‌గొడుతున్నా రెచ్చిపోవ‌డానికి ప్ర‌త్య‌ర్థి పార్టీలైన వైసీపీ, టీడీపీ సిద్ధంగా లేవు. ఇందుకు కార‌ణాలు ఏవైనా కావ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు గ‌త రెండు రోజులుగా తిరుప‌తి కేంద్రంగా వైసీపీ, టీడీపీల‌పై బీజేపీ ఘాటైన విమ‌ర్శ‌లు చేసింది. కానీ బీజేపీ విమ‌ర్శ‌ల‌కు వైసీపీ, టీడీపీ నుంచి ఎలాంటి స్పంద‌నా లేదు. దీంతో బీజేపీలో అంత‌కంత‌కూ అస‌హ‌నంగా పెరుగుతోంది. 

తమ‌ను తిట్టండ్రా బాబూ అని వేడుకుంటున్నా, ఆశ దోసె అప్ప‌డం అన్న‌ట్టు వైసీపీ, టీడీపీలు చాలా తెలివిగా మౌనాన్ని పాటిస్తున్నాయి. తిరుప‌తి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక‌ను దృష్టిలో పెట్టుకుని బీజేపీ స‌మ‌రోత్సాహాన్ని ప్ర‌ద‌ర్శిస్తోంది. ఇందులో భాగంగా శ‌నివారం, ఆదివారాల్లో బీజేపీ అగ్ర‌నేత‌లు ఏం మాట్లాడారో చూద్దాం.

“గ‌త ప్ర‌భుత్వాలు 60 ఏళ్ల‌లో రూ.ల‌క్ష కోట్ల అప్పులు చూపిస్తే …. వైసీపీ స‌ర్కార్ మొద‌టి ఆరు నెల‌ల్లోనే రూ.55 వేల కోట్లు అప్పులు చేసింది. అక్ర‌మ‌, అనైతిక విధానాల‌ను ప్రోత్స‌హించ‌డంతో రాష్ట్రాభివృద్ధి పూర్తిగా కుంటుప‌డింది. పారిశ్రామిక‌వేత్త‌లు పారిపోయేలా ఏపీ ప్ర‌భుత్వం చేస్తోంది. కేంద్రం నిధులు సాయం చేస్తుంటే జ‌గ‌న్ త‌న‌పేరు పెట్టుకుని మాయ చేస్తున్నారు. ఇళ్ల స్థ‌లాల కోసం భూసేక‌ర‌ణకు ఖ‌ర్చు చేసిన రూ.7 వేల కోట్ల‌లో రూ.3 వేల కోట్ల అవినీతి జ‌రిగింది”

“టీడీపీ, వైసీపీ మ‌త‌త‌త్వ రాజ‌కీయాలు చేస్తున్నాయి. టీడీపీ హ‌యాంలో ఎన్నో దేవాల‌యాలు ప‌డ‌గొట్టారు. ఇప్పుడు వైసీపీ హ‌యాంలో దేవాల‌యాల‌తో పాటు దేవీదేవ‌త‌ల విగ్ర‌హాలపై దాడులు జ‌రుగుతున్నా ఏమీ తెలియ‌న‌ట్టు ఉంటున్నారు. అధికారంలో ఉండగా విజయవాడలో 40 ఆలయాలకు పైగా కూల్చేసిన దుర్మార్గుడు చంద్రబాబు. 

మత రాజకీయాలు నెరిపే చంద్రబాబు నిద్రలేచినప్పుడల్లా నేను హిందువునని ప్రకటించుకునే ప్రయత్నం చేస్తుంటారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి సొంత జిల్లాను అభివృద్ధి చేయలేని అసమర్థుడు. తెలంగాణలో ఒక సర్జికల్‌ స్ట్రైక్‌ కావాల్సి వస్తే ఏపీలో రెండు నిర్వహించాల్సిన అవసరం ఉంది”

గ‌త 60 ఏళ్ల‌లో బీజేపీ ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించింది. అలాగే 1983లో టీడీపీ ఆవిర్భ‌వించ‌నంత వ‌ర‌కూ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ పాల‌నే సాగింది. త‌క్కువ అప్పులు చేశార‌ని బీజేపీ నేత‌లు చెప్ప‌డం ద్వారా కాంగ్రెస్ పాల‌న బాగుంద‌ని స‌ర్టిఫికెట్ ఇచ్చిన‌ట్టే. స‌హ‌జంగా బీజేపీని టార్గెట్ చేయాల‌నుకుంటే ప్ర‌త్య‌ర్థి పార్టీలు ఈ ప్ర‌శ్న‌ల‌ను సంధించేవి. 

అలాగే పారిశ్రామిక వేత్త‌లు ఎక్క‌డికి పారిపోయారో చెప్పాల‌ని వైసీపీ నేత‌లు ప్ర‌శ్నించాలి. ఆ ప‌ని చేయ‌లేదు. ఇళ్ల స్థ‌లాల భూసేక‌ర‌ణలో అవినీతి ఎక్క‌డ జ‌రిగిందో నిరూపించాల‌ని అధికార పార్టీ వైసీపీ నిల‌దీయడానికి బ‌దులు మౌనంగా ఉండ‌డంతో, బీజేపీని లైట్‌గా తీసుకున్న‌ట్టైంది. ఇదే బీజేపీకి అస‌లు న‌చ్చ‌డం లేదు.

అలాగే టీడీపీ, వైసీపీ మ‌త‌త‌త్వ రాజ‌కీయాలు చేస్తోంద‌ని బీజేపీ విమ‌ర్శించ‌డం అంటే ఈ శ‌తాబ్దంలోనే అతిపెద్ద జోక్‌గా చెప్పు కోవ‌చ్చు. బీజేపీ నేత‌ల నుంచి వ‌చ్చే ఇలాంటి విమ‌ర్శ‌ల‌ను వింటూ ఆ రెండు పార్టీలు న‌వ్వుకుంటున్నాయే త‌ప్ప‌, ఇవేం ఆరోప ణ‌ల‌ని ప్ర‌శ్నించ‌లేదు. 

పైగా టీడీపీతో క‌లిసి బీజేపీ దాదాపు నాలుగేళ్లు అధికారాన్ని కూడా పంచుకుని …. ఇప్పుడు త‌గ‌దు న‌మ్మానంటూ గ‌త పాల‌న‌లో దేవాల‌యాలు ప‌డ‌గొట్టార‌ని విమ‌ర్శించ‌డం ఆ పార్టీకే చెల్లింది. స‌ర్జిక‌ల్ స్ట్రైక్ కామెంట్ తెలంగాణ‌లో ఉంత దుమారం రేపిందో తెలిసిందే. కానీ అదే మాటను ఏపీలో ప‌ట్టించుకునే నాథులే లేరు.

బీజేపీ విమ‌ర్శ‌లకు ఎలాంటి స‌మాధానం ఇవ్వ‌కూడ‌ద‌ని ఇప్ప‌టికే చంద్ర‌బాబునాయుడు టీడీపీ నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేశార‌ని స‌మాచారం. ఇదే ర‌క‌మైన అభిప్రాయంతో వైసీపీ నేత‌లు కూడా ఉన్నారు. పాల‌క ప్ర‌తిప‌క్ష పార్టీలు రెచ్చిపోయి బీజేపీని బ‌ల‌ప‌ర‌చ‌డానికి సిద్ధంగా లేవు. బీజేపీ విమ‌ర్శ‌ల‌కు స‌మాధానం ఇవ్వ‌డం ద్వారా అన‌స‌వ‌రంగా ఆ పార్టీకి విలువ ఇచ్చిన‌ట్ట‌వు తుంద‌నేది బీజేపీ ప్ర‌త్య‌ర్థుల భావ‌న‌. 

అంతేకాకుండా ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌కు అవ‌కాశం క‌ల్పించ‌డం ద్వారా బీజేపీ బ‌లోపేతానికి ఆస్కారం ఇచ్చిన‌ట్టు అవుతుంద‌నే ఆలోచ‌న‌లో  వైసీపీ, టీడీపీ ఉన్న‌ట్టు తెలుస్తోంది. అందువ‌ల్లే టీడీపీ, వైసీపీ వ్యూహాత్మ‌కంగా మౌనం పాటించాయి. ప్ర‌త్య‌ర్థి పార్టీల మౌనం బీజేపీలో అస‌హ‌నం క‌లిగిస్తోంది. మొత్తానికి బీజేపీ స‌హ‌నానికి వైసీపీ, టీడీపీ ప‌రీక్ష పెట్టాయ‌ని చెప్పొచ్చు. 

అటూ ఇటూ ఎటూ కాలేక!