‘‘కరోనా వైరస్’కి మందు కనుగొనగలేమోగానీ, ‘పచ్చ కరోనా’ అనే వైరస్‌కి మందు కనుగొనలేం..’’ అని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ మధ్య పదే పదే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘కరోనా వైరస్’ రాజకీయ వ్యాఖ్యలకు కొత్త గ్లామర్ తెచ్చిందా.? అన్నది వేరే చర్చ. ఇక్కడ, అధికార పార్టీ నేతల వాదనల్లో వాస్తవం వుంది. ఎందుకంటే, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ తీరు అలా వుంది మరి.!
టీడీపీ అధినేత చంద్రబాబు హైద్రాబాద్‌లో కూర్చుని, వీలు చిక్కినప్పుడల్లా ఏదో ఒక స్టేట్‌మెంట్ ఇచ్చేస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత గురించి. వైద్య పరీక్షలు ఎక్కువగా చేయించాలనీ, వాస్తవాలు దాచకూడదనీ చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు నవ్వులపాలవుతున్నాయి. ఇందులో దాపరికం ఏమీ లేదు. ‘కరోనా వైరస్’ దాచుకునే జబ్బు కూడా కాదు. వస్తే, ప్రాణం పోతుందేమోనన్న భయం అందరిలోనూ వుంది. దాచుకోవడానికి పెద్దగా ఎవరూ ప్రయత్నించని రోగమిది.
ఇక, కరోనా పాజిటివ్ కేసుల విషయానికొస్తే, ఎప్పటికప్పుడు సమాచారం ఆన్‌లైన్‌లో లభ్యమవుతోంది. కేంద్రమే దాదాపుగా ప్రతి రోజూ కేసుల వివరాల్ని వెల్లడిస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న చంద్రబాబు, ఈ మాత్రం ఇంగితం కూడా లేకుండా ఎలా మాట్లాడుతున్నారో ఏమో అర్థం కాక తెలుగు తమ్ముళ్ళే తలపట్టుకోవాల్సిన పరిస్థితి.
మరోపక్క, చంద్రబాబు బాటలోనే కొందరు టీడీపీ నేతలు పయనిస్తున్నారు. కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చిన వేళ, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో వుంది. నిజానికి ఇది రాజకీయాలు చేసే సమయం అస్సలేమాత్రం కాదు. కానీ, రైతుల సమస్యలంటూ టీడీపీ నేత నిమ్మల రామానాయుడు ‘సైకిల్ యాత్ర’ చేపట్టారు. పోలీసులు, ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకున్నారు. ‘ఎమ్మెల్యేగా నాకు ఆ హక్కు వుంది’ అంటారు రామానాయుడు కామెడీగా.
దేశవ్యాప్త లాక్ డౌన్ అమల్లో వుంటే, ఇక్కడ ‘హక్కుల ప్రస్తావన’ ఎలా వుంటుంది.? పైగా, ‘ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమవ్వండి..’ అని అటు కేంద్రం, ఇటు రాష్ట్రం ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంటే, ప్రజా ప్రతినిథులు బాధ్యతగా వ్యవహరించకపోవడమేంటి.? ఇవే మరి ‘పచ్చ’ రాజకీయాలంటే. అందుకే అధికార పార్టీ నేతలు ‘పచ్చ కరోనా’ అంటూ అధికార పార్టీపై మండిపడుతున్నది.