ప‌సుపు పారాణి ఆర‌క‌నే… ఏడుగురు జంప్‌!

విలువ‌లు, విశ్వ‌స‌నీయ‌త అనేవి కేవ‌లం చెప్పుకోడానికి విన‌సొంపుగా ఉంటాయి. వీటిని పాటించే రాజ‌కీయ పార్టీలు క‌రువ‌య్యాయి. గ‌తంలో పాలించిన టీడీపీ, ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ…. పార్టీల ఫిరాయింపుల్లో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు దొందు దొందే…

విలువ‌లు, విశ్వ‌స‌నీయ‌త అనేవి కేవ‌లం చెప్పుకోడానికి విన‌సొంపుగా ఉంటాయి. వీటిని పాటించే రాజ‌కీయ పార్టీలు క‌రువ‌య్యాయి. గ‌తంలో పాలించిన టీడీపీ, ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ…. పార్టీల ఫిరాయింపుల్లో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు దొందు దొందే అని చెప్ప‌క త‌ప్ప‌దు. టీడీపీ దుమ్ము అయితే, వైసీపీ మ‌న్ను. అంతే తేడా. ప్ర‌త్య‌ర్థుల‌ను దెబ్బ తీయాల‌నే క్ర‌మంలో ప్ర‌జావ్య‌తిరేక‌తను పెంచుకుంటున్నామ‌న్న వాస్త‌వాన్ని రాజ‌కీయ పార్టీలు మ‌రుగున ప‌రుస్తున్నాయి.

తాజాగా విశాఖ ప‌ట్నం గ్రేట‌ర్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో ఏడుగురు టీడీపీ కార్పొరేట‌ర్లు గెలిచి క‌నీసం వారం కూడా తిర‌గ‌కుండానే ప‌చ్చ కండువాలు మార్చ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. విశాఖ‌ప‌ట్నం గాజువాక ప్రాంతంలో మొత్తం 8 మంది టీడీపీ కార్పొరేట‌ర్లు గెలుపొందారు. వీరిలో ఏడుగురు కార్పొరేట‌ర్లు ఆ ప్రాంత ఎమ్మెల్యే నాగిరెడ్డిని క‌లిసి అన‌ధికారికంగా పార్టీ ఫిరాయించ‌డం గ‌మ‌నార్హం. క‌నీసం ప‌సుపు పారాణి ఆర‌క‌ముందే అధికార పార్టీ నీడ‌లోకి వెళ్ల‌డం విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది.

మొన్న‌టి గ్రేట‌ర్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ 58 సీట్ల‌ను ద‌క్కించుకుని మేయ‌ర్ స్థానాన్ని కైవ‌సం చేసుకుంది. టీడీపీ 30 సీట్ల‌కు ప‌రిమిత‌మైంది. ఈ నేప‌థ్యంలో ఏకంగా ఏడుగురు సీనియ‌ర్స్ పార్టీ ఫిరాయించ‌డంతో విశాఖ టీడీపీ అర్బ‌న్ జిల్లా త‌ర‌పున షోకాజ్ నోటీసులు  జారీ చేశారు. రెండు రోజుల్లో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆ నోటీసులో పేర్కొన్నారు.

ఇదిలా ఉండ‌గా గాజువాక‌లో మొత్తం 17 డివిజ‌న్లు ఉన్నాయి. వీటిలో వైసీపీ 7, టీడీపీ 7, టీడీపీ బ‌ల‌ప‌రిచిన సీపీఐ 1, సీపీఎం 1 స్థానంలో గెలుపొందాయి. మ‌రో చోట జ‌న‌సేన గెలుపొందింది. ఇక్క‌డ గాజువాక ఎమ్మెల్యే తిప్ప‌ల నాగిరెడ్డి కోడ‌లు ఓడిపోవ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో టీడీపీ త‌ర‌పున గెలుపొందిన కార్పొరేట‌ర్లంతా వైసీపీ పంచ‌న చేరిన‌ట్టైంది. అధికారం కోసం వ‌చ్చేవాళ్లు, అది ఉన్నంత కాలం పార్టీ వెంట ఉంటారు.

అధికారం లేక‌పోతే ఒక్క క్ష‌ణం కూడా పార్టీ వెంట న‌డ‌వ‌ర‌నే వాస్త‌వం అంద‌రికీ తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నాయ‌కులు చేరినంత మాత్రాన ప్ర‌జాభిప్రాయాన్ని కూడా త‌మ వైపు తిప్పుకోగ‌ల‌మ‌ని గాజువాక ఎమ్మెల్యే భావిస్తున్నారా? అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. 

గ‌తంలో టీడీపీ ఎలాంటి త‌ప్పు చేసిందో, ఇప్పుడు వైసీపీ కూడా అదే బాట‌లో న‌డుస్తుంద‌నేందుకు ఇదే నిద‌ర్శ‌నం. అయినా ఏమీ తెలియ‌ని వాళ్ల‌కు మంచీచెడుల గురించి చెప్పొచ్చు. అన్నీ తెలిసిన వాళ్ల‌కు ఏమ‌ని చెబుతారు?  మొత్తానికి టీడీపీ, వైసీపీ దొందు దొందే అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.