ఆ దేశం సంతోష గ‌ని

మ‌నిషి ఏం చేసినా సంతోషం కోస‌మే. జీవితాన్ని  మ‌లుచుకునే దాన్ని బ‌ట్టి సుఖ‌దుఃఖాలు క‌లుగుతాయి. అయితే ఏ మ‌నిషీ క‌ష్ట‌ప‌డాల‌ని, ఏడ్చుతూ బ‌త‌కాల‌ని కోరుకోడు. అనుకున్న‌ట్టు జ‌ర‌గ‌క‌పోవ‌డ‌మే జీవిత‌మ‌ని మ‌న పెద్ద‌లు చ‌క్క‌టి నిర్వ‌చ‌నం…

మ‌నిషి ఏం చేసినా సంతోషం కోస‌మే. జీవితాన్ని  మ‌లుచుకునే దాన్ని బ‌ట్టి సుఖ‌దుఃఖాలు క‌లుగుతాయి. అయితే ఏ మ‌నిషీ క‌ష్ట‌ప‌డాల‌ని, ఏడ్చుతూ బ‌త‌కాల‌ని కోరుకోడు. అనుకున్న‌ట్టు జ‌ర‌గ‌క‌పోవ‌డ‌మే జీవిత‌మ‌ని మ‌న పెద్ద‌లు చ‌క్క‌టి నిర్వ‌చ‌నం చెప్పారు. అయితే మ‌నిషి స‌హజంగా సుఖాన్వేషి కావ‌డంతో… అందుకోసం ప్ర‌పంచ వ్యాప్తంగా వెతుకుతూ ఉంటాడు.

సుఖప్ర‌ద‌మైన జీవితాన్ని సాగించాల‌ని అనుకుంటే మాత్రం ఫిన్లాండ్ అనే దేశానికి వెళ్లాల్సిందే. ప్ర‌పంచంలోనే అత్యంత సంతోష‌క‌ర దేశాల్లో ఫిన్లాండ్ మొద‌టి స్థానాన్ని ద‌క్కించుకుంది. శ‌నివారం అంత‌ర్జాతీయ ఆనంద దినాన్ని పుర‌స్క‌రించుకుని ప్ర‌పంచ ఆనంద నివేదిక  -2021ను ఐక్య‌రాజ్య స‌మితి విడుద‌ల చేసింది. ఫిన్లాండ్ త‌ర్వాత ఐస్‌లాండ్‌, డెన్మార్క్‌, స్విట్జ‌ర్లాండ్‌, నెద‌ర్లాండ్స్ ద‌క్కించుకున్నాయి.

2012 నుంచి ఐక్య‌రాజ్య స‌మితికి చెందిన  స‌స్టెయిన‌బుల్ డెవ‌ల‌ప్‌మెంట్ సొల్యూష‌న్స్ నెట్‌వ‌ర్క్ ప్ర‌తి ఏడాది ప్ర‌పంచ ఆనంద నివేదిక‌ వెల్ల‌డిస్తోంది. 149 దేశాల్లోని ప‌రిస్థితుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని నివేదిక‌ను ప్ర‌క‌టిస్తోంది. 

ఇందులో భాగంగా తాజాగా వెల్ల‌డించిన నివేదిక‌లో మ‌న దేశానికి 139వ స్థానం ద‌క్క‌డం గ‌మ‌నార్హం. అయితే క‌రోనా కార‌ణంగా 100 దేశాల్లోనే అభిప్రాయాలు సేక‌రించారు. కానీ మిగిలిన దేశాల్లో ఇప్ప‌టికే చేప‌ట్టిన గాల‌ప్ వ‌ర‌ల్డ్ పోల్ డేటాను ఆధారం చేసుకుని తాజాగా ర్యాంకులు కేటాయించారు.

అగ్ర‌రాజ్యం అమెరికా 14వ స్థానంలో ఉంది. గ‌తంలో 18వ స్థానంలో ఉన్న అమెరికా నాలుగు స్థానాల‌ను మెరుగుప‌ర‌చుకోవ‌డం గ‌మ‌నార్హం. ఫిన్లాండ్‌లో ఒత్తిడి లేని విద్య‌, అలాగే ఇత‌ర‌త్రా అంశాలు చాలా ఆద‌ర్శంగా ఉన్న‌ట్టు గ‌త కొన్నేళ్లుగా వింటూ ఉన్నాం.  మంచి ఎక్క‌డున్నా స్వీక‌రించ‌డం ఉత్త‌మం. అదే ఆనందానికి హేతువు అని చెప్ప‌క త‌ప్ప‌దు.