తన జాతకం ఏంటో తెలుసుకోలేకపోయిన జ్యోతిష్కుడు

స్థానికంగా మంచి పేరున్న జ్యోతిష్కుడు అతడు. చాలామంది పెద్ద మనుషులు అతడి వద్దకొచ్చి జాతకం చెప్పించుకుంటారు. అయితే పనిలో పడి తన జాతకం చూసుకోలేదేమో… అడ్డంగా దొరికిపోయాడు అతడు. వైట్ కాలర్ మోసానికి చేజేతులా…

స్థానికంగా మంచి పేరున్న జ్యోతిష్కుడు అతడు. చాలామంది పెద్ద మనుషులు అతడి వద్దకొచ్చి జాతకం చెప్పించుకుంటారు. అయితే పనిలో పడి తన జాతకం చూసుకోలేదేమో… అడ్డంగా దొరికిపోయాడు అతడు. వైట్ కాలర్ మోసానికి చేజేతులా పాతిక లక్షలు పోగొట్టుకున్నాడు. హైదరాబాద్ నడిబొడ్డున జరిగింది ఈ ఘటన.

దేవీ శైలేంద్రనాథ్ అనే వ్యక్తి ఎస్ఆర్ నగర్ లో ఉంటున్నాడు. స్థానికంగా జ్యోతిష్కుడిగా పేరుతెచ్చుకున్నాడు. ఓ వ్యక్తి ఇతడి గురించి తెలుసుకున్నాడు. వచ్చి కలిశాడు. తనను తాను సుధాకర్ గా పరిచయం చేసుకున్నాడు. సీఎం కేసీఆర్ పీఏగా పరిచయం చేసుకున్నాడు. అటుఇటు ఇద్దరు గన్ మెన్లు కూడా ఉన్నారు. దీంతో శైలేంద్రనాథ్ నమ్మాడు.

మరింత నమ్మకం కుదుర్చుకోవడం కోసం పలుమార్లు జాతకం చూపించుకున్నాడు సుధాకర్. పనిలోపనిగా కూకట్ పల్లిలోని ప్రైమ్ లొకేషన్ లో గవర్నమెంట్ స్థలం ఉందని, అది ఇప్పించేలా చూస్తానని నమ్మబలికాడు. అక్కడ మంచి డివోషనల్ సెంటర్ తెరిస్తే గిరాకీ బాగుంటుందని ఊరించాడు.

సుధాకర్ మాటలు నమ్మి విడతలవారీగా 25 లక్షలు సమర్పించుకున్నాడు శైలేంద్రనాథ్. అయితే రెండేళ్లు గడుస్తున్నప్పటికీ చెప్పిన స్థలం మాత్రం చేతికిరాలేదు. ఏంటని ప్రశ్నిస్తే గన్ తో కాల్చి చంపేస్తానని బెదిరించాడు. దీంతో తను పూర్తిస్థాయిలో మోసపోయానని గ్రహించిన శైలేంద్రనాథ్, పోలీసుల్ని ఆశ్రయించాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు వచ్చిన వ్యక్తి సీఎం కేసీఆర్ పీఏ అవునా కాదా అనే కోణంలో ఎంక్వయిరీ మొదలుపెట్టారు.