వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను తిరిగి నిర్వహించేందుకు వివిధ రాజకీయ పక్షాల అభిప్రాయాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ బుధవారం తీసుకున్నారు. మొత్తం 19 పార్టీలకు ఆహ్వానాలు పంపగా 11 పార్టీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. అలాగే రెండు పార్టీల ప్రతినిధులు తమ అభిప్రాయాల్ని రాతపూర్వకంగా పంపగా, మరో ఆరు గైర్హాజరయ్యాయి.
ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డను కలిసిన అనంతరం కొన్ని పార్టీల నేతలు తమ అభిప్రా యాల్ని మీడియాతో పంచుకున్నారు. వీళ్ల మాటలు విన్న తర్వాత అవకాశం ఉంటే … మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరపాలని గట్టిగా డిమాండ్ చేసేలా ఉన్నాయి. అంతేకాదు, నిమ్మగడ్డ చేతిలో ఆ పవర్ ఉంటే …. వాళ్ల కోరిక నెరవేరేదే కాబోలు!
స్థానిక సంస్థల ఎన్నికలు జరిపితే ఒనగూరే ప్రయోజనాలేవీ లేవు. అదే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటితే అధికారాన్ని దక్కించు కుని తమ ఇష్టానుసారం పరిపాలించుకునే సువర్ణావకాశం దక్కుతుంది. ముఖ్యంగా ఏ మాత్రం అవకాశం ఉన్నా మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరపాలని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ, ఎన్నికల్లో పట్టుమని పది సీట్లలో కూడా పోటీచేయని సీపీఐ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రాంతీయ పార్టీ బీఎస్పీ డిమాండ్ చేసేలా ఉన్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మళ్లీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కోరినట్టు బీజేపీ, బీఎస్పీ ప్రతినిధులు మీడియాకు చెప్పారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి గతంలో పెద్ద సంఖ్యలో ఏకగ్రీవాలు జరిగాయని ఆరోపించారు. కావున తిరిగి మొదటి నుంచి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ, బీఎస్పీలు కోరాయి.
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అభిప్రాయం కూడా ఇదే విధంగా ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి వైసీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడ్డారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రత్యర్థులను బెదిరించి పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు చేసుకున్నారన్నారు. బెదిరింపులకు పాల్పడి చేసుకున్న ఏకగ్రీవాలన్నీ రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇవే ఆరోపణలే కదా టీడీపీ చేసింది.
ఇంకో జాతీయ పార్టీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తానేం తక్కువ తినలేదని నిరూపించుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని ఎస్ఈసీని కోరినట్టు రామకృష్ణ చెప్పారు. మార్చిలో నిర్వహించిన ఎన్నికలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వం, అధికారులు, పోలీసులు కుమ్మక్కై ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయన్నారు. వాటన్నింటిని రద్దు చేసి.. సమగ్ర దర్యాప్తు చేయాలని, కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని ఎస్ఈసీని కోరినట్లు రామకృష్ణ చెప్పారు. అసలు టీడీపీ, సీపీఐ వేర్వేరు పార్టీలని ఎస్ఈసీ ఎందుకు భావించారో అర్థం కాదు.
అసలు ఎన్నికల్లో పోటీ చేస్తారో, చేయరో కూడా తెలియని బీజేపీ, సీపీఐ, బీఎస్పీ కొత్త నోటిఫికేషన్ల కోసం డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉంది. ఈ పార్టీల డిమాండ్లను చూస్తే …. జగన్ సర్కార్‌పై అక్కసు తప్ప మరేమీ కనిపించదు. గత సార్వత్రిక ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన ఈ పార్టీలు కూడా మళ్లీ ఎన్నికలు కోరడాన్ని చూస్తే నవ్వు రాక మానదు.
అలాగే కరోనా లేని సమయంలో ఎన్నికలు వద్దే వద్దు అని డిమాండ్ చేసిన టీడీపీ …. ఇప్పుడు మాత్రం కావాలని కోరడం వెనుక ఉద్దేశం ఏమిటి? స్థానిక సంస్థల ఎన్నికలేం ఖర్మ …అసెంబ్లీ ఎన్నికలే మళ్లీ జరపాలని డిమాండ్ చేస్తే పోయేదేముంది! కమాన్ రేపటి నుంచి అదే నినాదంతో రాష్ట్రాన్ని హోరెత్తిస్తే అమరావతి రాజధానిని కాపాడుకునే గొప్ప అవకాశం దక్కుతుంది.