గడిచిన వీకెండ్ బిగ్ బాస్ లో సమంత సందడి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మామ స్థానంలోకి వచ్చిన అక్కినేని కోడలు.. బిగ్ బాస్ పై తనదైన ముద్ర వేసింది. నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ అందించి అదరగొట్టింది. సిసలైన దసరా సంబరాన్ని అందరికీ చూపించింది.
అంతా బాగానే ఉంది కానీ, రాబోయే వీకెండ్ పరిస్థితేంటి..? ఈ శని-ఆదివారాలు మరోసారి సమంత కనిపిస్తుందా? లేక నాగార్జునే వస్తాడా? చాలామందికి ఈ అనుమానం కలగడానికి ఓ రీజన్ ఉంది.
'వైల్డ్ డాగ్' షూట్ కోసం మనాలీ వెళ్లాడు నాగార్జున. అది ఒక వారంతో అయిపోయే షూట్ కాదు. 21 రోజుల పాటు అక్కడే ఉండాల్సి వస్తుందని స్వయంగా నాగార్జున చెప్పాడు. మరి అలాంటప్పుడు ఈ వారాంతం బిగ్ బాస్ షోకు నాగార్జున వస్తాడా లేక మరోసారి సమంతతోనే మేనేజ్ చేస్తారా అనేది అందరి డౌట్.
అయితే ఈ వీకెండ్ నాగార్జునే బిగ్ బాస్ వేదికపైకి రాబోతున్నాడు. గతవారం వాతావరణం అనుకూలించక, ఆఖరి నిమిషంలో సమంతను ప్రవేశపెట్టారట. ఈవారం మాత్రం నాగార్జునే ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చి, బిగ్ బాస్ షూట్ కంప్లీట్ చేసుకొని తిరిగి మనాలీ చేరుకుంటాడు.