ప్రేమోన్మాది జీవితం విషాదాంతమైంది. తన ప్రియురాలి ప్రాణాలు తీసిన 24 గంటల్లోపే తాను కూడా మృత్యు వును ఆశ్రయిం చాడు. నిన్న ప్రియురాలి హత్య, నేడు ప్రియుడి ఆత్మహత్య ఘటనలు తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్నాయి.
చిత్తూరు జిల్లా పెను మూరు మండలం తూర్పుపల్లెకు చెందిన జి.గాయత్రి (20) చిత్తూరులో, పూతలపట్టు మండలం చింతమాకులపల్లెకు చెందిన డిల్లీబాబు (19) పెనుమూరులో డిగ్రీ చదివే వారు. కళాశాలలకు పెనుమూరు రూట్లోనే వెళుతున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. ఇలా ఇద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
ఇద్దరివీ వేర్వేరు కులాలు. దీంతో తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరని భయపడ్డారు. గత నెలలో ఇంట్లో నుంచి పారిపోయి తిరుపతిలో ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తమ కుమార్తె కనిపించడం లేదని అమ్మాయి తండ్రి షణ్ముగరెడ్డి రెండునెలల క్రితం పెనుమూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ప్రేమికులిద్దర్నీ పోలీసులు పట్టుకొచ్చి కౌన్సెలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులతో వెళ్లేందుకు అమ్మాయి అంగీకరించడంతో , వారితో పంపారు. అప్పటి నుంచి ఇంట్లో నుంచి గాయత్రిని బయటికి పంపలేదు.
తనను ప్రేమించి , పెళ్లి చేసుకుని, ఆ తర్వాత తనను విడిచిపెట్టి తల్లిదండ్రుల వెంట వెళ్లడాన్ని డిల్లీబాబు జీర్ణించుకోలేక పోయాడు. తనకు దక్కని గాయత్రి బతికేందుకు వీల్లేదని మనసులో తీర్మానించుకున్నాడు.
ఈ నేపథ్యంలో బంధువుల వెంట సరుకుల కోసం పెనుమూరు వెళ్లిన గాయత్రిని డిల్లీబాబు కర్కశంగా పొడిచి చంపాడు. అనంతరం గాగమ్మవారిపల్లె సమీపంలో బైక్ను వదిలేసి అడవుల్లోకి పారిపోయాడు.
అనంతరం నిన్నరాత్రే చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఈ రోజు మధ్యాహ్నం తూర్పుపల్లి అడవిలో డిల్లీబాబు మృతదేహాన్ని గుర్తించారు. ఎంతో భవిష్యత్ ఉన్న యువతీయువకుల ప్రాణాలను ప్రేమ బలిగొంది.