కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో అక్కడక్కడ కొందరు అస్వస్థతకు గురి కావడం, వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో కొందరు చనిపోయినట్టుగా కూడా వార్తలు వస్తూ ఉండటం ఆందోళనకరంగా మారింది. వ్యాక్సిన్ ఇప్పుడిప్పుడే వినియోగంలోకి వస్తున్న నేపథ్యంలో.. ఈ తరహా సంఘటనలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తూ ఉంది.
విదేశాల్లోనూ ఇలాంటి సంఘటనలు నమోదు కావడంతో పాటు, ఇండియాలో కూడా అస్వస్థత కేసులు నమోదయ్యాయి. తాజాగా తెలంగాణలో వ్యాక్సిన్ తీసుకున్న ఒక అంబులెన్స్ డ్రైవర్ మరణించిన వార్త వ్యాక్సిన్ ను చర్చనీయాంశంగా మార్చింది.
ఇప్పటికే ఇండియాలో ఇలాంటి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఒక తెలుగు రాష్ట్రంలో కూడా ఈ తరహా ఘటన చోటు చేసుకోవడం విషాదకరం. అయితే ఆ వ్యక్తి మరణానికి కారణం వ్యాక్సినే అని ఎవ్వరూ చెప్పడం లేదు.
వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి అస్వస్థతకు లోనయ్యి చనిపోయినట్టుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆయన మరణానికి కారణం గుండెపోటు అని కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఆ వ్యక్తి అస్వస్థతకు లోనుకావడానికి కారణం వ్యాక్సినేనా? అనే అంశంపై పరిశోధన జరగాల్సి ఉంది. ఏదేమైనా వ్యాక్సిన్ తీసుకున్నదే చాలా పరిమిత సంఖ్యలోని వ్యక్తులు. వారిలో చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే అది మామూలే అనుకోవచ్చు.
ఎందుకంటే.. కొన్ని రకాల వ్యాక్సిన్లు వేసినప్పుడు చిన్నపాటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చిన్నపిల్లలకు వ్యాక్సిన్లు వేయించినప్పుడు డాక్టర్లు జ్వరం వస్తుంది.. కంగారు పడకండని చెబుతూ ఉంటారు.
అదే తరహాలో కరోనా వ్యాక్సిన్ వల్ల కూడా చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో. అయితే వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో కొందరు అనవసరమైన గాబరా పడటం వల్ల కూడా కొద్దిపాటి అస్వస్థత కలగవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. అవన్నీ ఒక ఎత్తు అయితే ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో అక్కడక్కడ కొంతమంది మరణించడం మాత్రం ఆందోళనకరమైన అంశమే.
అది పరిమిత సంఖ్యలో అయినా.. త్వరత్వరగా తయారు చేసిన వ్యాక్సిన్ కావడంతో.. ప్రజల్లో వ్యాక్సిన్లపై అనుమానాలు నెలకొనే అవకాశాలున్నాయి. వాటిని ప్రభుత్వాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది.