సీబీఐకి తానిచ్చిన వాంగ్మూలం, పత్రికల్లో ప్రచురితమైన అంశాలపై వైఎస్ కుటుంబ సభ్యుడు, వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి అయిన డాక్టర్ వైఎస్ అభిషేక్‌రెడ్డి షాక్‌కు గురయ్యారు. సీబీఐకి తాను చెప్పిన అంశాల్ని చెప్పినట్టుగా ఓ వర్గం మీడియా ప్రచారం చేయడంపై ఆయన అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీకి రాజకీయ ప్రయోజనం కలిగించేందుకు ఓ వర్గం మీడియా వైఎస్సార్ కుటుంబంపై ఎన్నో ఏళ్లుగా దుష్ప్రచారం చేస్తోందని వాపోయారు. అదే మీడియా తాను ఇవ్వని వాంగ్మూలాన్ని ఇచ్చినట్లుగా ప్రముఖంగా ప్రచురించి తమ కుటుంబంపై బురద జల్లుతోందని మండిపడ్డారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు, కేసును ప్రభావితం చేసేందుకు కుట్ర పన్నుతోందని అనుమానం వ్యక్తం చేశారు.
వివేకా హత్యకు గురైన సమాచారం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లినట్టు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో అభిషేక్‌రెడ్డి తెలిపారు. విగత జీవిగా పడి ఉన్న వివేకను చూడగానే షాక్‌కు గురైనట్టు తెలిపారు. చంపేసినట్టు స్పష్టంగా తెలుస్తున్నా గుండెపోటు అని ఎందుకు ప్రచారం చేశారో తనకు అర్థం కాలేదని సీబీఐకి వాంగ్మూలం ఇచ్చినట్టు రెండు రోజుల క్రితం వెలుగు చూసింది. తాను రాజకీయాల్లోకి కొత్తగా వచ్చానని, గుండెపోటు అని ఎందుకు ప్రచారం చేశారో తనకు అర్థం కాలేదని సీబీఐకి డాక్టర్ అభిషేక్‌రెడ్డి చెప్పినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
తాను సంఘటనా స్థలం నుంచి వెళ్లిపోయాక ఈసీ గంగిరెడ్డి, రాజారెడ్డి ఆస్పత్రులకు చెందిన కాంపౌండర్లు జయ ప్రకాశ్ రెడ్డి, శ్రీనివాసరెడ్డిలు వివేకానంద రెడ్డి మృతదేహనికి బ్యాండేజీలు వేసినట్లు తనకు తెలిసినట్టు సీబీఐకి అభిషేక్ చెప్పినట్టు మీడియాలో వచ్చింది. అంతేకాదు, వివేకాది హత్య అని స్పష్టంగా తెలుస్తున్నా, గుండెపోటుగా ప్రచారం జరగడం తనను కలవరపెట్టినట్టు డాక్టర్ అభిషేక్ సీబీఐకి వాంగ్మూలం ఇవ్వడం వైఎస్ కుటుంబాన్ని కలవరపాటుకు గురి చేసింది.
ఈ నేపథ్యంలో తన వాంగ్మూలం పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించడం గమనార్హం. తన వాంగ్మూలం పేరిట మీడియాలో ప్రచురితమైన విషయాలు పూర్తిగా అవాస్తవమని వైఎస్ అభిషేక్‌రెడ్డి స్పష్టం చేశారు. సీబీఐ అధికారులు తనను అడగని అంశాలు, తాను చెప్పని విషయాలను తన వాంగ్మూలంగా మీడియా ప్రచారం చేస్తోందని అన్నారు.
వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయినట్లు తనకు ఎవరూ చెప్పలేదని స్పష్టం చేశారు. ఓ వర్గం మీడియా దురుద్దేశపూరితంగా వైఎస్సార్ కుటుంబంపై దుష్ప్రచారం చేస్తోందని వాపోయారు.